‘ముక్కోటి’కి ముస్తాబు
రత్నగిరిపై విస్తృతంగా ఏర్పాట్లు
రేపు ఉదయం 5 గంటల నుంచి ఉత్తర ద్వార దర్శనం
అన్నవరం :
ముక్కోటి (వైకుంఠ) ఏకాదశి పర్వదినానికి సత్యదేవుని ఆలయం ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా ఆదివారం వేలాదిగా తరలిరానున్న భక్తులను దృష్టిలో ఉంచుకొని అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. శేషపాన్పుపై పవళించే శ్రీమహావిష్ణువుగా సత్యదేవుడిని, శ్రీమహాలక్షి్మగా అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారిని అలంకరించి, ఆ మూర్తులను ఉత్తర ద్వారంగుండా భక్తులు దర్శించే ఏర్పాట్లు చేస్తున్నారు. దేవస్థానంలో గత 20 సంవత్సరాలుగా ఈ ఆనవాయితీ ఉంది. రత్నగిరిపై సాధారణంగా స్మార్త ఆగమ పద్ధతిలో పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఉత్తరద్వార దర్శనం వైష్ణవ సంప్రదాయమైననప్పటికీ సత్యదేవుడు విష్ణుమూర్తి అంశ అయినందున ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పండితులు తెలిపారు. మామూలుగా ప్రతి రోజూ భక్తులు దక్షిణ ద్వారం ద్వారా వెళ్లి ఉత్తర ద్వారంగుండా వెలుపలకు వస్తారు. ముక్కోటి ఏకాదశినాడు మాత్రం అందుకు వ్యతిరేకంగా ఉత్తర ద్వారం నుంచి ఆలయం లోపలకు వెళ్లి దక్షిణ ద్వారం నుంచి బయటకు వస్తారు. ముక్కోటి వేడుకల నేపథ్యంలో తూర్పు రాజగోపురానికి విద్యుద్దీపాలతో ప్రత్యేకంగా అలంకరణ చేస్తున్నారు. ఇప్పటికే రంగురంగుల సీరియల్ బల్బులు అమర్చారు. వాటితోపాటు మరికొన్ని సీరియల్ బల్బులను కూడా శుక్రవారం ఏర్పాటు చేశారు. దీంతో రాజగోపురం మరింతగా తళుకులీనుతోంది.
సాయంత్రం వరకూఉత్తర ద్వార దర్శనం
ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా రత్నగిరి సత్యదేవుని సన్నిధిన ఆదివారం విశేష పూజా కార్యక్రమాలు, ఉత్తర ద్వారదర్శనం ఏర్పాటు చేసినట్లు దేవస్థానం ఈవో కె.నాగేశ్వరరావు శుక్రవారం విలేకర్లకు తెలిపారు. ఆ రోజు తెల్లవారుజామున నాలుగు గంటలకు సత్యదేవుడు, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేస్తామన్నారు. అనంతరం ఉదయం ఐదు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ ఉత్తర ద్వార దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నట్టు తెలిపారు. ప్రధానాలయం, ఆలయ పరిసరాలను వివిధ పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరిస్తున్నామని చెప్పారు.