కుర్చీలకు అతుక్కుపోతే... ఖల్లాస్!
టెన్ టు ఫైవ్ జాబ్! ఉదయం 10 గంటలకు వెళితే, సాయంత్రం అయిదింటికల్లా ఎంచక్కా ఇంటి ముఖం పట్టేయడానికి వీలుండే ఉద్యోగం! సినిమాకెళ్ళాలన్నా, షికారుకెళ్ళాలన్నా... సాయంత్రం సమయమంతా మన చేతుల్లోనే! జీవిత భాగస్వామితో తీరికగా గడపడానికీ, పిల్లల్ని దగ్గరుండి చదివించుకోవడానికీ ఇంతకు మించి వీలున్న టైమ్ ఇంకేం ఉంటుంది. నిజమే! కానీ, టెన్ టు ఫైవ్ జాబ్ అంటూ... ఆఫీసులో పూర్తిగా కుర్చీలకే అతుక్కుపోయి కదలకుండా గడిపేస్తున్నారా?
కాగితాల దగ్గర నుంచి కాఫీ దాకా ప్రతీదీ ఆఫీస్ బాయ్ తీసుకువస్తుంటే, కూర్చొన్నచోట నుంచి కదలడం లేదా? పోనీ ఎంతసేపూ పని... పని... అంటూ కంప్యూటర్‌కే కళ్ళప్పగించి, కుర్చీలో నుంచి లేవడం లేదా? అయితే, మీరు వెంటనే మీ పని తీరు మార్చుకోవాల్సిందే!
ఇలా ఒళ్ళు కదలకుండా ఒకే చోట ఉండిపోయే జీవనశైలి ఇటీవల పెరిగిపోతున్నట్లు తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ రకమైన జీవనశైలి వల్ల ముప్పు పొంచి ఉందని హెచ్చరిస్తున్నాయి. అటూ ఇటూ తిరుగుతూ చురుకుగా పని చేయకుండా, సుద్దపప్పులా ఒకే చోట కూర్చొండిపోతే, సగటు ఆయుః ప్రమాణం కన్నా ముందుగానే కన్నుమూసే ప్రమాదం ఉన్నట్లు చెబుతున్నాయి. బ్రిటన్, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాలతో సహా ప్రపంచంలోని వివిధ దేశాల్లో దాదాపు పది లక్షల మంది వయోజనులపై, ఏకంగా 16 అధ్యయనాలు జరపగా తేలిన సారాంశం ఇది. ఇలా కుర్చీలకే అతుక్కుపోవడమనేది ఇప్పుడు ‘విశ్వవ్యాప్తమైన మహమ్మారి’ అని అధ్యయనవేత్తలు ప్రకటించారు. శారీరకంగా శ్రమ చేయకపోవడమనేది ‘ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న సమస్య’ అని స్పష్టం చేశారు.
ఇవి వస్తాయ్! ఇలా చేస్తే పోతాయ్!
కదలకుండా ఒకేచోట కూర్చొని పని చేసే శైలి వల్ల గుండె జబ్బులు, పక్షవాతం, టైప్ 2 డయాబెటిస్, మతిమరుపు, చివరకు క్యాన్సర్ కూడా రావచ్చని తేలింది. ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశం లేని ఈ రోగాలు రావడానికి ప్రధాన కారణం - శారీరక శ్రమ చేయకపోవడమే అని బ్రెజిల్‌కు చెందిన ఒక పరిశోధక డాక్టర్ గారు ప్రకటించారు. అందరూ చెప్పుకొనే స్థూలకాయ సమస్యలాగా ఇది పైకి కనిపించదు కానీ, నిజానికి అంత కన్నా పెద్ద సమస్య. మన దేశంలో ఏటా దాదాపు 90 వేల మంది చురుకుదనం లేని జీవనశైలి వల్ల ఇలాంటి రోగాలు వచ్చి, చనిపోతున్నారట!
