ఈ యువ టెన్నిస్ తార ఎవరో తెలుసా?
ఈ యువ టెన్నిస్ క్రీడాకారిణి ఎవరో గుర్తుపట్టగలరా? ఆమె టెన్నిస్ రంగంలో కంటే ఓ పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా దేశానికి సుపరిచితురాలు. తొలి మహిళా ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం రాజకీయ నాయకురాలిగా మారారు. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆమె ఎవరో ఈపాటికి అర్థమై ఉంటుంది. ఆమే కిరణ్ బేడీ.
ఐపీఎస్ అధికారిగా, అన్నా హజారే బృందం సభ్యురాలుగా, తాజాగా రాజకీయ నాయకురాలిగా బేడీ గురించి చెప్పాల్సిన పనిలేదు. అయితే ఆమె మంచి క్రీడాకారిణి అన్న విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. కిరణ్ బేడీ కాలేజీ రోజుల్లో టెన్నిస్ బాగా ఆడేవారు. 1966, 1972 జాతీయ జూనియర్ లాన్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచారు. 1974లో ఆలిండియా హార్డ్ కోర్టు టెన్నిస్ టోర్నీలో టైటిల్ సాధించారు. ఇక 1976లో జాతీయ మహిళల లాన్ టెన్నిస్ చాంపియన్ షిప్ పోటీల్లోనూ టైటిల్ సొంతం చేసుకున్నారు. కిరణ్ సోదరీమణులు అను, రీటా.. తండ్రి ప్రకాశ్ పెషావారియా కూడా టెన్నిస్ క్రీడాకారులే. అను మూడు సార్లు జాతీయ చాంపియన్‌గా నిలిచారు. వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్‌లో కూడా ఆడారు. కాలేజీ రోజుల్లో కిరణ్ పూర్తి పేరు కిరణ్ పెషావరియా. పెళ్లయిన తర్వాత తన పేరును కిరణ్ బేడీగా మార్చుకున్నారు.