తాత్కాలిక ఆఫీస్‌లకు భవనాలు కరువు
సింగరేణికి పలు శాఖల వినతులు
అన్ని శాఖలకు భవనాల ఏర్పాటు కష్టమే
తేలని కలెక్టర్ కార్యాలయ భవనం
భూపాలపల్లి : నూతనంగా ఏర్పడే జయశంకర్ జిల్లాలో తాత్కాలిక ప్రభుత్వ కార్యాలయాలకు భవనాల కొరత నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్విభజన చేపట్టి దసరా నుంచే పరిపాలన కొనసాగించాలని నిర్ణయించింది. అయితే కొత్తగా ఏర్పడే జయశంకర్ జిల్లాలో పలు శాఖల తాత్కాలిక కార్యాలయాలకు భవనాలు దొరకని పరిస్థితి ఏర్పడింది. సింగరేణి సంస్థ అవసరాల మేరకు నిర్మించుకున్న పలు భవనాలను కార్యాలయాల నిమిత్తం ఇస్తున్నప్పటికీ ఇంకా కొరత ఉంటుంది.
ఏ భవనంలో కలెక్టరేట్?
జయశంకర్ జిల్లా తాత్కాలిక కలెక్టర్ కార్యాలయ భవనం ఎక్కడా అనేది ఇంకా స్పష్టత రాలేదు. మంజూర్‌నగర్‌లోని సింగరేణి ఇల్లందు అతిథిగృహంలో ఏర్పాటు చేయాలని రెవెన్యూ అధికారులు మొదట భావించారు. ఆ భవనాన్ని రెవెన్యూ, ఆర్అండ్బీ అధికారులు కూడా పరిశీలించారు. కానీ సింగరేణి యాజమాన్యం నుంచి ఇంకా అనుమతులు రాలేదు. కలెక్టరేట్ కోసం ఇల్లందు అతిథిగృహం, కాకతీయ అతిథి గృహం వివరాలను స్థానిక సింగరేణి అధికారులు సంస్థ సీఅండ్ఎండీ శ్రీధర్‌కు పంపించారు. ఆయన నిర్ణయం మేరకు కలెక్టరేట్ ఎక్కడా అనేది తేలనుంది.
‘సింగరేణి’కి వినతులు
జిల్లా ప్రభుత్వ కార్యాలయాలను తాత్కాలికంగా ఏర్పాటు చేసేందుకు పలు శాఖల అధికారులు స్థానిక సింగరేణి అధికారులకు వినతులు సమర్పిస్తున్నారు. ఇక్కడ సింగరేణి భవనాలు తక్కువగానే ఉండటంతో అన్ని శాఖలకు భవనాలు సమకూర్చే అవకాశాలు కనిపించడం లేదు. స్థానిక సింగరేణి గనుల వృత్తి శిక్షణ కేంద్రంలో ఎస్పీ కార్యాలయం, నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ ఐటీఐ భవనంలో జిల్లా పరిషత్ కార్యాలయం, తహసీల్ కార్యాలయం వెనుక గల దేవాదుల డేటా బేస్ సెంటర్లో ఆర్డీవో కార్యాలయం ఏర్పాటు చేసేందుకు రెవెన్యూ అధికారులు రంగం సిద్ధం చేశారు. కలెక్టరేట్ ఏర్పాటుకు పరిశీలనలో ఉన్న ఇల్లందు, కాకతీయ అతిథిగృహాల్లో 32 గదులు మాత్రమే ఉన్నాయి. అయితే కలెక్టరేట్లో కొన్ని కీలక శాఖలు ఉండే అవకాశం ఉన్నప్పటికీ పలు శాఖలు ఇతర భవనాల్లో కొనసాగించాల్సి ఉంటుంది. కాగా ఆయా శాఖలకు సింగరేణి, ప్రభుత్వ భవనాలు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తనున్నాయి. తమకు భవనాలు సమకూర్చాలంటూ పలు శాఖల అధికారులు ఇప్పటికే సింగరేణి భూపాలపల్లి ఏరియా జీఎం పాలకుర్తి సత్తయ్యకు వినతులు అందజేశారు. గురువారం మైన్స్ అండ్ జియాలజీ శాఖ అధికారులు, శుక్రవారం డీఈవో రాజీవ్ తమ శాఖలకు భవనాలు కావాలని కోరారు. మరో వారం రోజులు ఇంకా పలు శాఖల అధికారులు ఇక్కడి వచ్చి వినతులు సమర్పించే అవకాశాలు ఉన్నాయి.