ఆత్మహత్యలపై స్పందించండి: లెఫ్ట్
* రూ.5 లక్షల పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం
* ప్రభుత్వం దిగివచ్చే దాకా పోరు సాగుతుందని ప్రకటన
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం వెంటనే వ్యవసాయ రంగ సమస్యలు, రైతుల ఆత్మహత్యలపై తన వైఖరిని ప్రకటించాలని పది కమ్యూనిస్టు పార్టీలు హెచ్చరిక జారీ చేశా యి. ఈ నెల 5వ తేదీ నుంచి 10 వరకు పది జిల్లాల్లో రైతు కుటుంబాల్లో భరోసా కల్పించేందుకు చేపట్టిన బస్సు జాతాలకు ముగింపుగా గురువారం ఇందిరా పార్కు వద్ద ధర్నా నిర్వహించాయి.
‘రైతుల ఆత్మహత్యల ను నివారించాలి, ఆర్థిక భద్రతను కల్పించాలి-ప్రభుత్వం వెంటనే స్పందించాలి’ నినాదం తో నిర్వహించిన ధర్నాలో పది వామపక్షాల నేతలు, రైతు కుటుంబాల సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమంలో వామపక్షాల నేతలు మాట్లాడుతూ...ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం, ఆ కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, ప్రైవేట్ రుణాలను సంస్థాగత రుణాలుగా మార్చాలని, వాటిపై రెండేళ్ల మారటోరియం విధించాలని, రైతులకు వడ్డీలేకుండా బ్యాంకులు రుణాలివ్వాలని డిమాండ్ చేశారు. రైతులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని, వారి కుటుంబాల్లో మనోస్థైర్యాన్ని నింపేందుకు తాము చేపట్టిన మొదటి దశ ఉద్యమం ముగిసినా, ప్రభుత్వం స్పందించేదాకా ఎన్నేళ్లయినా పోరాటం కొనసాగించేందుకు సిద్ధమని ప్రకటించారు.
ఆత్మహత్యలు 5 వేలకు పెరుగుతాయి
ప్రభుత్వం సహాయ చర్యలను వెంటనే చేపట్టకుంటే వ్యవసాయరంగ సంక్షోభం ముదిరి రైతుల ఆత్మహత్యలు అయిదువేలకు పెరిగే ప్రమాదముందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హెచ్చరించారు. కార్పొరేట్ సంస్థలకు వేల కోట్లు ఖర్చు చేస్తామని కేసీఆర్ చెబుతున్నారని, 500 మంది రైతుల ఆత్మహత్యలకు రూ.5 లక్షల చొప్పున చెల్లించినా రూ.25 కోట్లు మాత్రమే అవుతుందన్నారు. ఆడపడుచుల కన్నీళ్లు తుడవలేని కరుకు గుండె సీఎంవా అని నిలదీశారు.
సీఎం కేసీఆర్ రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. వెంటనే అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేసి ఆత్మహత్యల నివారణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గజే్వలులో అభివృద్ధిని సమీక్షించిన సీఎం కేసీఆర్, రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని భరోసా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. రైతులు పంట రుణాలను చెల్లించవద్దని పిలుపునిచ్చారు. ఆత్మహత్యలకు పాల్పడవద్దని, పోరాడి సమస్యలను పరిష్కరించుకోవాలని న్యూడెమోక్రసీ నేత వేములపల్లి వెంకటరామయ్య రైతులకు సూచించారు.
తాము 160 మంది చనిపోయిన రైతుల కుటుంబాలను పరామర్శించామని, ఈ ఆత్మహత్యలు నిజమో కాదో తేల్చుకోవాలని ప్రభుత్వానికి సీపీఎం నేత సారంపల్లి మల్లారె డ్డి సవాల్ విసిరారు. పశ్య పద్మ (సీపీఐ), ఎండీ గౌస్ (ఎంసీపీఐ-యూ), సాదినేని వెంకటేశ్వరరావు (న్యూడెమోక్రసీ), బండా సురేందర్‌రెడ్డి(ఫార్వర్డ్ బ్లాక్), జానకిరాములు (ఆర్ఎస్పీ), మూర్తి (లిబరేషన్), మురహరి (ఎంసీపీఐ-సీ), వీరయ్య (సీపీఐ-ఎంఎల్) ఈ కార్యక్రమంలో ప్రసంగించారు. కాగా, రెండో దశ ఉద్యమ కార్యాచరణను శుక్రవారం ఎంబీ భవన్లో సమావేశమై వామపక్షాల నేతలు ఖరారు చేయనున్నారు..