ఆశల అంకురం
భాగ్యనగరంతో మూడు దశాబ్దాలుగా ముడిపడిన బంధంలో వెంటాడే జ్ఞాపకాలెన్నో! నేర్చుకున్న పాఠాలు ఇంకెన్నో! ఈ నగరానికి భాషాభేదం లేదు. కులమతాల తారతమ్యం లేదు. ప్రాంతీయ వివక్ష లేదు. అపారమైన జ్ఞానాన్ని అక్కున చేర్చుకుంటుందీ నగరం. ఆత్మవిశ్వాసానికి ఆలంబనగా నిలుస్తుందీ నగరం. ఇది నిజమని చెప్పే అనుభవాలెన్నో అంటున్నారు కోట శంకరరావు. నగరంతో తన అనుబంధం, ఇక్కడ తాను పొందిన అనుభవాలు ఆయన మాటల్లోనే...
- కోట శంకర రావు
ప్రముఖ నటుడు
చిన్నప్పటి నుంచి నాటకాలంటే మహా పిచ్చి. అందులో వేయని పాత్రలేదు. మహానటుడవుతావని చిన్నప్పుడు అందరూ అనేవాళ్లు. కానీ స్టేట్‌బ్యాంకు ఉద్యోగినయ్యాను. ఉద్యోగం చేస్తూనే నాటకాలు ఆడేవాడిని. 1987లో హైదరాబాద్‌కు బదిలీ అయింది. రామ్‌నగర్‌లో ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నా. బ్యాంకు నుంచి రాగానే రామ్‌నగర్ గుండు దగ్గర తోటి డ్రామా ఆర్టిస్టులతో కబుర్లు చెప్పుకోవడం దినచర్యగా ఉండేది. తనికెళ్ల భరణి, రాళ్లపల్లి వంటి వారు చర్చల్లో పాల్గొనేవాళ్లు. అప్పట్లో స్వీయ నిర్వహణలోని గౌరీశంకర్ ఆర్ట్స్ థియేటర్స్ బ్యానర్‌పై వేసిన నాటకాలు మధుర స్మృతులుగా ఉండేవి. వాటిని సిటీలో మళ్లీ మళ్లీ ప్రదర్శించాలనే కోరిక ఉండేది. అప్పటికే టీవీ సీరియల్స్‌లో బాగా నటిస్తుండే వాడిని. అన్నయ్య కోట శ్రీనివాసరావు బాగా రాణిస్తుండటంతో సినీ ప్రవేశానికి పెద్దగా ఐడెంటిటీ అవసరం లేదనిపించేది.
టీవీ కనెక్షన్
‘బాబూ... సీరియల్స్‌లో నీ వేషాలు బాగుంటున్నాయి. కానీ ఆ దుర్మార్గపు పాత్రలు ఎందుకు వేస్తున్నావ్?’ సికింద్రాబాద్‌లో ఓ వృద్ధురాలు నన్ను నిలదీయడం ఇప్పటికీ బాగా గుర్తు. బుల్లితెరకు నేను అంతగా కనెక్ట్ అయ్యానా? అన్న ఆలోచన అప్పుడే వచ్చింది. పిల్లలు పెద్దవాళ్లవ్వడంతో రాంనగర్ నుంచి సికింద్రాబాద్‌కు మారాను. అప్పుడొస్తున్న తెలుగు సీరియల్స్‌లో నేను లేకుండా ఏ ఒక్కటీ వచ్చేది కాదు. దాంతో నేనుండే ప్రాంతంలో చిన్నా పెద్ద నన్ను అబ్జర్వ్ చేసేవాళ్లు. ‘మీ పాత్రలు అలా ఉండాలి... ఇలా ఉండాలి...’ అని సూచనలు ఇచ్చేవాళ్లు.
