తెలుగు వారి పెళ్లి
పవిత్రంగా మండే అగ్నిహోత్రం... ఆ వెలుతురులో కొత్త జీవితానికి పునాదులు వేసుకునే ఆనందంలో నవ వధూవరులు... నలుదిక్కులా శ్రావ్యంగా వినిపించే వేదమంత్రాలు... దానికి అనుగుణంగా మోగే మంగళవాయిద్యాల చప్పళ్లు... మనస్పూర్తిగా దీవించే పెద్ద మనుషులు... వెరసి తెలుగు ఇంటిలో పెళ్లి తంతు. దేవతలకైనా సాధ్యమయ్యేనా అనేలా జరిగే ఈ హిందూ వివాహ క్రతువుపై ప్రపంచమే మనసు పడింది. అందుకే ఎంతో మంది విదేశీయులు ఈ తరహాలో వివాహం చేసుకునేందుకు ఇష్టపడుతున్నారు. పెళ్లిలో చదివే మంత్రాలు, చేసే వాగ్దానాలు, కట్టుకునే నగలు, ఆడుకునే ఆటలు అన్నింటికీ ఓ అర్థం ఉంది. ఆ అర్థం ఏంటో చూస్తే... విజయనగరం మున్సిపాలిటీ
దిష్టి తగలకుండా బాసికలు
వధూవరుల నుదుటిపై శోభించే ఆభరణమే బాసిక. దీన్ని పూలతో, బియ్యపు గింజల కూర్పుతో, ముత్యాలతో తయారు చేస్తారు. నరుని దృష్టికి నల్లరాయైనా పగులుతుందనేది శాస్త్రం. అందుకే దృషి దోష నివారణకు బాసికాన్ని కడతారు. మన శరీరంలో ఉన్న మొత్తం నాడుల్లో ముఖ్యమైన మేడు నాడులు ఇడ, పింగళ, సుషుమ్న, వీటి అధిదేవతలుగా త్రిమూర్తులను చెప్తారు. ఆ మూడు నాడులు కలిసే చోటు లలాట మధ్య స్థానం. రెండు కనుబొమ్మల మధ్య స్థానం ఆజ్ఞాచక్రం. అలాంటి సున్నిత భాగాలపై దృష్టి దోషం తగలకుండా ఉండటానికి బాసికాన్ని కడతారు.
బ్రహ్మరంద్రాన్ని తెరిచే జీలకర్ర, బెల్లం
జీలకర్ర, బెల్లం కలిపితే ధన విద్యుత్ ఉత్పన్నమై వస్తువులను ఆకర్షించే శక్తి కలుగుతుందని సైన్స్ చెబుతోంది. తలపై ఉండే బ్రహ్మరంధ్రం వీటిని ఉంచడం వల్ల తెరుచుకుంటుంది. వధూవరులు ఒకరి తలపై మరొకరు ఉంచిన చేతల ద్వారా వారి శక్తి ఈ మిశ్రమం ద్వారా బ్రహ్మరంధ్రంలో ప్రవేశించి, ఆ కిందుగా ఉన్న సహస్రార చక్రం ద్వారా మధ్యలో ఉన్న ఆజ్ఞాచక్రం ద్వారా వెలువడి ఆకర్షణ కలుగుతుంది. అలాగే మధ్యలోఉంచే తెరకు కూడా అర్థం ఉంది. వధువును జీవాత్మగా, వరుడిని పరమాత్మగా భావిస్తే మధ్యలో ఉండే తెర మాయ. జీవాత్మకు పరమాత్మ దర్శనం కావాలంటే మాయను తొలిసారి తలపై చేతులు ఉండగా భ్రూమధ్య స్థానంలోనే చూస్తారు. అలాగే జీలకర్ర, బెల్లం మిశ్రమం బాగా కలిసిపోతుంది. అలా వధూవరులు కలిసిపోవాలని పూర్వీకులు ఈ సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు.
కన్యాదానం....
దానం చేస్తే ఆ వస్తువుతో మనకు అన్ని సంబంధాలు తెగిపోతాయి. కానీ పెళ్లిలో మాత్రం కాదు. దానాలలో అతి శ్రేష్టమైనది కన్యాదానం. పెళ్లికూతురి తండ్రి తన కూతురిని వరుడికి దానం ఇస్తారు. దానమేదైనా ‘తుభ్యమహ సంప్రదదే న మమః’ అని పలికి దానమిస్తారు. అంటే దానమిచ్చిన వస్తువుపై ఇంక నాకు ఏ అధికారం లేదు అని అర్థం. కానీ కన్యాదానం చేసినపుడు న మమ అనరు. ఎందుకంటే తల్లిదండ్రులకు కూతురుతో ఉన్న బంధం పెళ్లితో ముగిసిపోదు ఇంకా పెరుగుతుంది.
