పెషావర్ మృతులకు నగర విద్యార్థుల నివాళి
సాక్షి, న్యూఢిల్లీ: పాకిస్థాన్‌లోని పెషావర్‌లో ఉగ్రవాదుల పాశవిక దాడిలో మరణించిన 148 మంది విద్యార్థులకు ఢిల్లీ విద్యార్థులు ఘనంగా నివాళులర్పించారు. నగరంలోని దాదాపు అన్ని పాఠశాలల్లో విద్యార్థులు బుధవారం ఉదయం రెండు నిమిషాల పాటు మౌనం పాటించి తమ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాల కోసం పలు పాఠశాలల్లో ప్రత్యేక ప్రార్థనలు కూడా నిర్వహించారు. పాకిస్థాన్‌కు సంఘీభావం తెలుపుతూ దేశంలోని అన్ని పాఠశాలల్లో విద్యార్థులు రెండు నిమిషాల పాటు మౌనం పాటించాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ కోరిన సంగతి తెల్సిందే. ప్రధాని పిలుపును అందుకొని తమ పాఠశాలలో విద్యార్థులు మౌనం పాటించారని స్ప్రింగ్డేల్స్ స్కూల్ ప్రిన్సిపాల్ అమీతా ముల్లా వట్టల్ చెప్పారు.
ఘాతుకమైన ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ శాంతినికేతన్‌లోని సాధు వాస్వానీ స్కూల్ విద్యార్థులు మానవహారంగా ఏర్పడ్డారు. ‘ఉగ్రవాదం నుంచి ప్రపంచాన్ని కాపాడండి’, ‘మా ఆలోచనలు బుల్లెట్ ప్రూఫ్ - చదువుకోకుండా ఏ బుల్లెట్లూ మమ్మల్ని ఆపలేవు’ వంటి నినాదాలు రాసి ఉంచిన ప్లకార్డులను విద్యార్థులు ప్రదర్శించారు. ఢిల్లీ కంటోన్మెంట్‌లోని ఎయిర్‌ఫోర్స్ స్కూల్లో ప్రత్యేక ప్రార్థన సమావేశం నిర్వహించి మౌనం పాటించారు. ఈ స్కూల్లో అత్యవసర పరిస్థితిలో ప్రతిస్పందనను తనిఖీ చేసేందుకు మాక్ డ్రి నిర్వహించామని పాఠశాల ప్రిన్సిపాల్ దీపికా సింగ్ చెప్పారు. టాగోర్ ఇంటర్నేషనల్ స్కూల్లో విద్యార్థులు పాకిస్థాన్‌కు సంఘీభావం తెలుపుతూ సంతకాలు సేకరించారు.
పెషావర్ ఉగ్రవాద దాడిలో మరణించిన విద్యార్థులకు నివాళి అర్పించడం కోసం ఢిల్లీ ప్రభుత్వం, ఎన్డీఎంసీ కన్నాట్‌ప్లేస్‌లోని మాన్యుమెంటల్ ఫ్లాగ్ వద్ద గురువారం సంతాపసభ నిర్వహించనున్నాయి. ఈ కార్యక్రమంలో వెయ్యి మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పాల్గొంటారని, వారు కొవ్వొత్తులు వెలిగించి, రెండు నిమిషాలు మౌనం పాటిస్తారని విద్యాశాఖ తెలిపింది.