ఘోర రోడ్డు ప్రమాదం ..
♦ పూతలపట్టువద్ద ఘోర రోడ్డు ప్రమాదం
♦ ముగ్గురి మృతి
♦ ఐదుగురికి గాయాలు
లేకలేక పుట్టిన కొడుకు పుట్టు వెంట్రుకలు తిరుమల శ్రీవారి సన్నిధిలో తీయించాలని మహారాష్ట్రకు చెందిన దంపతులు అనుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా టెంపో ట్రావెల్లర్ వాహనంలో బయలుదేరారు. మరో రెండు గంటల్లో స్వామి సన్నిధి చేరుకోవాల్సి ఉంది. ఇంతలో విధి వక్రించింది. రెప్పపాటులో జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన యాదమరి మండలంలక్ష్మయ్యకండిగ వద్ద ఆదివారం తెల్లవారు జామున జరిగింది. మొక్కు తీర్చుకుందామని వెళ్లిన వారు తిరిగిరాని లోకాలకు చేరుకున్నారని తెలియడంతో బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. మూడు కుటుంబాల్లో విషాదం అలుముకుంది.
లక్ష్మయ్యకండిగ(యాదమరి) :
యాదమరి మండలం లక్ష్మ య్యకండిగ గ్రామం వద్ద చెన్నై – బెంగళూరు జాతీయ రహదారిలో ఆదివా రం వేకువజామున 5 గంటల ప్రాం తంలో టెంపో ట్రావెల్లర్ వాహనం ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొనడంతో ముగ్గురు మృతిచెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. చిత్తూరు వెస్ట్ సీఐ ఆదినారాయణ, యాదమరి ఎస్ఐ రఘుపతి నాయుడు కథనం మేరకు..
మహారాష్ట్రలోని ఇండోర్ ప్రాంతానికి చెందిన సౌరవ్, శివలింగయ్య, విశాల్ కుటుం బాలు పదేళ్ల క్రితం కర్ణాటక రాష్ట్రం తుముకూరులోని ఇండస్ట్రియల్ ఏరియాలో స్థిరపడ్డాయి. అనేక ఏళ్లుగా తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకోవాలని అనుకుంటున్నారు. వీలు పడలేదు. ఈ క్రమంలో సౌరవ్, కామాక్షి దంపతులకు లేకలేక కొడుకు రిధయ్ పుట్టాడు. బాలుడి పుట్టు వెంట్రుకలను తిరుమల శ్రీవారి సన్నిధిలో తీయించడంతోపాటు స్వామిని తనివితీరా దర్శించుకోవాలని మూడు కుటుంబాల్లోని 11 మంది సభ్యులు అనుకున్నారు.
టెంపో ట్రావెల్లర్ను బాడుగకు తీసుకుని శనివారం రాత్రి 11.30 గంటలకు సంతోషంగా బయలుదేరారు. వాహనాన్ని డ్రైవర్ విశాల్ బాబు (26) నడుతుపుతున్నాడు. ఆదివారం వేకువజామున 5 గంటల ప్రాంతంలో యాదమరి మండలం లక్ష్మయ్యకండిగ గ్రామం వద్ద చెన్నై–బెంగళూరు జాతీయ రహదారిలో చెన్నై నుంచి బెంగళూరుకు వెళుతున్న పామోలిన్ ట్యాంకర్‌ను టెంపో ట్రావెల్లర్ వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో చిన్నారి రిధయ్(2) అక్కడికక్కడే మృతి చెందాడు. కామాక్షి(27), సంతోషిని(47), శివలింగయ్య(38), రేణుక(30), పూజ(9), అభిషేక్(8), డ్రైవర్ విశాల్ బాబు(26)కు తీవ్ర గాయాలయ్యాయి.
ప్రమాదాన్ని గుర్తిం చిన స్థానిక యువకులు వెంటనే పోలీ సులకు సమాచారం అందించి గాయపడిన వారిని 108లో చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కామాక్షి, డ్రైవర్ విశాల్బాబు మృతి చెందారు. సంతోషిని, శివలింగయ్య, రేణుక, పూజ, అభిషేక్ ను వేలూరు సీఎంసీకి తరలించారు. సంతోషిని పరిస్థితి పరిస్థితి విషమంగా ఉంది. విశాల్(31), దీప్తి(31), సౌరవ్(30), రవికుమార్(25), లారీ ట్యాంకర్ డ్రైవర్ లోకేష్(26)కు తెలికపాటి గాయాలయ్యాయి. వారు చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు చిత్తూరు వెస్ట్ సీఐ ఆదినారాయణ, యాదమరి ఎస్ఐ రఘుపతి నాయుడు తెలిపారు.
మొక్కు తీర్చుకునేందుకు వెళుతుండగా..
మాది మహారాష్ట్రలోని ఇండోర్ ప్రాంతమని, పదేళ్ల క్రితం కర్ణాటకలోని తుమ్ముకూరుకు వచ్చి ఇండస్ట్రియల్ ఏరియాలో పనులు చేసుకుంటూ జీవిస్తున్నామని బాధితులు తెలిపారు. సౌరవ్, కామాక్షి దంపతులకు లేకలేక కొడుకు రిధయ్ పుట్టడంతో అతనికి తిరుమలలో వెంట్రుకలు తీయాలని మొక్కుకున్నారని పేర్కొన్నారు. సౌరవ్తోపాటు, అతని అమ్మ సంతోషిని, విశాల్, అతని భార్య దీప్తి, శివలింగయ్య, అతని భార్య రేణుక, వారి పిల్లలు అభిషేక్, పూజ, మరో స్నేహితుడు రవికుమార్‌తో కలిపి 11 మంది బయలుదేరామన్నారు. ప్రమాదంలో మొక్కుబడి ఉన్న పిల్లవాడు, అతని తల్లి చినిపోవడం చాల బాధాకమని కన్నీరుమున్నీరయ్యారు.
సంఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ
ప్రమాదం జరిగిన వెంటనే విషయం తెలుసుకున్న డీఎస్పీ లక్ష్మీనాయుడు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కిలోమీటర్ల మేర నిలిచిపోయిన ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. మృతదేహాలకు పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు.