నెల్లూరును మహానగరం చేస్తా
రాబోయే రోజుల్లో నెల్లూరును మహానగరంగా తీర్చిదిద్దుతానని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. స్థానిక వీఆర్ కళాశాల మైదానంలో బుధవారం జరిగిన ప్రజాగర్జనలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఉన్నన్ని వనరులు మరెక్కడా లేవన్నారు. ఈ వనరులను వినియోగించి నగరాన్ని పారిశ్రామిక నగరంగా మారుస్తామన్నారు.
అవసరమైతే ఒకటి, రెండు రింగ్ రోడ్లను నిర్మిస్తామన్నారు. తన హయాంలో ఇఫ్కోకు స్థలాన్ని కేటాయించామన్నారు. దాన్ని రానివ్వకుండా చేసిన ఘనత కాంగ్రెస్‌దేనన్నారు. నగరంలో ఎయిర్‌పోర్ట్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. చెన్నైకి దగ్గరగా ఉండటంతో జిల్లాను పారిశ్రామిక కారిడార్‌గా రూపొందిస్తామన్నారు. కృష్ణపట్నం, దుగరాజపట్నం పోర్టుల ను అభివృద్ధి చేస్తామని చెప్పారు. మ త్స్యకారుల వేటకు సెలవులు ప్రకటిం చిన రోజుల్లో 100 కేజీలు బియ్యం, నగదు ఇస్తామన్నారు. మత్స్యకార హార్బర్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. పెన్నా, కండలేరు, సోమశిల ఉత్తరకాలువ అభివృద్ధి పనులు చేసి వ్యవసాయానికి పూర్వవైభవం తీసుకొస్తామన్నారు.
ఏళ్ల తరబడి పార్టీ జెండాలను భుజాన మోసిన వారికి అన్యాయం చేయబోమన్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు నిజాయితీ గల ఇతర పార్టీల నాయకులను తీసుకుంటున్నామని, దీన్ని కార్యకర్తలు అర్థం చేసుకోవాలన్నారు. చరిత్ర తిరగరాసే ఈ సమయంలో విజ్ఞతతో వ్యవహరించాలని కోరారు.
పార్టీలో చేరిక
చంద్రబాబు సమక్షంలో సర్వేపల్లి ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్‌రెడ్డి, నగర ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి టీడీపీలో చేరారు. వీరికి పార్టీ కండువాలు కప్పి బాబు పార్టీలోకి ఆహ్వానించారు. వీరి అనుచరులు కూడా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.