ఫస్ట్ షాట్... కొంత ఫియర్
అనుకున్నట్టే సినిమా ఛాన్స్ వచ్చింది. ‘నాకూ పెళ్లాం కావాలి’ సినిమా. ఫస్ట్ షాట్. నాటకాల అనుభవం ఉంది కదా అనుకున్నాను. కానీ అక్కడికెళ్లాక కొత్తకొత్తగా అన్పించింది. నాటకాల్లో స్టేజీ లాంగ్వేజ్ ఉన్నట్టే సినిమాల్లో కెమెరా లాంగ్వేజ్ అవసరం. అది నాలో ఉన్న లోపమని గుర్తించాను. దాన్ని నేర్చుకోవడానికి కొంత కష్టపడాల్సి వచ్చింది.
ఏడు రోజుల టెన్షన్
అప్పుడు నేను సికింద్రాబాద్ ఎస్బీఐ బ్రాంచ్‌లో హెడ్ క్యాషియర్‌గా ఉద్యోగం చేస్తున్నాను. అదే సమయంలో నారాయణమూర్తి నిర్మిస్తున్న చీమల దండు సినిమా షూటింగ్ కోసం పెద్దాపురం వెళ్లాను. అప్పుడే హెడ్ ఆఫీస్ నుంచి బ్యాంక్‌లో తనిఖీ కోసం పై అధికారులు వచ్చారు. కీలకమైన పత్రాలున్న బీరువా తాళాలు నా దగ్గరున్నాయి. బ్యాంకు నుంచి రమ్మని సమాచారం. షూటింగ్ ఆపితే లక్షల్లో నష్టం. ఏం చేయాలని నారాయణ మూర్తిగారిని అడిగాను. వెళ్లాలనుకుంటే వెళ్లమని కాస్త బాధగానే చెప్పారు. వెళ్లకుంటే ఉద్యోగం పోతుంది...? టెన్షన్. ఆ టెన్షన్ వారం రోజులు. ఉద్యోగం పోయినా నాకు సినిమా కేరీరే ముఖ్యమనుకున్నా. తర్వాత వెళ్లి పై అధికారులను కలిసి, తప్పు ఒప్పుకున్నాను. వాళ్లూ అర్థం చేసుకున్నారు.
బుల్లితెర ఇచ్చినంతగా...
బ్యాన్ చేసిన ‘రమీజాబీ’ నాటకాన్ని రవీంద్రభారతిలో వేయాల్సి వచ్చినప్పుడు భయపడ్డాను. అక్కడే గొప్పగొప్ప వాళ్ల మధ్య ప్రశంసలు అందుకున్నాను. సినీరంగానికి ఎంతో చేశాననే భావన నాలో ఉంది. అయితే, బుల్లితెర నాకు భవిష్యత్తు ఇచ్చినంతగా వెండితెర నన్ను ఆదుకోలేదు.
గుమ్మడి, ఏఎన్ఆర్లతో అనుభవాలు...
షూటింగ్లో నా తడబాటు చూసి గుమ్మడిగారు నన్ను ఆప్యాయంగా చేరదీశారు. కెమెరా ముందు ఎలా ఉండాలో నేర్పారు. అప్పుడప్పుడు ఆయన వద్దకు వెళ్లేవాణ్ణి. ఆయన ద్వారానే నా భయాన్ని పోగొట్టుకున్నాను. సూత్రధారులు సినిమాలో వింత అనుభవం ఎదురైంది. మహానటుడు ఏఎన్ఆర్గారిని నిలదీసి, తిట్టిపోసే సన్నివేశం అది. కాస్త మార్చమని విశ్వనాథ్‌గారిని బతిమిలాడినా, ఆయన ససేమిరా అన్నారు. చెడ్డ వ్యక్తిని చంపడం కాదు, చెడును చంపాలనే మెసేజ్ నీ పాత్ర ద్వారా వెళుతుందని అక్కినేనిగారు ధైర్యం చెప్పారు. అనుకున్నట్లే ఆ పాత్ర హైలైట్ అయింది.
- వనం దుర్గాప్రసాద్
ఫొటోలు: ఎన్.రాజేష్‌రెడ్డి