గుడి చందా ఇవ్వలేదని సాంఘిక బహిష్కరణ
మెట్పల్లి రూరల్(కరీంనగర్): గ్రామంలో నిర్మించతలపెట్టిన ఆలయ నిర్మాణానికి చందా ఇవ్వలేమని చెప్పినందుకు సామాజిక బహిష్కరణ విధించారు. కరీంనగర్ జిల్లా మెట్పల్లి మండలం జగ్గాసాగర్లో ఈ వైనం చోటుచేసుకుంది. గ్రామంలో గంగామాత ఆలయం నిర్మించాలని గ్రామాభివృద్ధి కమిటీ (వీడీసీ) నిర్ణయించింది. కుటుంబానికి రూ.500 చొప్పున నిర్మాణ ఖర్చులకు గాను చందాగా ప్రకటించి, ఆమేరకు అందరూ ఇవ్వాలని కోరింది.
అయితే, గ్రామంలోని విశ్వబ్రాహ్మణ, మాల, పద్మశాలీ కులస్తులు తాము అంత చందా ఇచ్చుకోలేమని వీడీసీ పెద్దలకు చెప్పారు. దీంతో ఆయా కులస్తులను సాంఘికంగా బహిష్కరిస్తున్నట్లు పెద్దలు ప్రకటించారు. వారితో మిగతా వారు ఎటువంటి లావాదేవీలు, ఇచ్చిపుచ్చుకోవటాలు చేయరాదని హుకుం జారీ చేశారు. ఈ పరిణామంతో బాధితులు ఆందోళన చెందతున్నారు.