తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారాలు వీరికే
నాంపల్లి : తెలుగు సాహిత్యంలోని భిన్న ప్రక్రియల్లోని నాట్యం, నాటకం, అవధానం, పత్రికా రచన, మహిళాభ్యుదయం, గ్రంథాలయం, సంఘసేవ, జానపద కళలు, ఇంద్రజాలం, లలిత సంగీతం, జ్యోతిష్యం, కార్టూన్, గజల్ తదితర రంగాల్లో విశేషమైన సేవలందించిన 39 మంది ప్రముఖులకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2015వ సంవత్సరానికి కీర్తి పురస్కారాలను ప్రకటించింది. విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య యశస్వీ సత్యనారాయణ అధ్యక్షతన ఏర్పాటైన నిపుణుల సంఘం ఉభయ రాష్ట్రాలకు చెందిన ప్రముఖులను పురస్కార గ్రహీతలుగా ఎంపిక చేసింది.
పురస్కారాలకు ఎంపికైన వారిలో దేవులపల్లి కృష్ణమోహన్ (సృజనాత్మక సాహిత్యం), సయ్యద్ నసీర్ అహ్మద్ (పరిశోధన), పులిగడ్డ విశ్వనాథరావు (హాస్య రచన), హైమావతి భీమన్న (జీవిత చరిత్ర), జ్వలిత (ఉత్తమ రచయిత్రి), హెచ్.కె.వందన (ఉత్తమ నటి), సత్కళా భారతి సత్యనారాయణ (ఉత్తమ నటుడు), అత్తలూరి విజయలక్ష్మి (ఉత్తమ నాటక రచయిత), భూపతి నారాయణమూర్తి (హేతువాద ప్రచారం), తంగెళ్ళ శ్రీదేవి (ఉత్తమ రచయిత్రి), దాసరాజు రామారావు(వచన కవిత/గేయ కవిత), నోముల సత్యనారాయణ (వివిధ ప్రక్రియలు) తెలకపల్లి రవి (పత్రికా రచన), చెంచు సుబ్బయ్య (అవధానం), సుమిత్ర అంకురం (మహిళాభ్యుదయం), ఆచార్య రామారెడ్డి (గ్రంథాలయ కర్త), ఆచార్య చంద్రÔó ఖర రావు( గ్రంథాలయ సమాచార విజ్ఞానం), విహారి (కథ), గంగోత్రి సాయి (నాటక రంగం), డాక్టర్ సజ్జాద్(సంఘసేవ, నిరంతర విద్య, వ్యక్తిత్వ వికాసం), వి.రమణి( ఆంధ్రనాట్యం), జాతశ్రీ(నవల), ఆచార్య బి.రామకృష్ణారెడ్డి( భాషాచ్ఛంద స్సాహిత్య విమర్శ), శింగారపు ఓదెయ్య(జానపద కళలు), బూర్గుల శ్రీనాథ శర్మ (ఆధ్యాత్మిక సాహిత్యం), పల్లేరు వీరాస్వామి (సాహిత్య విమర్శ), వెలుదండ సత్యనారాయణ (పద్యం), పద్మ మోహన్ యాదగిరి (సాంస్కృతిక సంస్థా నిర్వహణ), పి.వి.అరుణాచలం(జనరంజక విజ్ఞానం), సి.నాగేశ్వర రావు(జానపద గాయకులు), వి.ఆర్.శర్మ (బాలసాహిత్యం), విశ్వనాథ్ జోషి (ఇంద్రజాలం), జి.యాదగిరి (పద్య రచన), పాప(కార్టూనిస్ట్), ఎ.శారదారెడ్డి (లలిత సంగీతం), రేవతి రత్నస్వామి( శాస్త్రీయ సంగీతం), ఆచార్య సివిబి.సుబ్రహ్మణ్యం (జ్యోతిషం), దాశరథుల బాలయ్య (తెలుగు గజల్), నిడమర్తి నిర్మలాదేవి (కాల్పనిక సాహిత్యం) ఎంపికయ్యారు. ఈ నెల 30, 31వ తేదీల్లో హైదరాబాదులోని పబ్లిక్‌గార్డెన్స్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నందమూరి తారక రామారావు కళా మందిరంలో జరిగే ప్రత్యేక కార్యక్రమాలలో ఈ పురస్కారాలను ప్రదానం చేస్తామని రిజిస్ట్రార్ ఆచార్య వి.సత్తిరెడ్డి తెలిపారు.