భూగర్భ గరళం
ప్రజల ప్రాణాలతో చెలగాటం
దశాబ్దాలుగా కలుషితమవుతున్న జలం
పారిశ్రామిక వాడల్లో పరిస్థితి దారుణం
ఎన్జీఆర్ఐ అధ్యయనంలో తేటతెల్లం
డిసెంబర్లో తుది నివేదిక
సిటీబ్యూరో: మహా శివుడు ఒక్కసారే గరళం తాగాడు. గ్రేటర్ ప్రజలు మాత్రం జలం పేరిట నిత్యం విషం తాగుతున్నారు. అధికారుల ఉదాసీనత సాక్షిగా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మహా నగరంలో భూగర్భ జలాలు కాలుష్య కోరల్లో చిక్కుకున్నాయని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ (ఎన్జీఆర్ఐ) నివేదిక స్పష్టం చేసింది. పారిశ్రామిక వాడల్లో భూగర్భ జలాలు హాలాహలంగా మారాయని ఆ సంస్థ నిగ్గు తేల్చింది. దశాబ్దాలుగా పరిశ్రమల నుంచి వెలువడుతున్న రసాయనిక వ్యర్థాలు భూమిలోకి ఇంకడంతోనే ఈ దుస్థితి తలెత్తిందని తేటతెల్లం చేసింది. ఎన్జీఆర్ఐ నిపుణులతో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చేయించిన అధ్యయనంలో ఈ అంశం వెలుగు చూసింది. పర్యావరణ పరిరక్షణలో బల్క్ డ్రగ్, ఫార్మా పరిశ్రమలు, పీసీబీల నిర్లక్ష్యానికి ఫలితమే విష జలమని వెల్లడవుతోంది. గత ఏడాది వర్షాకాలానికి ముందు... ఆ తరువాత సుమారు13 పారిశ్రామిక వాడల పరిధిలోని 160 ప్రదేశాల నుంచి భూగర్భ జలాలు... చెరువుల నీటి నమూనాలను ఎన్జీఆర్ఐ సేకరించి పరీక్షించింది. వర్షాకాలానికి ముందు... ఆ తరువాత భూగర్భ జలాల్లో కరిగిన ఘన పదార్థాల శాతంలో ఎంతో వ్యత్యాసం ఉందని తేల్చింది. సాధారణంగా ఒక లీటరు నీటిలో కరిగిన ఘన పదార్థాలు (టీడీఎస్) 500 మిల్లీగ్రాములకు మించ కూడదు. కానీ అనేక పారిశ్రామిక వాడల్లో ఇందుకు మూడు నాలుగురెట్లు అధికంగా టీడీఎస్ నమోదవడం గమనార్హం. నాచారం, ఉప్పల్, మల్లాపూర్, చర్లపల్లి, కాటేదాన్, ఖాజీపల్లి, బాలానగర్, సనత్ నగర్, జీడిమెట్ల, బొంతపల్లి, పటాన్చెరువు, బొల్లారం, పాశమైలారం పారిశ్రామికవాడల పరిధిలో నీటి నమూనాల్లోని కాలుష్యం ఆందోళన కలిగిస్తోంది.
ఇదీ తీరు
►నాచారం- ఉప్పల్ ప్రాంతాల్లోని నీటి నమూనాలో వర్షాకాలానికి ముందు టీడీఎస్ (కరిగిన ఘన పదార్థాలు) గరిష్టంగా 3730 ఎంజీ/లీ. నమోదు కాగా... వర్షాకాలం అనంతరం నిర్వహించిన పరీక్షల్లో టీడీఎస్ 1970 ఎంజీ/లీ నమోదైంది.
► మాల్లాపూర్ ఐడీఏ ప్రాంతంలో వర్షాకాలానికి ముందు టీడీఎస్ గరిష్టంగా 5390 ఎంజీ/లీ. నమోదు కాగా... వానా కాలం తరువాతనిర్వహించిన పరీక్షల్లో 1720 ఎంజీ/లీ నమోదైంది.
► చర్లపల్లి ఐడీఏలో వర్షాకాలానికి ముందు టీడీఎస్ గరిష్టంగా 6350 ఎంజీ/లీ. కాగా... ఆ తరువాత 2140 ఎంజీ/లీ నమోదైంది.
►కాటేదాన్ ఐడీఏలో వర్షాకాలానికి ముందు టీడీఎస్ గరిష్టంగా 5530ఎంజీ/లీ. కాగా... అనంతర కాలంలో 1860 ఎంజీ/లీ నమోదైంది.
► బాలానగర్, సనత్ నగర్, జీడిమెట్ల ప్రాంతాల్లో వర్షాకాలానికి ముందు టీడీఎస్ గరిష్టంగా 7500 ఎంజీ/లీ. కాగా... అనంతరం 1530 ఎంజీ/లీ.గా తేలింది.
►ఖాజీపల్లి ఐడీఏలో వర్షాకాలానికి ముందు టీడీఎస్ గరిష్టంగా 4830 ఎంజీ/లీ. నమోదు కాగా... ఆ తరువాత 1810 ఎంజీ/లీ నమోదైంది.
►బొంతపల్లి ఐడీఏ ప్రాంతాల్లో తొలుత టీడీఎస్ గరిష్టంగా 1920 ఎంజీ/లీ. కాగా..అనంతరం 1280 ఎంజీ/లీ నమోదైంది.
►పటాన్చెరువు-బొల్లారం-పాశమైలారం ప్రాంతాల్లో టీడీఎస్ గరిష్టంగా 3160 ఎంజీ/లీ. నమోదు కాగా... వర్షాకాలం అనంతరం పరీక్షల్లో 1890 ఎంజీ/లీ నమోదైంది.
డిసెంబరులో పూర్తి నివేదిక
ప్రస్తుతం ఎన్జీఆర్ఐ సమర్పించినది మధ్యంతర నివేదిక మాత్రమే. డిసెంబర్ వరకు అధ్యయనాన్ని కొనసాగించి తుది నివేదిక సమర్పించాల్సి ఉంది. నగర పరిధిలో భూగర్భ జలాల స్థితిగతులు, జలప్రవాహం దిశ, కలుషితమవుతున్న తీరు, నివారణ తదితర చర్యలను తుది నివేదికలో ఆ సంస్థ పొందుపరచనుంది.
అనర్థాలివే..
►తాగడానికి, స్నానానికి ఈ నీరు పనికి రాదు. మొక్కలు, జంతువులు ఈ నీటితో చనిపోతాయి.
►ఈ నీరు తాగిన వారికి చర్మ, జీర్ణకోశ వ్యాధులతో పాటు నిమోనియా, టైఫాయిడ్, కామెర్లు, విరేచనాలు, జలుబు వస్తాయి.
►ఈ నీటిని నిల్వ చేస్తే పాత్రలో తెల్లటి పెచ్చులు ఏర్పడతాయి.
►జీవకణాలు చనిపోతాయి.
► సల్ఫేట్లు, ఫ్లోరైడ్లు, కాల్షియం, మెగ్నీషియం వంటి మిశ్రమ పదార్థాలతో మానవ ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుంది.