రూ.1కి రూ.10 ఖర్చు!
బి.కొత్తకోట, న్యూస్‌లైన్ : పావలా కోడికి ముప్పావలా మసాలా అన్నట్టుంది తిరుపతి టెలికం అధికారుల తీరు. ఖాతాదారుల లావాదేవీల పట్ల ఎంత చిత్తశుద్ధితో ఉంటారో చేతల్లో చూపించారు. బి.కొత్తకోటకు చెందిన బి.చాంద్‌బాషా జ్యోతిచౌక్‌లో ఎస్టీడీ బూత్ నిర్వహణకు రెండు టెలిఫోన్ కనెక్షన్లు తీసుకున్నాడు. కాలగమనంలో వీటికి ఆదరణ తగ్గింది. 2007లో ఎస్టీడీ నిర్వహణను మానుకున్నాడు. తనకున్న ఫోన్ కనె క్షన్లను తొలగించాలని అధికారులకు విన్నవించాడు. తర్వాత కనెక్షన్ కట్‌చేశారు.
ఇది జరిగి ఐదేళ్లవుతోంది. టెలికం అధికారులు వారికి రావాల్సిన బకాయిలను డిపాజిట్ నుంచి తీసుకున్నారు. మిగిలిన రూ.1ని నవంబర్ 14న తిరుపతి టెలికం జనరల్ మేనేజర్ కార్యాలయ అకౌంట్స్ అధికారి చెక్కు రూపంలో నవంబర్ 14న పంపారు. ఇది శుక్రవారం చాంద్‌బాషాకు చేరింది. దీన్ని చూసి ఆయన అవాక్కయ్యారు. కాగా ఈ చెక్కు విలువ రూ.2.5 పైసలు. దీనికి రూ.2 విలువైన ఒక లేఖ, రూ.5 స్టాంపు, రూ.1 విలువైన కవర్‌ను ఖర్చుచేశారు. రూపాయి పంపేందుకు రూ.10.5 పైసలు వ్యయం చేశారు. స్టేట్ బ్యాంకులో ఖాతా ఉంటే ఖర్చులేకుండా రూపాయిని చెల్లిస్తామని స్థానిక ఎస్బీఐ మేనేజర్ మారెడ్డి జగదీశ్వర్‌రెడ్డి చెప్పడం కొసమెరుపు.