కూల్ ఖాదీ!
వేసవి వేడికి చెక్ పెట్టాలంటే నూలు దుస్తులదే కీలక పాత్ర. అందులోనూ స్వచ్ఛమైన ఖాదీ దుస్తులైతే పెరుగుతున్న ఉష్ణోగ్రతల ధాటిని నిలువరించి మేనికి హాయినిస్తాయి. పెద్దలు ధరించే దుస్తుల కోటాలో చేరిపోయిన ఖాదీ పిల్లలు, యువత వార్డ్‌రోబ్‌లోనూ ఆకర్షణీయంగా కనువిందుచేయాలంటే... వారి ముస్తాబు మోడ్రన్‌గా మెరిసిపోవాలంటే ఖాదీ దుస్తుల డిజైనింగ్‌లో ఆధునిక హంగులను తీసుకురావాలి. పిల్లలతో పాటు కాలేజీ విద్యార్థులను, కార్పొరేట్ ఉద్యోగులనూ ఆకట్టుకునే కూల్ ఖాదీ దుస్తుల డిజైన్లు ఇవి.
1- కోరా ఖాదీ (హాఫ్‌వైట్) కుర్తా నేటి మహిళకు సరిగ్గా నప్పుతుంది. వంగపండు రంగు డబుల్ థ్రెడ్ ఖాదీ పైజామా దీనికి సరైన ఎంపిక. అధిక వేడిమి వల్ల కలిగే అసౌకర్యాన్ని దూరం చేస్తుంది. కార్పొరేట్ కంఫర్ట్‌కి, కాలేజీ స్టైల్‌కి బాగా సూటవుతుంది.
2-కాలేజీకి వెళ్లే అమ్మాయిల కోసం రూపొందించిన డ్రెస్ ఇది. ‘వి’ నెక్ గల కలంకారి ఖాదీ బ్లౌజ్, ప్రింటెడ్ ఖాదీ స్కర్ట్ ధరిస్తే అటు క్యాజువల్‌గానూ, ఇటు కలర్‌ఫుల్‌గానూ కనిపిస్తారు.
3- టై అండ్ డై ఖాదీ క్లాత్‌తో డిజైన్ చేసిన డ్రెస్ ఇది. పై భాగంలో క్రోచెట్ని జత చేయడంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది.
4- టై అండ్ డై చేసిన ఖాదీ మెటీరియల్‌తో తీర్చిదిద్దిన ఫ్రాక్ ఇది, నర్సాపూర్ క్రోషెట్ను బ్లౌజ్ భాగంలో అమర్చడంతో స్టైల్‌గా రూపుకట్టింది.
వంగపండు రంగు కలంకారి ఖాదీ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన ఫ్రాక్ ఇది. వేసవిలో చమటను పీల్చుకునే ఈ ఫ్యాబ్రిక్ పిల్లలకు అత్యంత సౌకర్యంగా ఉంటుంది.
నారింజ రంగు ఇన్నర్ టాప్‌పై బూడిద రంగు ఓవర్‌కోట్ స్కర్ట్ చిన్నారులకు బాగా నప్పుతుంది. ఖాదీ ఫ్యాబ్రిక్ సహజసిద్ధమైనది కనుక పిల్లల లేత చర్మానికి హాయినిస్తుంది.
లేత అకుపచ్చ రంగు టై అండ్ డై ఖాదీ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన స్లీవ్‌లెస్ ఫ్రాక్ ఇది. ఫ్రాక్‌కు బాటమ్‌లో క్రోషెట్తో చిన్న పాకెట్‌ను అమర్చితే డ్రెస్ లుక్ అహ్లాదంగా మారిపోతుంది.
కర్టెసి: అరవింద్ జాషువా
ఫ్యాషన్ డిజైనర్
హైదరాబాద్