అదే గనక ప్రపంచవ్యాప్తంగా చూస్తే, 53 లక్షల మంది మరణిస్తున్నారట! ఇది దాదాపుగా ధూమపాన వ్యసన బాధితులై, మరణిస్తున్నవారి సంఖ్యకు సమానం. గట్టిగా మాట్లాడితే, ఇవన్నీ నివారించదగిన రోగాలే! వీటి ముప్పు తప్పించుకోవడానికి కూడా ఒక చిట్కా ఉంది. రోజూ కనీసం ఎనిమిది గంటల పాటు ఇలా కూర్చొని పనిచేస్తుంటే, తద్వారా వచ్చే ముప్పు తప్పించుకోవడానికి కనీసం రోజూ ఒక గంట పాటు శారీరక వ్యాయామం చేయాలి. ఆ మాట కూడా అధ్యయనవేత్తలు చెబుతున్నారు. అలాగని శారీరక వ్యాయామం అంటే, మరీ బెంబేలెత్తాల్సిన అవసరం ఏమీ లేదు. వేగంగా నడవడం, కాసేపు బైక్ రైడింగ్ చేయడం, సైక్లింగ్ లాంటి సింపుల్ పనులు చేసినా చాలట! ఇలా శారీరక వ్యాయామం చేయడం వల్ల వయసు మీద పడకుండానే రకరకాల వ్యాధులతో చనిపోయే ప్రమాదం కనీసం 60 శాతం మేర తగ్గుతుంది. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం వారు తమ తాజా అధ్యయనంలో తేల్చిన విషయం ఇది.
చురుకుగా పని చేయకుండా అలా కూర్చొండిపోవడం అలవాటు అయితే, 20 ఏళ్ళ కాలవ్యవధిలో మరణానికి దగ్గర అవుతారట! అదే గనక రోజూ కనీసం 60 నుంచి 75 నిమిషాలు ఎక్సర్సైజ్ చేస్తే, ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. రోజూ రెండు గంటలు వ్యాయామం చేయగలిగితే, మరీ బెస్టు! మొన్న మొన్నటి దాకా అయితే, రోజుకు కనీసం 30 నిమిషాల వంతున వారానికి అయిదు రోజుల పాటు వేగంగా నడవడంతో సహా ఎక్సర్సైజ్ చేస్తే మేలని ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ (డబ్ల్యు.హెచ్.ఒ) సిఫార్సులు పేర్కొన్నాయి. అయితే, ఒళ్ళు అలవని పని శైలి అన్నది ప్రపంచవ్యాప్త మహమ్మారి అయిందని కొత్త అధ్యయనాలు వెల్లడించడంతో, సిఫార్సులు మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. రోజూ అరగంట బదులు, అంతకు రెట్టింపు సమయం ఎక్సర్సైజ్ చేయమనాల్సి వచ్చింది.
కూర్చొనే ఉంటే ఏమవుతుందట?
ఒంటికి శ్రమ ఇవ్వకుండా కదలకుండా కూర్చోవడం, దానికి తోడు వ్యాయామం కూడా చేయకపోతే - బరువు పెరగడం ఖాయం. దాంతో, స్థూలకాయం వస్తుంది. పైగా, చురుకుగా, హుషారుగా పనిచేయకపోవడం వల్ల శరీరానికి శ్రమించే అలవాటు తప్పుతుంది. మన శారీరక వ్యవస్థ కూడా బద్ధకంగా తయారవుతుంది. రోజూ చేయాల్సిన జీవక్రియల్లో కూడా సత్తా తగ్గుతుంది. ఊపిరితిత్తులతో గాలి పీల్చుకొనే సామర్థ్యం తగ్గుతుంది. మనం ఊపిరితిత్తుల ద్వారా పీల్చే గాలిని బట్టే ఆక్సిజన్‌తో కూడిన రక్తం మన శరీర అవయవాలకు అందుతుందనే విషయం గుర్తుంచుకోవాలి. అలాగే, మన జీర్ణక్రియ, గ్లూకోజ్ - ఫ్రక్టోజ్‌లుగా చక్కెర విడిపోవడం లాంటివన్నీ కూడా ఇబ్బందుల పాలవుతాయి. ఈ క్రియారాహిత్యం వల్ల దీర్ఘకాలంలో ఇంకా సమస్యలు వస్తాయి. కీళ్ళనొప్పుల లాంటి దీర్ఘకాలిక సమస్యలు తలెత్తుతాయి.
తీరిక లేదా? ఇలా చేయండి!
నిజం చెప్పాలంటే - ఇవాళ సాఫ్ట్వేర్ ఉద్యోగాలనీ, మరొకటనీ... డెస్క్ జాబ్ చేసేవాళ్ళు పెరిగిపోయారు. ఎక్సర్సైజ్ చేయడానికి రోజుకు ఒక గంట విడిగా తీరిక దొరకడం లేదని కొందరు వాపోతుంటారు. వాళ్ళకీ ఒక ఉపాయం ఉంది. ఇలా డెస్క్ జాబ్ చేసేవాళ్ళందరూ రోజూ ఉదయం పూట కాసేపు రన్నింగ్ చేయాలి. లేదంటే, సైకిల్ తొక్కడమో, ఆఫీసు దగ్గరైతే సైకిల్ మీద వెళ్ళి రావడమో చేయాలి.
