జీఎంఆర్ ఎనర్జీలో వాటాల విక్రయం
♦ మలేషియా కంపెనీ టీఎన్‌బీకి 30% వాటాలు
♦ డీల్ విలువ రూ. 2,000 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ దిగ్గజం జీఎంఆర్ గ్రూప్ అనుబంధ సంస్థ జీఎంఆర్ ఎనర్జీ (జీఈఎల్)కి చెందిన అసెట్స్ కొన్నింటిలో 30 శాతం వాటాలను మలేషియా కంపెనీ తెనగా నేషనల్ బెర్హాద్ (టీఎన్‌బీ)కు విక్రయించింది. ఈ డీల్ విలువ 300 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 2,000 కోట్లు). సుమారు రూ. 2,750 కోట్ల పైచిలుకు ఉన్న జీఈఎల్ కార్పొరేట్ రుణభారాన్ని తగ్గించుకునేందుకు ఈ నిధులను వినియోగించనున్నట్లు జీఎంఆర్ గ్రూప్ కార్పొరేట్ చైర్మన్ కిరణ్ కుమార్ గ్రంధి సోమవారం వివరించారు.
డీల్ ప్రకారం జీఈఎల్కు చెందిన ఏడు విద్యుత్ అసెట్స్ పోర్ట్‌ఫోలియోల్లో 30 శాతం వాటాలు టీఎన్‌బీకి దాఖలుపడతాయి. రాబోయే అయిదేళ్లలో ఛత్తీస్‌గఢ్ తదితర ప్రాజెక్టుల్లో టీఎన్‌బీ పెట్టుబడులు పెట్టవచ్చు. ఈ పోర్ట్‌ఫోలియోల విలువ దాదాపు 1 బిలియన్ డాలర్ల మేర (సుమారు రూ. 6,700 కోట్లు)గా ఉంటుందని అంచనా. హైడ్రో, పునరుత్పాదక విద్యుదుత్పత్తి ప్లాంట్ల అభివృద్ధి, నిర్వహణ కార్యకలాపాల్లో తెనగా అనుభవం తమకు తోడ్పడగలదని జీఈఎల్ చైర్మన్ జీబీఎస్ రాజు ఈ సందర్భంగా తెలిపారు. మరోవైపు, 2022 నాటికల్లా ప్రజలందరికీ నిరంతరాయ విద్యుత్ అందించాలన్న కేంద్రం లక్ష్య సాధన దిశగా టీఎన్బీతో ఒప్పందం దోహదపడగలదని జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ జీఎం రావు పేర్కొన్నారు.
ఏటా రూ. 250 కోట్ల వడ్డీ మిగులు..
తాజా నిధుల రాకతో జీఈఎల్కు ఉన్న రుణభారం సుమారు రూ. 2,000 కోట్లు తగ్గి, రూ. 750 కోట్ల స్థాయికి చేరుకోగలదని కిరణ్ కుమార్ పేర్కొన్నారు. దీనితో ఏటా రూ. 250 కోట్ల మేర వడ్డీ ఆదా అవుతుందన్నారు. మరోవైపు, ఆంధ్రప్రదేశ్‌లోని గ్యాస్ ఆధారిత ప్లాంట్లు ప్రస్తుతం 35 శాతం పీఎల్‌ఎఫ్‌తో (పే లోడ్ ఫ్యాక్టర్) పనిచేస్తున్నట్లు వివరించారు. దాదాపు 4,630 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం గల ప్రాజెక్టులు జీఈఎల్ ఆధ్వర్యంలో ఉన్నాయి. కమలాంగ, వేమగిరి, వరోరా, అప్పర్ కర్నాలి హైడ్రో మొదలైన ప్రాజెక్టులు వీటిలో ఉన్నాయి. 10,818 మెగావాట్ల స్థాపిత విద్యుదుత్పత్తి సామర్ధ్యం గల టీఎన్‌బీకి.. మలేషియాలో విద్యుత్ పంపిణీ తదితర కార్యకలాపాలు కూడా ఉన్నాయి.