భారీగా పెరగనున్న రిజిస్ట్రేషన్ల
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : నగరంలో భూముల ధరలు సోమవారం నుంచి భారీగా పెరగనున్నాయి. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మార్గదర్శక విలువలు ఆ రోజు నుంచి అమలులోకి రానున్నాయి. నగరంలో భూములకు భారీ డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో మార్గదర్శక విలువ వంద శాతం పెరిగింది. తక్కువ డిమాండ్ ఉన్న చోట్ల 30 నుంచి 40 శాతం ఎక్కువైంది. మురికివాడల్లో పెరుగుదల 11 శాతం వరకు ఉంది. ఔటర్ రింగ్ రోడ్డు పరిసరాలు, కొత్త లేఔట్లు ఏర్పడిన చోట్ల పెరుగుదల ఏమేరకు ఉంటుందో అంతుబట్టకుండా ఉంది.
నగరంలో ప్రముఖ వాణిజ్య ప్రాంతాలైన ఇన్ఫాంట్రీ రోడ్డులో నివేశనం చదరపు అడుగు ధరను రూ.18 వేలుగా నిర్ణయించారు. కమర్షియల్ స్ట్రీట్లో రూ.16,500, కేజీ రోడ్డులో రూ.15,400, సదాశివ న గరలో రూ.14 వేలు కానుంది. నగరంలో అత్యధిక ధరలు పలుకుతున్న ప్రాంతాలివే. ఈ నేపథ్యంలో గత గురువారం రాత్రి పది గంటల వరకు నగరంలోనిపలు కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు జరిగాయి. శుక్రవారం రంజాన్, తర్వాత రెండో శనివారం, ఆదివారం కావడంతో ఆఖరు రోజు రిజిస్ట్రార్ కార్యాలయాలన్నీ రద్దీగా మారాయి. సోమవారం ఈ ఛార్జీలు రెండింతలు కావచ్చనే సందేహంతో అనేక మంది రిజిస్ట్రేషన్లను ఆలోగానే పూర్తి చేసేశారు.
ఈ నెల ఐదో తేదీ వరకు ఆషాఢం కావడంతో చాలా మంది భూముల రిజిస్ట్రేషన్లను వాయిదా వేసుకున్నారు. తర్వాత మంగళవారం పోను రెండు రోజులే మిగిలి ఉండడంతో పోటా పోటీగా పని కానిచ్చారు. దీని వల్ల రాత్రుల్లో కూడా రిజిస్ట్రార్ కార్యాలయాలు పని చేశాయి. మొత్తం మీద భూముల మార్గదర్శక విలువ 11 శాతం నుంచి వంద శాతం వ రకు పెరిగాయి. గత నెల 20న బెంగళూరు నగర, గ్రామీణ, రామనగర జిల్లాల్లో భూముల తాత్కాలిక మార్గదర్శక విలువలను స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ప్రకటించడం ద్వారా ప్రజల నుంచి అభ్యంతరాలను కోరింది. అనంతరం స్వల్ప మార్పులతో తుది మార్గదర్శక విలువలతో కూడిన జాబితాను సిద్ధం చేసింది. సోమవారం తుది జాబితా విడుదలవుతుంది.