జేమ్స్ కామరూన్ 3 అవతార్లు
‘ది టెర్మినేటర్’, ‘టైటానిక్’, ‘అవతార్’లాంటి అద్భుతమైన చిత్రాల ద్వారా ప్రపంచ సినీ ప్రేక్షకులను అలరించిన జేమ్స్ కామరూన్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు. వరుసగా మూడేళ్ల పాటు సినీ ప్రియులకు మంచి అనుభూతినివ్వడం కోసం ఆయన సన్నాహాలు చేస్తున్నారు. ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లిన ‘అవతార్’కి మూడు సీక్వెల్స్ రూపొందించనున్నారాయన. 2016లో ఒకటి, 2017లో మరొకటి, 2018లో మరో సీక్వెల్‌ను విడుదల చేయాలనుకుంటున్నారు. డిసెంబర్ నెలలోనే ఈ చిత్రాలు విడుదలవుతాయి. కాగా, ఈ మూడు చిత్రాలను న్యూజిలాండ్‌లోనే తీయాలనుకుంటున్నారు. ఎందుకంటే, తొలి భాగాన్ని న్యూజిలాండ్‌లో చిత్రీకరించినప్పుడు కామరూన్‌కి మంచి అనుభూతి లభించిందట. అందుకని, మూడు సీక్వెల్స్‌ని అక్కడే షూట్ చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రాల షూటింగ్ తమ దేశంలో జరగడం గౌరవప్రదంగా భావిస్తున్న న్యూజిలాండ్ ప్రభుత్వం వీలైనన్ని సౌకర్యాలు సమకూర్చాలనుకుంటోంది.
అలాగే, లొకేషన్స్‌ని కూడా తక్కువ ధరకే ఇవ్వనున్నారట. ఇదిలా ఉంటే... పండోరా గ్రహం నేపథ్యంలో తొలి భాగం సాగుతుంది. కాగా, ఈ సీక్వెల్స్‌లో ఆ గ్రహంలో గల సముద్ర జలాల అందాలను ఆవిష్కరించాలనుకుంటున్నారట కామరూన్. నీటి లోపలి సన్నివేశాలను కనీవినీ ఎరుగని రీతిలో చిత్రీకరించాలనుకుంటున్నామని ఓ ప్రకటనలో పేర్కొన్నారాయన. సాంకేతికంగా ‘అవతార్’ని మించే స్థాయిలో ఈ సీక్వెల్స్ ఉంటాయని ఆయన తెలిపారు. ‘అవతార్’ని నిర్మించిన లైట్‌స్టామ్ ఎంటర్టైన్మెంట్, ట్వంటీయత్ సెంచురీ ఫాక్స్ సంస్థలు ఈ సీక్వెల్స్‌ని నిర్మించనున్నాయి.