దైవ దర్శనానికి వెళ్తూ.. ముగ్గురి మృతి
కరీంనగర్ : వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దర్శనానికి వెళ్తున్న వాహనం ప్రమాదానికి గురైన ఘటనలో ముగ్గురు మృతిచెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా కమలాపూర్ మండలం వంగపల్లి గ్రామ సమీపంలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది.
వరంగల్ జిల్లా రేగొండ మండలం కొనగల్లు గ్రామానికి చెందిన చిలుకూరి సమ్మక్క కుటుంబ సభ్యులు జీపులో రాజన్న దర్శనానికి బయలుదేరారు. జీపు వంగపల్లి వద్దకు చేరుకోగానే ఎదురుగా వస్తున్న బొగ్గు టిప్పర్ జీపును ఢీకొట్టింది. దీంతో జీపులో ప్రయాణిస్తున్న వారిలో సమ్మక్క, నంబూరి మల్లక్క, జీపు డ్రైవర్ రాకేష్ అక్కడికక్కడే మృతిచెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.