గిరిజనులకు భూమి హక్కులు కల్పించాలి
న్యూఢిల్లీ: అడవుల్లో నివసించే గిరిజనులు, ఇతర జాతులవారికి భూమిపై హక్కు కల్పించేందుకు వీలుగా ప్రస్తుత చట్టాన్ని సవరించాలని పార్లమెంటరీ కమిటీ సిఫారసు చేసింది. గిరిజన వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ బుధవారం లోక్సభకు తమ 18వ నివేదికను సమర్పించింది. తమ సిఫారసులను తీవ్రంగా పరిశీలించాలని కమిటీ ఆయా శాఖలను కోరింది.
అడవుల్లో నివసించే గిరిజనులకు కనీస వసతులు, ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ కల్పించే అంశాన్ని పరిశీలించాలని సూచించింది. ప్రస్తుత చట్టం ప్రకారం గిరిజనులకు అడవుల్లో భూములపై హక్కులకు సంబంధించి తగిన నిబంధనలు లేనందున తగిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే చట్టాన్ని సవరించాలని కమిటీ సిఫారసు చేసింది.