విశ్వాసి అంతిమలక్ష్యం మోక్షసాధన
ఇహలోక జీవితం ఎలా గడిచినా పరలోక సాఫల్యం, శాశ్వత స్వర్గం అసలే ధ్యేయం. దీనికోసం ప్రపంచాన్ని త్యజించాల్సిన అవసరం లేదు. సన్యాసత్వం తీసుకోనవసరం లేదు. భవబంధాలను తెంచుకోనవసరం లేదు. అయితే ప్రపంచమే సర్వస్వం కాకూడదు. జీవితమంతా ప్రాపంచిక వ్యామోహాలకే ధారపోసి పరలోకాన్ని విస్మరించడమంటే, గిల్టు నగల మోజులో, అసలు సిసలు పసిడి విలువను గుర్తించక నష్టపోవడమే.
అందుకని ప్రాపంచిక జీవితాన్ని పరలోక సాఫల్యానికి సాధనగా వినియోగించుకోవాలి. ప్రపంచంలోని ప్రతిదీ అంతమై పొయ్యేదే. నశించిపోయే తాత్కాలిక ప్రపంచం కోసం, అందులోని వ్యామోహాల కోసం అనంతమైన, అనశ్వరమైన పరలోకాన్ని పాడు చేసుకోవడం అవివేకం. కనుక ఇహలోక జీవితం పరలోక సఫలతకే ఉపయోగపడాలి కాని, మరులు గొలిపే ఈ అందమైన ప్రపంచం పరలోకంలో కష్టనష్టాలను మిగిల్చేది కాకూడదు.
‘మీకు ఏదైతే ఇవ్వబడిందో, అది ప్రాపంచిక జీవిత సామగ్రి, దాని అలంకరణ మాత్రమే. అయితే అల్లాహ్ వద్ద ఉన్నది మాత్రం అత్యుత్తమమైనది, శాశ్వతమైనదీను. ఏమిటీ, మీరు ఆమాత్రం గ్రహించరా?(పవిత్ర ఖురాన్28-60). అంటే, ప్రాపంచిక జీవితం కేవలం మూణ్ణాళ్ల ముచ్చట, తాత్కాలిక తళుకు బెళుకులు మాత్రమే. పరలోక ప్రాముఖ్యతను గుర్తించకుండా, ప్రపంచానికే ప్రాధాన్యమిచ్చినట్లయితే అది మనిషిని వినాశనం వైపుకు తీసుకుపోతుందన్న విషయాన్ని గమనించాలి. పవిత్ర ఖురాన్లో ఇలా ఉంది:
‘‘మీరు మాత్రం ప్రాపంచిక జీవితానికే ప్రాముఖ్యత ఇస్తున్నారు. నిజానికి పరలోకం ఎంతో మేలైనది, శాశ్వతంగా ఉండేది (పవిత్ర ఖురాన్ 87-16,17). మరోచోట ఇలా ఉంది: ‘ఈ ప్రాపంచిక జీవితం కేవలం ఒక సయ్యాట, వినోదం తప్ప మరేమీ కాదు. అయితే పరలోక జీవితమే అసలు జీవితం. ఈ విషయం తెలుసుకుంటే ఎంత బాగుండు’’ (పవిత్ర ఖురాన్ 29-64). ఇహలోక జీవితం, ఇందులోని తళుకు బెళుకులు, వెలుగు జిలుగులు, హంగు ఆర్భాటాలు ఏవీ శాశ్వతం కాదు.
వేటికీ స్థిరత్వం లేదు. ఈ రోజు ఉండేవి రేపు ఉండవు. కాని మానవుడు అశాశ్వతమైన ఈ ప్రాపంచికపు వెలుగు జిలుగుల వెంటపడి, దాని వ్యామోహంలో కొట్టుకుపోవడం ఎంత శోచనీయం? తన అంతిమ పరిణామాన్ని పూర్తిగా విస్మరిస్తున్న మనిషి, ఈ తళుకు బెళుకు సౌందర్యమంతా తాత్కాలికమని ఆలోచించలేకపోతున్నాడు. పవిత్ర ఖురాన్ ఇలా అంటుంది... ‘‘బాగా తెలుసుకోండి: ఈ ప్రాపంచిక జీవితం ఒక క్రీడ, తమాషా, అలంకారప్రాయం, పరస్పరం బడాయిని చాటుకోవడం, సిరిసంపదలు, సంతానం విషయంలో ఒకరినొకరు మించిపోవడానికి ప్రయత్నించడం మాత్రమే. దీని ఉపమానం వర్షపు నీరులాంటిది. దానివల్ల మొలిచిన పైరు రైతులను అలరిస్తుంది. మరి ఆ పంట ఎండిపోగానే అది పసుపు వన్నెగా మారిపోవడం మీరు చూస్తారు. తరువాత అది పొట్టుపొట్టుగా తయారవుతుంది.
(ప్రపంచ పరిస్థితి కూడా ఇంతే) మరి పరలోకంలో మాత్రం తీవ్రమైన శిక్షఉంది. అల్లాహ్ తరఫున క్షమాపణ, ఆయన ప్రీతి కూడా ఉంది. మొత్తానికి ప్రాపంచిక జీవితం ఒక మభ్యపెట్టే వస్తువు తప్ప మరేమీ కాదు’’ (పవిత్ర ఖురాన్ 57-20). ఈ ప్రాపంచిక జీవితాన్ని ఒక క్రీడగా, తమాషాగా అభివర్ణించడానికి కారణం అవి మనసులను అలరిస్తాయి. ఉల్లాసాన్ని కలిగిస్తాయి. కాని అసలు సిసలు ముఖ్యవిషయాల పట్ల ఏమరపాటుకు గురి చేస్తాయి. కనుక ప్రపంచాన్ని అవసరం మేరకే వినియోగించుకుంటూ, పరలోకంపై దృష్టి పెట్టాలి. అసలు గురి స్వర్గంపైనే ఉండాలి.
- యండీ ఉస్మాన్ ఖాన్