దేవాలయాల ఆస్తుల పరిరక్షణకు కమిటీ
త్వరలోనే ముఖ్యమైన దేవాలయాలకు ట్రస్టులు
ఇతర మతాల వారికి దేవాలయాల్లో ఉద్యోగావకాశాలు లేవ్
‘సాక్షి’తో రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు
విజయవాడ : రాష్ట్రంలోని దేవాలయాల ఆస్తుల్ని పరిరక్షించేందుకు త్వరలోనే రాష్ట్ర స్థాయిలో ఒక కమిటీ వేస్తామని దేవాదాయ శాఖ మంత్రి పీ మాణిక్యాలరావు ప్రకటించారు. హైకోర్టు రిటైర్డ్ జడ్జిలు, లీగల్ సెక్రటరీలుగా పనిచేసినవారు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారన్నారు. దేవాలయాల ఆస్తులు నాలుగైదేళ్లుగా కోర్టులో ఉన్నట్లయితే అటువంటి కేసులను ఈ కమిటీ పరిశీలిస్తుందని వెల్లడించారు. శనివారం డాక్టర్ శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ ట్రస్టు ఆధ్వర్యంలో జరిగిన భూమి పూజ కార్యక్రమానికి హాజరైన మంత్రి మాణిక్యాలరావు ‘సాక్షి’తో మాట్లాడారు. న్యాయస్థానాల్లో ఉన్న దేవాలయాల కేసులన్నీ సత్వరం పరిష్కరించి, వాటి ఆదాయం పెంచాలనే ఉద్దేశంతోనే ఈ కమిటీని వేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ కమిటీ కేసుల్ని పరిశీలించి సలహాలు, సూచనలు చేస్తుందే తప్ప ఏ విధమైన అధికారాలూ అప్పగించబోమని తెలిపారు.
6 సీ దేవాలయాల సిబ్బందికి వేతనాలు
రాష్ట్రంలో కొన్ని దేవాలయాల్లో అర్చకులు అనేక ఇబ్బందులు పడటం గురించి స్పందిస్తూ ఆదాయం తక్కువగా ఉన్న 6సీ దేవాలయాల్లో పనిచేసే అర్చకులు, ఇతర సిబ్బందికి నెలకు రూ.5 వేలు చొప్పున దేవాదాయ శాఖ నుంచి ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని మంత్రి చెప్పారు. సిబ్బందికి వచ్చే జీతాలు ఇందులోంచి మినహాయించాలా.. లేక జీతానికి అదనంగా రూ.5 వేలు ఇవ్వాలా అనే అంశాన్ని ఇంకా నిర్ణయించాల్సి ఉందన్నారు. దీనివల్ల దేవాలయాల్లో పనిచేసే సిబ్బంది ఆర్థిక పరిస్థితులు బాగుపడతాయన్నారు.
గోదావరి పుష్కరాల సందర్భంగా ఉభయగోదావరి జిల్లాల్లో ఉన్న అన్ని దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. సుమారు రూ.60 కోట్ల బడ్జెట్ కేటాయించి పుష్కర ఏర్పాట్లతో పాటు దేవాలయాల్లో మౌలిక సదుపాయాలు, రంగులు వేయించడం చేస్తున్నామన్నారు. దేవాలయాల్లో అన్యమతస్తులకు ఉద్యోగావకాశం కల్పించబోమన్నారు. దేవాదాయ శాఖలో సెక్యులర్ సిబ్బంది అనేది కుదరదని, తప్పనిసరిగా హిందువై ఉండాలని స్పష్టం చేశారు.
ఏటా సిబ్బందికి డిక్లరేషన్ తప్పనిసరి
తాను మత మార్పిడి చేసుకోలేదని, హిందువుగానే ఉన్నానని సిబ్బంది ప్రతి ఏడాదీ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందని మంత్రి చెప్పారు. దేవాలయాల్లో ధార్మిక, ధార్మికేతర సిబ్బంది ఉన్నారని, ధార్మికేతర సిబ్బందిని అన్యమతస్తులు అనుకుంటున్నారని తెలిపారు. అర్చకులు కాకుండా ఇతర సిబ్బందిని ధార్మికేతర సిబ్బందిగా వ్యవహరిస్తామన్నారు. చిత్తూరులో ఎన్నికల కోడ్ అమలులో ఉండటం వల్లనే టీటీడీకి ట్రస్టు బోర్టు వేయడం కుదరలేదన్నారు. కోడ్ రావడానికి ముందు ముఖ్యమంత్రి పర్యటనలతో హడావుడిగా ఉండటం వల్ల కమిటీ వేయలేదని తెలిపారు. ఈసారి 19 మంది ట్రస్టు బోర్డులో ఉంటారని, దేశవ్యాప్తంగా సభ్యుల్ని తీసుకుంటామని వెల్లడించారు.