రాజకీయ పార్టీ పెట్టాలనుకున్న దాసరి
చలనచిత్ర రంగంలో రికార్డు స్థాయిలో సినిమాలకు దర్శకత్వం వహించి, అనేక మందిని వెండితెరకు పరిచయం చేసిన దాసరి నారాయణరావు రాజకీయాల్లోనూ రాణించారు. కాపు సామాజికవర్గంలో మంచి పేరు సంపాదించుకున్న ఆయన 1996లో కాపు సామాజికవర్గాన్ని ఆలంబనగా చేసుకొని తెలుగుతల్లి పేరుతో ఓ రాజకీయ పార్టీ స్థాపించాలని ప్రయత్నించారు. కాని కాంగ్రెస్ పార్టీ ఆ ప్రయత్నాన్ని అడ్డుకుంది. పార్టీపరంగా సముచిత గౌరవమిస్తామని ప్రకటించడంతో పార్టీ ఏర్పాటు ప్రక్రియను విరమించుకున్నారు. దీంతో 1996, 1998, 1999 ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ తరపున ప్రచారం చేశారు.
దాసరి అందించిన సేవలకు ప్రతిగా ఆయనను కాంగ్రెస్ పార్టీ రెండు వేల సంవత్సరంలో రాజ్యసభ సభ్యుడిగా నియమించింది. 2004లో యూపీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కేంద్రంలో బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2008లో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల కారణంగా ఆయన కేంద్ర మంత్రిగా తప్పుకున్నారు. 2012 వరకు ఆయన రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. అలాగే కాపు ఉద్యమంలోనూ దాసరి చురుకైన పాత్ర పోషించారు.