terror networks
-
ఉగ్ర నెట్‌వర్క్‌లోకి చిన్నారులు, మహిళలు..!
శ్రీనగర్: భారత్‌లో ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న పాకిస్తాన్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ) మరో ప్రమాదకర పన్నాగాన్ని అమలు చేస్తోంది.కశ్మీర్ లోయలో ఉగ్రవాదుల సంప్రదాయ సమాచార నెట్‌వర్క్‌ను సైన్యం దాదాపు నిర్వీర్యం చేసింది. దీంతో ఐఎస్ఐ మరో ప్రత్యామ్నాయాన్ని తీసుకువచ్చింది. దీని ప్రకారం ఉగ్ర మూకల మధ్య సమాచార మార్పిడికి మహిళలు, బాలికలు, మైనర్లను పావులుగా వాడుకుంటోంది. ఇటీవలి కాలంలో ఇందుకు సంబంధించిన పలు ఆధారాలు తమకు దొరికాయని శ్రీనగర్ కేంద్రంగా పనిచేస్తున్న 15 కార్ప్స్ లెఫ్టినెంట్ జనరల్ అమన్‌దీప్ సింగ్ అవుజ్లా తెలిపారు. ముఖ్యంగా సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు, డ్రగ్స్, ఆయుధాల రవాణాకు మహిళలు, బాలికలు, మైనర్లను వాడుకోవడం అనే కొత్త ప్రమాదం వచ్చిపడిందన్నారు. ఉగ్రమూకలు సమాచార బట్వాడాకు ప్రస్తుతం సెల్ఫోన్ల వినియోగాన్ని గణనీయంగా తగ్గించాయని చెప్పారు. లోయలో ప్రశాంతతకు భగ్నం కలిగించేందుకు నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వెంబడి ఉగ్ర మూకలు వ్యూహాలు పన్నుతుండటంతో బలగాలు సమన్వయంతో పనిచేస్తూ అప్రమత్తంగా ఉన్నాయన్నారు. కశ్మీర్లో చొరబాట్లు తగ్గినట్లు కనిపిస్తున్నప్పటికీ, పీర్ పంజాల్ దక్షిణ ప్రాంతం, పంజాబ్‌ల్లో పెరిగాయన్నారు. ఉత్తర కశ్మీర్‌లోని మచిల్‌లో ఇటీవలి చొరబాటుయత్నమే ఇందుకు తాజా ఉదాహరణ అని చెప్పారు. హింస పట్ల స్థానిక ప్రజల్లోనూ మార్పు కనిపిస్తుండటం ప్రశంసనీయమైన విషయమన్నారు. భద్రతా బలగాలకు కశ్మీర్ ప్రజలు సహకరిస్తున్నారని తెలిపారు. -
పాకిస్థాన్‌కు అమెరికా స్ట్రాంగ్ వార్నింగ్!
వాషింగ్టన్: ఉగ్రవాదం విషయంలో పాకిస్థాన్‌ను అమెరికా మరోసారి తీవ్రంగా హెచ్చరించింది. ఆ దేశంలోని ఉగ్రవాద నెట్‌వర్క్‌లను నేలమట్టం చేసేందుకు తానే స్వయంగా చర్యలు తీసుకోవడానికి ఏమాత్రం వెనుకాడబోననని తేల్చిచెప్పింది. పాకిస్థాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ (ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్) తమ దేశంలో ఉన్న ఉగ్రవాద గ్రూపులన్నింటిపై చర్యలు తీసుకోవడం లేదని, ఈ నేపథ్యంలో తానే స్వయంగా రంగంలోకి దిగాల్సి రావొచ్చునని తేల్చిచెప్పింది. 'సమస్య ఏమిటంటే పాకిస్థాన్ ప్రభుత్వంలో మూడు బలమైన వ్యవస్థలు ఉన్నాయి. ముఖ్యంగా ఐఎస్ఐ.. పాకిస్థాన్‌లో క్రియాశీలంగా ఉన్న ఉగ్రవాద గ్రూపులపై చర్యలు తీసుకోవడానికి అది నిరాకరిస్తున్నది. కొన్ని ఉగ్రవాద గ్రుపుల విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నది. వాటిని ఏమాత్రం పట్టించుకోవడం లేదు' అని ఉగ్రవాదానికి ఆర్థిక మద్దతును అడ్డుకునే అంశంలో అండర్ సెక్రటరీగా ఉన్న ఆడమ్ జుబిన్ పేర్కొన్నారు. వాషింగ్టన్ లో జరిగిన ఓ సదస్సులో ఆయన మాట్లాడుతూ 'తమ భూభాగంలోని ఉగ్రవాద నెట్‌వర్క్‌లన్నింటిపైనా కఠినంగా వ్యవహరించమని మేం భాగస్వామి అయిన పాకిస్థాన్‌ను కోరుతూ వస్తున్నాం. వారికి సాయం చేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం. ఉగ్రవాదులకు నిధులను అడ్డుకోవడంలో, వారి కార్యకలాపాలు నిలువరించడంలో పాకిస్థాన్‌కు మా సహకారం ఉంటుందనే విషయంలో ఎలాంటి సందేహానికి తావు లేదు. అదే సమయంలో ఈ ఉగ్రవాద నెట్‌వర్క్‌లను ధ్వంసం చేయడానికి అమెరికా స్వయంగా రంగంలోకి దిగడానికి ఏమాత్రం వెనుకాడబోదు' అని స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై పోరులో పాకిస్థాన్ తమ కీలక భాగస్వామిగా కొనసాగుతుందనే విషయాన్ని స్పష్టం చేస్తూనే.. అవసరమైతే తామే స్వయంగా ఉగ్రవాద గ్రూపుల భరతం పడతామని ఆయన స్పష్టం చేశారు. -
పాకిస్థాన్‌కు అమెరికా స్ట్రాంగ్ వార్నింగ్!