కొమురవెల్లి మల్లన్నకు కమిటీ
ధర్మకర్తల మండలిలో సభ్యత్వానికి కొనసాగుతున్న దరఖాస్తుల స్వీకరణ
సెప్టెంబర్ 6తో ముగియనున్న గడువు
సాక్షి ప్రతినిధి, వరంగల్ : నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియలో భాగంగా దేవాలయాల కమిటీల నియామకంపై ప్రభుత్వం దృష్టిసారించింది. తొలి దశలో రాష్ట్ర స్థాయి ఆలయాలకు ధర్మకర్తల కమిటీలను నియమించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాలోని ప్రముఖ ఆలయాల ధర్మకర్తల కమిటీల నియామకం కోసం ఆగస్టు 6న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో కొమురవెల్లి మల్లికార్జునస్వామి, మేడారం సమ్మక్క–సారలమ్మ, కురవి వీరభద్రస్వామి ఆలయాలకు కమిటీలను నియమించాలని దేవాదాయ శాఖను ఆదేశించింది. దీంతో నియామక ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్లయింది. అయితే ప్రఖ్యాత కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయ ధర్మకర్తల కమిటీ నియామకం కోసం ఈ నెల 18న నోటిఫికేషన్ వెలువడింది. కమిటీలో సభ్యులుగా నియమితులు కావాలనుకునేవారు 20 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆసక్తి గలవారు దేవాదాయ శాఖ కమిషనర్, జాయింట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయాల్లో దరఖాస్తులు సమర్పించాలన్నారు. నోటిఫికేషన్లో పేర్కొన్న ప్రకారం సెప్టెంబరు 6 నాటికి దరఖాస్తుల గడువు ముగియనుంది. అనంతరం దేవాదాయ శాఖ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ దరఖాస్తుదారుల వివరాలతో కమిషనర్ కార్యాలయానికి ప్రత్యేక నివేదిక పంపిస్తారు. దీని ఆధారంగా కమిషనర్ కార్యాలయం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తుంది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఆలయానికి ధర్మకర్తల మండలిని నియమిస్తున్నట్లుగా ఉత్తర్వులు జారీ చేస్తుంది.
దేవాలయాల ధర్మకర్తల మండళ్ల నియామకంలో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పలు మార్పులు చేసింది. గతంలో రెండేళ్లు ఉన్న పదవీకాలాన్ని ఏడాదికి కుదించారు. అన్ని కేటగిరి ఆలయాల ధర్మకర్తల కమిటీల్లోని సభ్యుల సంఖ్యను పెంచారు. వార్షిక ఆదాయంప్రామాణికంగాదేవాలయాలను నాలుగు కేటగిరీలుగా పరిగణించాలని నిర్ణయించారు. రూ.2 లక్షలలోపు ఆదాయం, రూ.2 లక్షల నుంచి రూ.25 లక్షలలోపు ఆదాయం, రూ.25 లక్షల నుంచి రూ.కోటిలోపు ఆదాయం, రూ.కోటికిపైగా ఆదాయం పొందే ఆలయాలను వేర్వేరు కేటగిరీలుగా గుర్తించారు.
సభ్యుల సంఖ్యలో పెంపు..
రూ.కోటి కంటే అధిక వార్షిక ఆదాయం ఉన్న ఆలయాలకు రాష్ట్ర ప్రభుత్వమే ధర్మకర్తల మండలిని నియమిస్తుంది. వీటిలో ఇప్పటి వరకు తొమ్మిది మంది సభ్యులు ఉండేవారు. ప్రభుత్వం ఈ సంఖ్యను 14కు పెంచింది. రూ.కోటి కంటే అధిక వార్షిక ఆదాయం కలిగిన ఆలయాల కేటగిరీలో మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర, చేర్యాల మండలం కొమురవెల్లి మల్లికార్జునస్వామి, కురవిలోని వీరభద్రస్వామి, వరంగల్లోని భద్రకాళి, పాలకుర్తిలోని సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి, వర్ధన్నపేట మండలం ఐనవోలులోని మల్లికార్జునస్వామి ఆలయాలు ఉన్నాయి.
రూ.25 లక్షల నుంచి రూ.కోటి దాకా ఆదాయం ఉన్న ఆలయాలకు దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం ధర్మకర్తలను నియమిస్తుంది. వీటిలో సభ్యుల సంఖ్యను ఐదు నుంచి ఏడుకు పెంచారు.
ఆదాయం రూ.2 లక్షల నుంచి రూ.25 లక్షలలోపు ఉన్న ఆలయాలకు దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం ధర్మకర్తలను నియమిస్తుంది. వీటి మండలి సభ్యుల సంఖ్యను మూడు నుంచి ఐదుకు పెంచారు.