అసెంబ్లీకి పది రోజులు సెలవు?
• నేడు అధికారికంగా ప్రకటించే అవకాశం
• తిరిగి 17న సభ సమావేశమయ్యే సూచనలు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు పది రోజులు బ్రేక్ పడ నుంది. శుక్రవారం సభా కార్యక్రమాలు ముగిశాక శాసనసభ, శాసన మండలికి కనీసం పదిరోజుల పాటు సెలవులు ప్రకటించే అవకాశముంది. ముందుగా బీఏసీలో నిర్ణయించిన మేరకు శని, ఆదివారాలు సెలవులుగా తిరిగి 9 నుంచి 11 వరకు సభ జరగాలి. 11న మరోసారి బీఏసీ నిర్వహించి సమావేశాల తేదీ పొడిగింపుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈనెల 18 వరకు ఉభయ సభలను నడపాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. కాగా, పెద్ద నోట్ల రద్దు అంశంపై జాతీయస్థాయిలో తమ పార్టీ కార్యక్రమాలు ఉన్నాయని, 11న తాము ఢిల్లీకి వెళ్లాల్సి ఉన్నందున సోమ, మంగళ, బుధవారాలు కూడా సెలవుగా ప్రకటిం చాలని కాంగ్రెస్ కోరింది.
ఈ మేరకు గురువారం ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన తర్వాత భోజన విరామ సమయంలో స్పీకర్ చాంబర్లో స్పీకర్ మధుసూదనాచారితో సీఎం కేసీఆర్, సీఎల్పీ నేత జానారెడ్డి భేటీ అయ్యారు. ముందుగా నిర్ణయించిన మేరకు 7, 8 తేదీలు సెలవు కావడం, ఆ తర్వాత మూడు రోజుల పాటు కాంగ్రెస్ సెలవు కోరుతున్న నేపథ్యంలో సంక్రాంతి పండుగను కూడా పరిగణనలోకి తీసుకుని 7 నుంచి 16 వరకు అసెంబ్లీకి సెలవు ప్రకటిం చాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. తిరిగి 17న సమావేశమై 19 దాకా మూడు రోజుల పాటు సభను నిర్వహించాలన్న ప్రతిపాదన కూడా వచ్చిందని చెబుతున్నారు. అసెంబ్లీ, మండలికి ఇవ్వనున్న సెలవులు, తర్వాతి తేదీలపై శుక్రవారం అధికారిక ప్రకటన చేసే అవకాశముంది.