బ్రీఫ్‌గా 'అమరావతి'కి చేరుకోవాలంటే..
హైదరాబాద్: అమరావతి.. ఆంధ్రప్రదేశ్ (కలల) రాజధాని. ఎల్లుండి శంకుస్థాపన జరగనున్న ఈ నగరంలో ఎన్నో వింతలు, మరెన్నో విశేషాలు. అలాంటి నగరఖ్యాతిని ఊరూరా ప్రచారం చేయాలనే ఉద్దేశంతో ఉత్సాహవంతులైన ఐటీ విభాగం తెలుగు తమ్ముళ్లు కొందరు సోమవారం హైదరాబాద్ నుంచి అమరావతికి 'ఏపీ క్యాపిటల్ రైడ్' పేరుతో సైకిల్ యాత్ర ప్రారంభించారు.
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ప్రారంభమైన ఈ యాత్రకు టీడీపీ నేతలు పయ్యావుల కేశవ్, అరెకెపూడి గాంధీ, మాగంటి బాబులు 'పచ్చ' జెండా ఊపారు. మోకాళ్లు, మోచేతులకు గార్డులు, కాళ్లకు బూట్లు, తలకు హెల్మెట్ లతో సైకిళ్లెక్కి రాజధానివైపు రయ్యిమన్నారు. వారీ స్పీడ్ చూస్తే ఆగకుండా అమరావతి దాకా వెళ్లేలా కనిపించారు. కానీ..
ర్యాలీ సిటీ శివారుకు చేరుకోగానే అసలు కథ మొదలైంది. అప్పటికే ఏర్పాటయిన ఓ లారీలోకి సైకిళ్లను ఎక్కించిన తెలుగు తమ్ముళ్లు.. ఎంచక్కా ఏసీ బస్సెక్కి కూర్చున్నారు! బస్సు వెనకే లారీ రాగా.. మరో ఊరు శివారులో సైకిళ్లను దించి యాత్ర చేయడం, ఊరు దాటగానే మళ్లీ బస్సెక్కడం.. అలా ఎక్కుతూ.. దిగుతూ సాగింది టీడీపీ 'సైకిల్ యాత్ర'. వీళ్ల డ్రామాలు చూసిన జనంలో కొందరు.. 'బ్రీఫ్ గా అమరావతికి చేరుకోవటం ఇలాగేనేమో!' అని ముక్కున వేలేసుకోగా మరికొందరు మాత్రం.. 'ముందు చక్రం ఎలా వెళ్తుందో... వెనక చక్రం కూడా అలానే వెళ్తుంది' అని సరిపెట్టుకున్నారు!