అమరావతిలో తెలుగు శిలాఫలకాలు ప్రతిష్టించాలి
విజయవాడ (గాంధీనగర్): తెలుగులో రూపొందించిన భూమిపూజ, రాజధాని, తాత్కాలిక సచివాలయ శంకుస్థాపన శిలాఫలకాలను ఉగాదిలోగా రాజధాని అమరావతిలో ప్రతిష్టించాలని, లేకపోతే గాంధేయ మార్గంలో నిరసన తెలుపుతామని మాజీ ఎంపీ డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలిపారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రిని కలిసి పలు అంశాలపై వినతిపత్రం సమర్పించినట్లు చెప్పారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలుగు భాష, సాంస్కృతిక రంగాల అభివృద్ధికి పలు కార్యక్రమాలు చేపడతామని టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలోనూ, తెలుగుభాషా దినోత్సవం సందర్భంగా చంద్రబాబు వాగ్దానాలు చేసినట్లు గుర్తుచేశారు. ఆ రెండింటిలో ఏ ఒక్కటి అమలు కాలేదని ముఖ్యమంత్రికి సమర్పించిన వినతి పత్రంలో పేర్కొన్నట్లు ఆయన చెప్పారు.
రాజమండ్రి కేంద్రంగా ఏర్పాటు చేస్తామన్న తెలుగు విశ్వవిద్యాలయం పనులు నత్తనడకన నడుస్తున్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్‌ను తెలుగులో ప్రవేశపెడితే మన ప్రభుత్వం సిగ్గుతో తలదించుకునేలా ఆంగ్లభాషలో ప్రవేశపెట్టిందని ఎద్దేవా చేశారు. చెన్నైలోని పొట్టి శ్రీరాములు మెమోరియల్ సొసైటీ ఆధీనంలోని బిల్డింగ్ నిర్వహణకు రూ.10 లక్షల బకాయిలు చెల్లించే విషయమై ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా అధికారుల్లో కదలిక రాలేదన్నారు. ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకు తెలుగును ఒక సబ్జెక్టుగా బోధించేలా చర్యలు చేపడతామని చెప్పిన చంద్రబాబు నేటికీ ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం, పాఠ్య ప్రణాళిక రూపొందించకపోవడం బాధాకరమని యార్లగడ్డ పేర్కొన్నారు. ఈ విషయాలన్నింటినీ సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారన్నారు.