temporary chief justice
-
రెండేళ్ల నుంచి తాత్కాలిక న్యాయమూర్తులే..
సాక్షి, న్యూఢిల్లీ: ఉభయ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో 2015 మే 6 నుంచి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తులే కొనసాగుతున్నారని, రెగ్యులర్ ప్రధాన న్యాయమూర్తిని నియమించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. హైకోర్టు న్యాయవాది సర్సాని సత్యంరెడ్డి ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పిటిషన్‌ను విచారించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ కల్యాణ్ జ్యోత్సేన్ గుప్తా 2015 మే 6న పదవీ విరమణ చేసిన తర్వాత రెగ్యులర్ ప్రధాన న్యాయమూర్తులను నియమించలేదని, అప్పట్నుంచి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తులనే నియమిస్తూ వచ్చారని పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాదులు ధర్మాసనానికి నివేదించారు. హైకోర్టులో మొత్తం 61 మంది న్యాయమూర్తులు ఉండాల్సి ఉండగా కేవలం 27 మంది న్యాయమూర్తులే ఉన్నారని, మిగిలిన పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయని వివరించారు. ఈ పిటిషన్‌పై విచారణను కోర్టు 10 వారాలకు వాయిదా వేసింది. -
వెంకన్న సేవలో హైకోర్టు తాత్కాలిక సీజే
తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని ఉభయ రాష్ట్రాల హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ కుమార్ బి భోసలే శనివారం ఉదయం దర్శించుకున్నారు. వీఐపీ దర్శన సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న ప్రధాన న్యాయమూర్తికి టీటీడీ ఈవో సాంబశివరావు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపం వద్ద ఆయనకు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. -
హైకోర్టు తాత్కాలిక సీజేగా జస్టిస్ బొసాలే
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ దిలీప్ బాబాసాహెబ్ బొసాలే గురువారం బాధ్యతలు స్వీకరించారు. ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా ఈ నెల 6న పదవీ విరమణ చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో జస్టిస్ బొసాలేను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తూ రాష్ట్రపతి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో తాత్కాలిక సీజేగా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు అభినందించారు. అనంతరం జస్టిర్ బొసాలే శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వెళ్లారు. అపార అనుభవశాలి... జస్టిస్ బొసాలే 1956, అక్టోబర్ 24న మహారాష్ట్రలోని సతారా జిల్లాలో పుట్టారు. ఈయన తండ్రి జస్టిస్ బాబాసాహెబ్ బొసాలే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. బొసాలే విద్యాభ్యాసం మొత్తం ముంబైలోనే కొనసాగింది. 1979 అక్టోబర్ 11న న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. క్రిమినల్, ఆస్తి చట్టాల కేసులకు సంబంధించి అపార అనుభవం సాధించారు. 1986 నుంచి 1991 వరకు బొంబే హైకోర్టులో ప్రభుత్వ సహాయ న్యాయవాదిగా, ప్రభుత్వ న్యాయవాదిగా, అసిస్టెంట్ పీపీగా పలు బాధ్యతలు నిర్వర్తించారు. దేశంలోని బార్ కౌన్సిళ్లకు ఎన్నికైన సభ్యుల్లో ఇప్పటివరకు అత్యంత పిన్నవయస్కుడు జస్టిస్ బొసాలే. వరుసగా మూడుసార్లు బార్ కౌన్సిల్ సభ్యునిగా ఎన్నికయ్యారు. పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు న్యాయవాదిగా ఉన్నారు. ప్రభుత్వం తరఫున అనేక కీలక కేసుల్లో వాదనలు వినిపించారు. జస్టిస్ బొసాలే 2001, జనవరి 22న బొంబే హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, 2003లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2012, జనవరి 7న కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయ్యారు. గతేడాది డిసెంబర్ 8న ఆయన ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.