ఆశల పల్లకిలో...
►నేటి నుంచి యూత్ ఒలింపిక్స్
►15 క్రీడాంశాల్లో భారత్ పోటీ
►బరిలో నలుగురు తెలుగు క్రీడాకారులు
నాన్జింగ్ (చైనా): మరో క్రీడల వేడుకకు రంగం సిద్ధమైంది.యువతలో క్రీడలపట్ల చైతన్యం కలగాలనే ఉద్దేశంతో 2010లో ఆరంభించిన యూత్ ఒలింపిక్స్ విజయవంతమయ్యాయి. నాలుగేళ్ల తర్వాత మరోసారి ఈ క్రీడలకు తెరలేవనుంది. శనివారం మొదలయ్యే ఈ మెగా ఈవెంట్‌కు చైనాలోని నాన్జింగ్ నగరం ఆతిథ్యం ఇస్తోంది. 13 రోజులపాటు జరిగే ఈ క్రీడల్లో 204 దేశాల నుంచి 3,600 మంది యువ క్రీడాకారులు 28 క్రీడాంశాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. భారత్ నుంచి 15 క్రీడాంశాల్లో 32 మంది బరిలోకి దిగనున్నారు.
నాలుగేళ్ల క్రితం 2010లో సింగపూర్‌లో జరిగిన తొలి యూత్ ఒలింపిక్స్ క్రీడల్లో భారత్ నుంచి 13 క్రీడాంశాల్లో 32 మంది పాల్గొన్నారు. ఆరు రజతాలు, రెండు కాంస్యాలతో కలిపి భారత్ మొత్తం ఎనిమిది పతకాలు నెగ్గి పతకాల పట్టికలో 58వ స్థానంలో నిలిచింది.
ఈసారి నలుగురు తెలుగు క్రీడాకారులు నాన్జింగ్ గేమ్స్‌లో బరిలోకి దిగనున్నారు. ఆర్చరీలో బోడ హేమలత (నల్లగొండ), బ్యాడ్మింటన్‌లో గద్దె రుత్విక శివాని (హైదరాబాద్), బాక్సింగ్‌లో కాకర శ్యామ్ కుమార్ (విశాఖపట్నం), వెయిట్‌లిఫ్టింగ్‌లో రాగాల వెంకట్ రాహుల్ (రంగారెడ్డి) పోటీపడనున్నారు. గత రెండేళ్లుగా యూత్ విభాగంలో పలు అంతర్జాతీయ పోటీల్లో పతకాలు నెగ్గిన రాగాల వెంకట్ రాహుల్‌పై... బాక్సర్ శ్యామ్ కుమార్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. క్రితంసారి ఒక్క స్వర్ణం కూడా నెగ్గలేకపోయిన భారత్ ఈసారి ‘పసిడి’ బోణీ చేస్తుందో లేదో వేచి చూడాలి.