బ్రహ్మముడి..
వధువ చీర అంచును, వరుడి ఉత్తరీయం చివరలను కలిపి ముడి వేయటం అంటే జీవితాంతం ఆశీస్సులను, బ్రాహ్మణాశీర్వచనాలను దంపతుల కొంగులతో ముడివేయటమే. వధూవరుల బంధం శాశ్వతంగా, స్థిరంగా ఉండాలని ఈ ముడి వేయిస్తారు.
ఉంగరాలు తీయటం....
చూడటానికి చాలా సరదాగా కనిపించే తంతు ఇది. పోటీ పడి గెలవాలనే పట్టుదలని, అంతలోనే తను ఓడిపోయి ఎదుటి మనిషిని గెలిపించాలనే ప్రేమ భావనని చిగురింపజేస్తుంది.
మంగళ సూత్రం బతుకు సూత్రం
సూత్రం అంటే దారం. మంగళప్రదమైంది కనుగ మంగళసూత్రం. ఇది వైవాహిక జీవితం నుంచి సమస్త కీడులను తొల గిస్తుందని నమ్మకం. ఈ మాంగల్యాన్ని వరుడు, వధువు మెడలో వేసి మూడుసార్లు ముడి వేస్తాడు. మనకు మూడుతో విడదీయరాని సంబంధం ఉంది. త్రిమూర్తులు, త్రిగుణాలు, త్రికాలాలు, ఇలా ఏది చూసినా మూడే ఉంటాయి. అలా మూడుకు ఉన్న ప్రాధాన్యాన్ని బట్టి ముడులు కూడా మూడు ఉన్నాయి. అలాగే మనకు స్థూల, సూక్ష్మ, కారణ అని మూడు శరీరాలు ఉన్నాయి. ఆ మూడు శరీరాలకు మూడు ముళ్లు అనే అర్థం కూడా ఉంది. కాబట్టి స్థూల శరీరం ఉన్నా, లేకున్నా వారి మధ్య ఆ బంధం ఉండాలి అనేది అందులోని పరమార్థం. అప్పుడు చదివే మం త్రం ‘మాంగల్యం తంతునానేనా మమ జీవన హేతునా, కంఠే బద్నామి శుభగే త్వంజీవ శరదాం శతమ్’ అంటే నా జీవితానికి కారణమైన ఈ సూత్రంతో ‘నేనే నీ మెడలో మాంగళ్యం అనే ఈ బంధాన్ని వేస్తున్నాను. నీ మెడలోని మాంగల్యంతో నీవు శతవసంతాలు జీవించాలి. నీ మాంగళ్యమే నాకు రక్ష. నా జీవితం , నా జీవనగమనం, దీనిపైనే ఆధారపడి ఉంది’ అని అర్థం.
తలంబ్రాలు...
దూవరుల భావి జీవితం మంగళమయం కావటానికి మంగళద్రవ్యాలచే చేయించే పవిత్ర కర్మ ఈ తలంబ్రాలు. వీటికి వాడేవి అక్షతలు. అక్షత అంటే విరిగిపోనివి అని అర్థం. ఇక దానికి బియ్యాన్నే ఎందుకు ఉపయోగిస్తారంటే బియ్యం ఇంటి నిండా సమృద్ధిగా ఎప్పుడూ ఉండాలని, గృహస్థు ఇంట్లో ధాన్యానికి ఎప్పుడూ కొరత లేకుండా ఉండాలని వాడతారు. ఇది వివాహంలోని ముఖ్య ఘట్టం.
పాణిగ్రహణం...
కన్యచేతిని వరుడు గ్రహించటమే పాణిగ్రహణం. వరుడు తన కుడి చేతితో వధువు కుడిచేతిని సమంత్రకంగా పట్టుకోవటం. ఇకపై నేనే నీ రక్షణ భారం వహిస్తానని సూచించటానికి, పురుషుని కుడి చేయి బోర్లించి, స్త్రీ కుడి చేయి పైకి ఉండేలా చేయి పట్టుకోవాలి. దీనికి అర్థం ఇంటి యజమానురాలిగా, ఇంటిని తీర్చిదిద్దే ఇల్లాలిగా ఇంటికి రమ్మని ఆహ్వానించటం.