వివక్షకు రక్షణగా నిలుస్తారా?!
‘ఇది మీ సొంత చట్టం. దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత మీ పై ఉంది’ అని హైకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వానికి గుర్తుచేయాల్సి వచ్చింది. ఈ తీర్పు తదుపరి ఆలయ ప్రవేశానికి ప్రయత్నించిన మహిళలను పాలనా యంత్రాంగం అడ్డగించడం విషాదకరం.
సుప్రసిద్ధ శనీశ్వరాలయ ప్రవేశాన్ని కోరుతూ మహిళలు కొన్ని వారాల క్రితం ఉద్యమించారు. లైంగిక వివక్ష సమస్యను లేవనెత్తారు. ఆ సందర్భం గా ముఖ్యమంత్రి జోక్యం సహా చాలానే సంప్ర దింపులు జరిగాయి. అగ్ర రాజకీయ నేతల కృషి వేడెక్కిన వాతావరణాన్ని చల్లబరిచేలా ఏవో కొన్ని చర్యలు చేపడుతున్నట్టు సంకేతించడానికే పరిమితమైంది. అంతేగానీ, ఆ వివక్షను అంతం చేయడానికి మాత్రం కాదు. కావాలనుకుంటే వారు ఆ పని చేయగలిగేవారే.
శనీశ్వరాలయం ఉన్న శనిసింగనాపూర్ గ్రామం మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా పరిధిలోనిది. ఆరు దశాబ్దాల క్రితమే ‘బహిరంగ ప్రార్థనా స్థలాలలో ’ భక్తులమధ్య ‘ఎలాంటి వర్గ, బృందాల’ వివక్షా పాటించరాదని ఆ రాష్ట్రంలో చట్టం చేశారు. నాటి మహారాష్ట్ర హిందూ ప్రార్థనా స్థలాల (ప్రవేశ అధికార) చట్టం, 1956 హిందువులు, జైన్లు, సిక్కులు, బౌద్ధులకు అందరి కీ వర్తించేది. కాబట్టి మహిళలు ఈ విషయంలో లింగవివక్షను అంతం చే యాలని కోరినప్పుడు ఆ చట్టాన్ని శక్తివంతంగా ఆచరణలోకి తేవడమే ప్రభుత్వం చేయాల్సి ఉన్న పని. కానీ ‘చట్టంలో ఇప్పటికే ఉన్న నిబంధనలు అందుకు అనుమతిస్తున్నాయి’ కాబట్టి వాటిని అమలుచేసి మహిళల ఆలయ ప్రవేశానికి అవకాశాలను కల్పించాలనీ, ‘అందుకు అడ్డుపడుతున్న వారికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని’ గత వారాంతంలో బాంబే హైకోర్టు ఆదేశించేవరకూ రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేసింది.
సాధారణంగా ప్రభుత్వాలు అప్పటికే ఉన్న చట్టాలను చూపుతూ కొన్ని కర్తవ్యాలను నెర వేర్చడంలో తాము అశక్తులమని కోర్టులకు చెబు తుంటాయి. వాటిని నెరవేర్చాల్సిందేనని కోర్టులు పట్టుబడితే... అవి ఆ చట్టాలను సవరించే ప్రయ త్నం చేస్తాయి. మహిళలు నృత్యం చేసే డ్యాన్స్ బార్లను తిరిగి తెరవనివ్వాలనే కోర్టు ఆదేశాలు అమలు కాకుండా మహారాష్ట్ర ప్రభుత్వం ఎంతగా ప్రయత్నిస్తోందో చూస్తూనే ఉన్నాం. ప్రభుత్వం ఆ అంశాన్ని అభ్యంతరకరమైన లేదా అనైతిక ప్రవర్తన గా చూస్తే ... సుప్రీంకోర్టు అందుకు భిన్నంగా యోచించింది. నైతికంగా సరైన చట్టాలను అమలు చేసే ఆ ప్రభుత్వ హయాంలో మహిళా కార్యకర్తలు ఆలయ ప్రవేశం కోసం కోర్టు జోక్యాన్ని కోరాల్సిన అవసరమే రాకూడదు. ఆరు దశాబ్దాల క్రితం నాటి ఆ చట్టం అర్థరహితమైనదని భావిస్తే దాన్ని ఎప్పు డో సమీక్షించి ఉండాల్సింది. చట్టాన్ని మాత్రం అలా గే ఉంచి దాని అమలును పట్టించుకోరు. ఇలాంటి కారణంవల్లే కొన్ని చోట్ల దళితులకు ప్రార్థనా స్థలాలలోకి ఇప్పటికీ ప్రవేశం ఉండటం లేదు.
