కల ఫలించింది
ప్రపంచకప్‌కు అంబటి రాయుడు ఎంపిక 15 మంది సభ్యులతో భారత జట్టు ప్రకటన దశాబ్దన్నర తర్వాత తెలుగు రాష్ట్రాల క్రికెటర్ ప్రపంచకప్ కోసం భారత జట్టులోకి ఎంపికయ్యాడు. 1999 ప్రపంచకప్‌లో అజహర్ తర్వాత మళ్లీ ఇన్నేళ్లకు హైదరాబాదీ అంబటి తిరుపతి రాయుడు ప్రపంచకప్ ఆడబోతున్నాడు.
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో ఫిబ్రవరి 14 నుంచి జరిగే ఈ మెగా టోర్నీ కోసం 15 మందితో కూడిన భారత జట్టును మంగళవారం ప్రకటించారు. ఇటీవల నిలకడగా ఆడుతున్న యువ క్రికెటర్లకే పెద్ద పీట వేసిన సెలక్టర్లు... యువరాజ్ సహా సీనియర్లందరినీ విస్మరించారు. స్టువర్ట్ బిన్నీ మినహా దాదాపుగా ఊహించినట్లుగానే జట్టు ఉంది.
మూడు ప్రపంచకప్‌ల తర్వాత
ఈసారి ప్రపంచకప్ జట్టులో తెలుగు తేజం 29 ఏళ్ల అంబటి తిరుపతి రాయుడు చోటు దక్కించుకున్నాడు. గతంలో తెలుగు రాష్ట్రాల నుంచి సయ్యద్ ఆబిద్ అలీ (1975లో) అజహరుద్దీన్ (1987, 1992, 1996, 1999లో), వెంకటపతిరాజు (1992, 1996లో) ప్రపంచకప్‌లు ఆడారు. 1999 ఇంగ్లండ్ ప్రపంచకప్‌లో అజహరుద్దీన్ ఆడిన తర్వాత... మూడు ప్రపంచకప్‌లలో తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరూ జట్టులో స్థానం దక్కించుకోలేదు. ఎట్టకేలకు రాయుడు ఈ కొరత తీర్చాడు. 2004లో అండర్-19 ప్రపంచకప్‌లో భారత్‌కు సారథిగా వ్యవహరించిన రాయుడుకు... ఇన్నేళ్ల తర్వాత సీనియర్ ప్రపంచకప్ ఆడే అవకాశం లభించింది.
‘మా అబ్బాయి ప్రపంచకప్‌కు ఎంపిక కావడం నిజంగా మాకు పండగ రోజు. తల్లిదండ్రులుగా మాకు ఇంతకంటే ఆనందకరమైన క్షణం మరొకటి లేదు. ఆటగాడిగా రాయుడు చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు. ఇన్నేళ్ల మా కష్టానికి కూడా ప్రతిఫలం దక్కిందనే తృప్తి ఇప్పుడు లభించింది. రాయుడు బాగా ఆడితే, మన జట్టు గెలిస్తే అదంతా బోనస్ లాంటిదే. కానీ ఇది మాత్రం మా జీవితంలో అత్యంత మధుర క్షణం’
- ‘సాక్షి’తో రాయుడు తల్లిదండ్రులు సాంబశివరావు, విజయలక్ష్మి