కొలిక్కిరాని పదో షెడ్యూల్ సంస్థల విభజన
విద్యామండలి అంశంపై సుప్రీంకోర్టు తుది తీర్పు తర్వాతే చర్చ
హోంశాఖ సంయుక్త కార్యదర్శితో తెలుగు రాష్ట్రాల అధికారుల భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని పదో షెడ్యూల్ సంస్థల విభజన అంశం ఇంకా కొలిక్కి రాలేదు. విభజన విషయంలో ఏపీ, తెలంగాణల మధ్య ఏర్పడిన సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు మంగళవారం హోం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి అధ్యక్షతన జరిగిన సమావేశం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ముగిసింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ ఐఏఎస్ అధికారి కె.రామకృష్ణారావు, అదనపు కార్యదర్శి ఎన్.శంకర్, ఏపీ తరఫున సీనియర్ ఐఏఎస్ అధికారి ఎల్.ప్రేమచంద్రారెడ్డి, తెలుగు రాష్ట్రాల రెసిడెంట్ కమిషనర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. పదో షెడ్యూల్లో ఉన్న ఉన్నత విద్యామండలి వ్యవహారంపై సుప్రీం తీర్పును అన్ని సంస్థల విభజనకు వర్తింపజేయాలని ఏపీ ప్రభుత్వం కోరింది.
దీనికి తెలంగాణ ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉన్నత విద్యామండలి ఆస్తులు, రుణాలను జనాభా ప్రాతిపదికన 2 రాష్ట్రాలు 58ః42 నిష్పత్తిలో పంచుకోవాలని మార్చిలోనే సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేశామని తెలంగాణ అధికారులు కేంద్ర హోం శాఖ అధికారుల దృష్టికి తెచ్చారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకూ 9, 10 షెడ్యూళ్లలోని సంస్థల విభజనను నిలిపివేయాలని కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్సింగ్కు సీఎం కేసీఆర్ రాసిన లేఖను తెలంగాణ ప్రతినిధులు ఉటంకించారు. పదో షెడ్యూల్లోని సంస్థల విభజనపై మరి కొంత కాలం వేచి చూడాల్సిన అవసరం ఉందనడంతో ఎలాంటి నిర్ణయం లేకుండానే సమావేశం వాయిదా పడింది.