టెరానెట్ నుంచి మెష్ మీడియా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్వీడన్ కేంద్రంగా పనిచేసే టెరానెట్ సంస్థ తాజాగా ‘మెష్‌మీడియా’ పేరిట కొత్త షేరింగ్ యాప్‌ను ఆవిష్కరించింది. వై-ఫైతో పనిలేకుండా స్మార్ట్ఫోన్లు, ట్యాబ్‌లు, పీసీలు వంటి పరికరాలకు దీని ద్వారా వీడియోలు, మ్యూజిక్ మొదలైన వాటన్నింటిని షేర్ చేసుకోవచ్చని సంస్థ భారత విభాగం ఎండీ వైఆర్ రావు శుక్రవారమిక్కడ వెల్లడించారు. ప్రస్తుతం ఈ తరహా యాప్‌లు కొన్ని ఉన్నప్పటికీ.. వాటికి ఐవోఎస్, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లపరంగా కొన్ని పరిమితులున్నాయని, ఏకకాలంలో పలు పరికరాలకు షేర్ చేసుకునే వీలు కూడా లేదని ఆయన వివరించారు.
అయితే, ఓఎస్‌తో సంబంధం లేకుండా మెష్‌మీడియాను ఉపయోగించి అన్ని రకాల స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్ డివైజ్‌లకు ఏకకాలంలో ఫైల్స్‌ను పంపగలిగే వీలుంటుందని రావు తెలిపారు. సుమారు 200 మీటర్ల పరిధిలో ఇది పనిచేస్తుందని చెప్పారు. నెట్వర్క్ అంతగా ఉండని కాలేజ్ క్యాంపస్‌లు, బస్సులు, రైళ్లు, ఎయిర్‌పోర్టులు మొదలైన ప్రాంతాల్లో మెష్‌మీడియా మరింత ఉపయోగకరంగా ఉండగలదన్నారు.
2017లో ఈ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ మొదలైన వాటిల్లో అందుబాటులోకి తెస్తున్నామని ఆయన తెలిపారు. ఫీజు సుమారు రూ.100 స్థాయిలో ఉండగలదన్నారు. తయారీ దశలోనే చిప్‌లలో ఈ టెక్నాలజీని పొందుపర్చేలా క్వాల్కామ్ సంస్థతో, కంటెంట్ కోసం సోనీ మొబైల్‌తో ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నట్లు రావు చెప్పారు. దీని ద్వారా కనెక్టివిటీ విభాగంలో వచ్చే మూడేళ్లలో 25% వాటా దక్కించుకోవాలని భావిస్తున్నట్లు ఆయన వివరించారు.