Telugu book of record
-
నాలుగేళ్లకే 198 రాజధానుల పేర్లు చెప్పి...రికార్డు సృష్టించింది
తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): నాలుగేళ్లకే 198 దేశాలు.. వాటి రాజధానులు టకటకా చెప్పేసింది. అదీ కేవలం రెండున్నర నిమిషాల్లో.. చాలా మందికి అసాధ్యమనుకునే ఈ ఘనతను సాధించి రికార్డులకెక్కింది. స్కూల్ ముఖం కూడా చూడని ఆ వయసులో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో పేరు లిఖించుకుంది. ఆమే ఎండాడకు చెందిన దత్తు ప్రకాష్, దత్తు అపర్ణల ముద్దుబిడ్డ దత్తు శ్రీ నందన. శ్రీనందన చిన్నప్పటి నుంచి టీవీ, మొబైల్‌కు వంటి వాటికి ఆకర్షణకు గురి కాకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించారు. చిన్నారిలో అంతర్లీనంగా దాగి ఉన్న తెలివితేటలు, జ్ఞాపకశక్తిని గుర్తించి.. కథలో పాటు జనరల్ నాలెడ్జ్ అంశాలు వివరించే ప్రయత్నం చే శారు. అలా 198 దేశాల పేర్లు, రాజధానులు నేర్పించారు. నాలుగేళ్లకే అవన్నీ గుర్తుకు పెట్టుకున్న నందన కేవలం రెండున్నర నిమిషాల్లోనే దేశాలు– రాజధానులు టకటకా చెప్పి.. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది. ప్రస్తుతం చిన్నారి వయసు ఏడేళ్లు. ఇప్పుడు ప్రపంచంలోని మొత్తం దేశాలు వాటి తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ సరిహద్దులను ఠక్కున చెబుతోంది. ఈ చిన్నారి తన మైండ్‌లో గ్లోబ్ మొత్తం గుర్తుకు పెట్టుకుంది. ప్రపంచ దేశాలు, నాలుగు సరిహద్దులకు సంబంధించి దాదాపు 800 ప్రశ్నలకు సమాధానాలను కొన్ని సెకన్లలో చెప్పేస్తోంది. ఇది కేవలం మైండ్ మ్యాపింగ్ అనే పద్ధతి ద్వారా మాత్రమే సాధ్యమని ఆమె తల్లిదండ్రులు అంటున్నారు. ఈ ఈవెంట్‌తోనే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు కోసం ప్రయత్నం చేసింది. ఇటీవల పిక్ ఏ బుక్ వేదికపై జరిగిన ఈవెంట్లో న్యాయనిర్ణేతల సమక్షంలో శ్రీనందన ప్రదర్శనను రికార్డ్ చేసి.. గిన్నిస్ బుక్ ప్రతినిధులకు పంపించారు. ఆమె ప్రతిభను గుర్తించిన నాటి కలెక్టర్ ప్రవీణ్ ప్రకాష్ మొదలు స్థానిక నాయకులు, గాయకులు, ప్రముఖులు ఇలా ఎందరో శ్రీనందనను ప్రశంసించారు. పలు టీవీ షోలు, ఎఫ్‌ఎంలలో శ్రీనందన తన అనుభవాలను పంచుకుంది. (చదవండి: ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం ) -
10 వేల చుక్కల ముగ్గు..!
సాక్షి, చిత్తూరు అర్బన్: ముగ్గులు మన సంప్రదాయ చిహ్నాలకు గుర్తులు. చిన్న పిల్లల నుంచి ప్రతీ ఒక్క మహిళ ముగ్గులు వేస్తుంటారు. చిత్తూరు నగరం దుర్గానగర్ కాలనీకు చెందిన సవిత అనే గృహిణి మాత్రం ముగ్గులు వేయడంలో రికార్డులు సృష్టిస్తుంటారు. గత 20 ఏళ్లుగా ముగ్గుల్లో ఉన్న అన్ని కోణాలను విశ్లేషించిన ఈవిడ కొత్తగా ఏదైనా రికార్డు సృష్టించాలనుకున్నారు. శనివారం చిత్తూరు నగరంలోని కట్టమంచిలో ఉన్న కళ్యాణ మండపం ఆవరణలో ఏకంగా 1600 చదరపు అడుగుల విస్తీర్ణంలో 10 వేల చుక్కలతో ముగ్గువేసి సరికొత్త రికార్డు సృష్టించారు. సవిత ఒక్కటే ఏడు గంటల పాటు శ్రమించి ముగ్గు వేయడం అక్కడున్న ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంది. ముగ్గు మధ్యలో ప్రకృతిని కాపాడాలంటూ ఓ సందేశాన్ని సైతం ఇచ్చారు. ఆమె ముగ్గు వేస్తున్నంతసేపు అక్కడే ఉన్న తెలుగు బుక్ ఆఫ్ రికార్డు ప్రతినిధి శ్రీనివాసులు సవితను మెచ్చుకుంటూ తమ పుస్తకంలో ఆమెకు స్థానం లభించినట్లు పేర్కొన్నారు. ముగ్గు పూర్తయిన తరువాత సవితకు ధృవీకరణ పత్రం అందచేశారు. -
బెజవాడ వాసికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్సులో చోటు
విజయవాడ :బెజవాడ నగరానికి చెందిన రచయిత పట్టాభిరామ్ తుర్లపాటి (47)కు తెలుగు బుక్ ఆఫ్ రికార్ట్స్‌లో స్థానం దక్కింది. లండన్‌లోని ‘తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్’ వివిధ రంగాల్లో అద్భుత రికార్డులను సృష్టించే తెలుగువారికి ఈ అవార్డు ఇస్తుంది. ఇప్పటివరకు ఇంగ్లిష్‌లో 75 పుస్తకాలను రచించిన రచయితలుండగా, పట్టాభిరామ్ 200కి పైగా ఇంగ్లిషు రచనలు చేశారు. ఈ అరుదైన రికార్డును గుర్తిస్తూ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఆయన పేరు నమోదు చేశారు. పట్టాభిరామ్ ఎంఎ (ఇంగ్లిష్), ఎంఎ (సోషియాలజీ) ఎంఎ (సైకాలజీ), ఎంఫిల్‌తో పాటు జర్నలిజంలోనూ పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేశారు. ఆదివారం సాయంత్రం విజయవాడలోని ఐలాపురం హోటల్లో జరిగే ఒక కార్యక్రమంలో ఆయన ఈ అవార్డును అందుకోనున్నారు. ఆయన పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌కు కూడా పంపాలని కొంతమంది ప్రవాసాంధ్రులు ప్రయత్నాలు ప్రారంభించారు. పట్టాభిరామ్ ప్రస్తుతం స్కోర్ మోర్ యూత్ మాసపత్రికకు చీఫ్ ఎడిటర్ అండ్ పబ్లిషర్‌గా, ఇండియన్ బ్యాడ్మింటన్ హౌస్ పత్రికకు రెసిడెంట్ ఎడిటర్‌గా, జర్నలిస్టు వ్యూస్ అండ్ న్యూస్ మాస పత్రికకు ఎగ్జిక్యూటివ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. స్కోర్ అండ్ ఎడ్యుకేషన్ సంస్థకు వ్యవస్థాపక సీఈవోగా పనిచేస్తూ పేద విద్యార్థుల అభ్యున్నతికి సహాయ సహకారాలు అందిస్తున్నారు.