ఆర్టికల్ 3జేపై కుట్రను అడ్డుకోవాలి
బహుళజాతి కంపెనీలకు వ్యతిరేకంగా ఉద్యమించాలి
ఆహార భద్రత చట్టం అవసరం
ప్రొఫెసర్ వందనాశివ డిమాండ్
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: విత్తనంపై రైతులకు హక్కును కల్పించే ఆర్టికల్ 3జేను మార్చేందుకు కొన్ని బహుళజాతి కంపెనీలు కుట్ర పన్నుతున్నాయని శాస్త్ర సాంకేతిక పర్యావరణ విజ్ఞానం జాతీయ కేంద్రం డెరైక్టర్ ప్రొఫెసర్ వందనా శివ ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రైతుల విత్తన హక్కుల రక్షణ వేదిక, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో ‘విత్తన సార్వభౌమత్వం, భారత స్వాతంత్య్రం-రాజ్యం, ప్రజా సంఘాల పాత్ర’ అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రొఫెసర్ వందనాశివ మాట్లాడుతూ ఆర్టికల్ 3జేను మార్చకుండా రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు. మాన్షంటో కంపెనీ ప్రపంచంలో వ్యవసాయాన్ని తమ గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తోందని విమర్శించారు. పత్తి విత్తనాలు, మొక్క జొన్నపై మాన్షంటో కంపెనీకి సంపూర్ణ హక్కు ఉందని, అయితే అవి ఆహార పంటలు కాదన్నారు. బీహార్లో 56 ఎకరాలకు మొక్కజొన్న విత్తనాలను సరఫరా చేస్తే పూర్తిగా నష్టం వచ్చిందని, ఐతే ఆ నష్టాన్ని ప్రభుత్వమే భరించింది తప్ప కంపెనీ కాదని విమర్శించారు.
కొన్ని నేలల్లో ఉపయోగకరమైన సూక్ష్మజీవులున్నాయని, వాటిని జన్యుపరమైన పంటలే నాశనం చేశాయన్నారు. జర్మనీలో బీటీ మొక్క జొన్నలు వేస్తే వాటిని తిన్న ఆవులు రోగాల భారిన పడ్డాయని, అక్కడ ఆవులను పిండితే పాలకు బదులు రక్తం వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని మన దేశంలో వేసిన పార్లమెంటరీ కమిటీ కూడా జన్యు మార్పిడి పంటలను వ్యతిరేకించిందన్నారు.
ఆహార భద్రత పేరుతో చట్టం రావాలని ఆమె కోరారు. బహుళజాతి కంపెనీలకు వ్యతిరేకంగా బలమైన ఉద్యమం చేపట్టాలని ఆమె పిలుపునిచ్చారు. వ్యవసాయ శాస్త్ర వేత్త ప్రొఫెసర్ కె.ఆర్.చౌదరి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రొఫెసర్ అరిబండి ప్రసాద రావు, రెలంగాణ రాష్ర్ట రైతు సంఘం కార్యదర్శి బొంతల చంద్రారెడ్డి, రైతు సంఘం అధ్యక్షుడు పి.జంగారెడ్డి, అఖిల భారత రైతు కూలి సంఘం నాయకులు వి.కోటేశ్వర్రావు, వి.ప్రభాకర్, కె.రంగయ్య, కెజి.రాంచందర్ పాల్గొన్నారు.