టెంపోలో రేప్: రెండో రోజు కూడా ఆందోళన
ఓ మహిళపై నలుగురు కీచకులు వాహనంలో సామూహిక అత్యాచారం చేసి.. ఆపై ఆమె కళ్లు పీకీ.. తర్వాత వాహనంలోనుంచి బయటకు విసిరేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఢిల్లీలో జరిగిన ‘నిర్భయ’ ఘటనకంటే దారుణంగా ఉన్న ఈ దుర్ఘటన అసోంలోని లఖ్మీపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనపై ఆసోంలో ఆందోళనలు రెండో రోజు కూడా పెద్ద ఎత్తు కొనసాగాయి. సంఘ వ్యతిరేక శక్తుల్ని కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు, ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ సభ్యులు బోగనది పోలీస్ స్టేషన్ ఎదుట రెండు గంటలపాటు ధర్నా చేశారు.
ఈ కేసులో నిందితుల పట్టుకోవడానికి ఇచ్చిన 24 గంటల డెడ్ లైన్ ముగిసినా పోలీసులు పురోగతి సాధించకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బోగీనది ప్రాంతానికి చెందిన ఓ మహిళ తన ఏడేళ్ల బాబును స్కూలు నుంచి తీసుకురావడానికి.. షేరింగ్ టెంపో వాహనం ఎక్కింది. అందులోని నలుగురు వ్యక్తులు ఆమెపై ఒకరి తర్వాత ఒకరుగా అత్యాచారం చేశారు. తర్వాత ఆమె కళ్లు పీకేశారు. ఆపై తలపైన, మెడపైన తీవ్రం గా గాయపరిచారు అని ఎఫ్ ఐఆర్ లో పోలీసులు పేర్కొన్నారు.