తేట తేట తెలుగు.. సాక్షి టీవీ వెలుగు
తేట తేట తెలుగులా...
తెలుగువారి వెలుగులా..
సమైక్య తేజంలా..
పదహారణాల తెలుగుదనం ఉట్టిపడేలా ఉండే యాంకర్లను, న్యూస్ రీడర్లను తెలుగు టీవీ చానళ్లలో చూసి ఎన్నళ్లయ్యింది? ఆడ.. మగ.. ఎవరైనా కూడా చొక్కాలు, వాటిపైన కోట్లు ధరించి తెలుగుదనానికి సుదూరంగా ఉంటున్న ఈ రోజుల్లో 'సాక్షి టీవీ' ఓ సరికొత్త ముందడుగు వేసింది. మొత్తం యాంకర్లు, న్యూస్ రీడర్లు అందరూ అచ్చమైన తెలుగు దుస్తులనే ధరించేలా ఓ 'డ్రస్ కోడ్' పాటిస్తోంది. ఆడవాళ్లంతా ఆరుగజాల చీరలు, మగవాళ్లంతా కుర్తాలు ధరించేలా తనకు తానుగా ఓ నిబంధన విధించుకుంది. బుల్లి తెరపై నిండుగా.. తెలుగుదనం ఉట్టిపడేలా నూటికి నూరుపాళ్ల తెలుగు దుస్తులతో కనిపించేలా చర్యలు తీసుకుంది.
సమైక్యాంధ్ర కోసం తెలుగువాళ్లు ఉధృతంగా పోరు సాగిస్తున్న ప్రస్తుత తరుణంలో తెలుగువారంతా ఒక్కటేనన్న భావనతో తెలుగుదనాన్ని ప్రస్ఫుటంగా కనిపించేలా చేయాలన్న ఏకైక లక్ష్యంతో సాక్షి టీవీ ఈ నిర్ణయం తీసుకుంది. దేశంలో 28 రాష్ట్రాలున్నా, ప్రతి ఒక్క రాష్ట్రానికీ వాళ్ల సొంత దుస్తుల రీతి ఉంది. గతంలో ఉత్తరాది వాళ్లు దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరినీ 'మదరాసీలు' అనేవాళ్లు. ప్రధానంగా ఇక్కడివారు చీరలు కట్టుకోవడం వల్లే అలా పిలిచేవాళ్లు. కానీ, వాస్తవానికి తమిళులు, మళయాళీలు, తెలుగువారు.. ఇలా ప్రతి ఒక్కరికీ చీరకట్టులో వైవిధ్యం కనపడుతుంది. తెలుగువాళ్లు చీరకట్టుకునే తీరును ఆ తర్వాతి కాలంలో చాలామంది ఫాలో కావడం మొదలుపెట్టారు. అలా తెలుగువారికే ప్రత్యేకమైన చీరకట్టును టీవీ చానళ్లు మాత్రం దాదాపుగా మర్చిపోయాయి. అందుకే.. ఇప్పుడు మళ్లీ దాన్ని గుర్తుచేసే ఉద్దేశంతో, తెలుగువారందరినీ ఒక్కటిగా చూపించాలన్న సదుద్దేశంతో సాక్షి టీవీ తమ యాంకర్లు, న్యూస్ రీడర్లకు తెలుగుదనం ఉట్టిపడే దుస్తులు ఇస్తోంది.