అంబేడ్కర్, జ్యోతిబా, సావిత్రీబాయిలను చూపి మహారాష్ట్ర... తమది ‘ప్రగతిశీల’రాష్ట్రమని చెప్పుకుంటుంది. కానీ ఈ 21వ శతాబ్దిలో సైతం అక్కడ నరేంద్ర దబోల్కర్, గోవింద్ పన్సారే అనే ఇద్దరు సుప్రసిద్ధ హేతువాదులు హత్యకు గురయ్యారు. హంతకులు ఇంకా దొరకనే లేదు. మహిళలను విద్యావంతులను చేయడం ద్వారా సంప్రదాయకత కోరల నుంచి మహిళలను ఉన్నత స్థితికి తేవాలనేదే ఫూలే కృషి ముఖ్య సారం. వరుసగా వచ్చిన రాష్ట్ర ప్రభుత్వాలలో అన్ని రకాల భావజాల ధోరణులకు చెందినవారూ కనిపించారు. కానీ మహిళల ఆలయ ప్రవేశానికి హామీనిచ్చే ప్రగతిశీల చ ట్టాన్ని హైకోర్టు గుర్తు చేసేవరకు బూజు పట్టిపోనిచ్చారు. ‘ఇది మీ సొంత చట్టం. దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత మీపై ఉంది’ అని గుర్తుచేయాల్సి వచ్చింది. చూడబోతే వరుసగా వచ్చిన ప్రభుత్వాలు విశ్వాసాలు, నమ్మకాలు, ఆనవాయితీలను అంతం చేసే ఆ చట్టం కంటే వాటి అమలుకే ప్రాధాన్యం ఇచ్చినట్టుంది.
కోర్టు తీర్పుతో పునరుత్తేజితులైన మహిళలు శనివారం ఆలయంలో ప్రార్థనలకు ప్రయత్నిం చగా... స్థానిక పాలనా యంత్రాంగం వారిని అడ్డ గించడం ఈ వ్యవహారంలోని విషాద ఘట్టం. లిఖి త పూర్వక ఆదేశాలు తమకు అందలేదని సాకు చూపారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మహిళా కార్యకర్తలపై ‘దాడులు జరగ కుండా’ కాపాడటానికే వారిని అడ్డుకోవాల్సి వచ్చిం దని సమర్థించుకున్నారు. ఆయన కోర్టు ఆదేశాలను ‘గౌరవిస్తాం’ అన్నారే తప్ప అమలుచేయలేదు.
‘దాడిచేయడమా?’ ఆ రాష్ట్రంలో సనాతనత్వం ప్రజా జీవితంపై పట్టుబిగిస్తోంది. అక్కడ వాలంటైన్స్ డే జరుపుకోలేరు, జంటలు చేతులు పట్టుకుని బీచ్లవంటి ప్రదేశాల్లో కనిపించడానికి వీల్లేదు. ఆ ప్రభుత్వానికి తనదైన సొంత నైతిక దృష్టి ఉంది. కాబట్టి అధికార స్థానాల్లో ఉన్నవారు ప్రభుత్వ ఖజానాను కొల్లగొడుతున్నా ఫర్వాలేదు.
చట్టాన్ని ఓడించడానికి ఉన్న మార్గాలు రకరకాలు. నాసిక్ త్రయంబకేశ్వర్ ఆలయం జ్యోతిర్లింగాలలో ఒకటి. ఆ ఆలయం స్త్రీ, పురుషులిద్దరినీ సమానత్వ దృష్టితో చూడటం ప్రారంభించింది. మగాళ్లకు సైతం గర్భగుడి ప్రవేశాన్ని నిషేధించింది! జనవరిలో మహిళలు ప్రవేశించడానికి ప్రయత్నించగా, ఆలయ ధర్మకర్తల బోర్డు ఆ విషయాన్ని ముఖ్యమంత్రి నిర్ణయానికి వదిలేసింది. చివరికి జరిగింది ఇదీ!
(వ్యాసకర్త : మహేష్ విజాపుర్కార్, సీనియర్ పాత్రికేయులు)