అందరూ ఆచరించదగిన మరో చిట్కా ఏమిటంటే - ఆఫీసులో ఉన్నప్పుడు కుర్చీకే పరిమితం కాకుండా, ప్రింట్ తీసుకోవడం కోసం ప్రింటర్ దాకా స్వయంగా వెళ్ళి, రావడం అలవాటు చేసుకోవాలి. ప్రతి గంటసేపటికీ ఒక అయిదు నిమిషాలు బ్రేక్ తీసుకోవాలి. అప్పుడు కంప్యూటర్ ముందు నుంచి, కుర్చీలో నుంచి లేచి, సెక్షన్లో కాస్త అటూ ఇటూ పచార్లు చేసి, కాళ్ళు సాగదీయాలి. కప్పు కాఫీ తాగే మిష మీద అయినా లేచి, కాఫీ మిషన్ దిశగానో, ఆఫీసు బయట కాఫీ షాపు వైపో నాలుగు అడుగులు వేయాలి. మధ్యాహ్న భోజన సమయంలోనైనా అన్నం తిన్న తరువాత కాసేపు లేచి, అటూ ఇటూ తిరిగి రావాలి. అలా రోజూ కనీసం ఒక గంటసేపైనా శారీరక శ్రమ చేయాలి. దానివల్ల అనారోగ్యం బారిన పడకుండా తప్పించుకోవచ్చు.
మధ్యవయసు దాటినవారు, వృద్ధులు సర్వసాధారణంగా పెద్దగా శారీరక శ్రమ చేయరు. పైగా, ఎక్కువగా టీవీకే కళ్ళు అప్పగించేస్తుంటారు. అది కూడా రిస్కే! సో... తాజా ట్రెండ్‌ను గుర్తించి, శారీరక వ్యాయామానికి ఓటేయడం ఎంతైనా బెటర్! ముఖ్యంగా, డెస్క్ జాబ్‌కే పరిమితమైనవారు ఈ లేటెస్ట్ వరల్డ్‌వైడ్ ట్రెండ్‌ను గమనించడం ఆరోగ్యకరం!
బమ్చిక్... బమ్చిక్... చెయ్యి బాగా!
* తాజా పరిశోధనలు చెబుతున్నది ఏమిటంటే - మధ్యవయస్కులు శారీరకంగా ఫిట్‌గా ఉండడం మరీ అవసరం. ధూమపానం తరువాత వాళ్ళకు అత్యంత ప్రమాదకరంగా పరిణమించేది - శారీరకంగా ఫిట్‌గా లేకపోవడమే!
* రోజూ వ్యాయామం చేయాలి. ధూమపానం తరువాత అతి ఎక్కువ ప్రాణాంతకం - వ్యాయామం, శారీరక శ్రమ లేకపోవడమే! అలాగే, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ కన్నా దీనివల్లే ఎక్కువ మంది త్వరగా మరణించే ప్రమాదం ఉంది.
* ఎక్కువ సేపు కదలకుండా కుర్చీకే అతుక్కుపోవడం తగ్గించాలి. అలాగే, వీలైనంత మేర శారీరక శ్రమ చేయాలి.
* గాలి పీల్చుకొనే సామర్థ్యం పెరిగేలా ఊపిరితిత్తులతో వ్యాయామం చేయాలి. లేదంటే, వృద్ధాప్యం రావడాని కన్నా ముందే కన్ను మూసే ప్రమాదం ఎక్కువట!
టీవీతోనూ తిప్పలు!
ఆఫీసులో కదలకుండా కూర్చొని చేసే పని పద్ధతికి తోడు ఇటీవల ఇళ్ళల్లో చాలామంది అదే పనిగా టీవీ చూస్తూ, కూర్చుంటున్నారు. ఆడవారైనా, మగవారైనా రోజూ సగటున 3 గంటలు టీవీకి కళ్ళప్పగించి, కదలకుండా కూర్చుంటున్నారని ఒక లెక్క. పొగ తాగడం వల్ల ఎంతమంది అనారోగ్యం పాలవుతున్నారో, దాదాపు అంత మంది ఇలా క్రియారహితంగా, చలనం లేకుండా ఒకే చోట కూర్చోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఇంకా చెప్పాలంటే, స్థూలకాయం కన్నా ఇలా కదలక, మెదలక కూర్చోవడమే మరీ డేంజర్ అని అధ్యయనవేత్తలు కదలని కుర్చీ మీద ఒట్టేసి మరీ చెబుతున్నారు. రోజు మొత్తం మీద నాలుగేసి గంటల వంతున కదలకుండా కూర్చొనేవారితో పోలిస్తే, ఎనిమిదేసి గంటలు కుర్చీకే అతుక్కుపోయేవారికి ప్రమాదం 59 శాతం ఎక్కువట!