ఉగ్రవాద కుట్ర: యువకుడి అరెస్టు
ఆస్ట్రేలియాలో ఉగ్రవాద దాడులకు కుట్ర పన్నాడన్న ఆరోపణలతో ఓ యువకుడిని అరెస్టు చేశారు. పశ్చిమ సిడ్నీ ప్రాంతానికి చెందిన ఈ 16 ఏళ్ల యువకుడిని ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత అరెస్టు చేసినట్లు ఆస్ట్రేలియా కౌంటర్ టెర్రరిజం అధికారులు తెలిపారు. మొదటి ప్రపంచయుద్ధంలో మరణించిన ఆస్ట్రేలియన్ యోధుల సంస్మరణార్థం ప్రజలంతా ఒకచోట చేరి నివాళులు అర్పిస్తారు. దానికి కొద్ది గంటల ముందుగానే ఈ యువకుడిని అరెస్టు చేశారు.
ప్రస్తుతానికి ఈ యువకుడు ఒక్కడే ఈ కుట్రలో భాగస్తుడని తాము భావిస్తున్నట్లు న్యూ సౌత్‌వేల్స్ రాష్ట్ర పోలీసు కమిషనర్ ఆండ్రూ సిపియోన్ తెలిపారు. దాంతో ఇప్పటికి ముప్పు తప్పినట్లే భావిస్తున్నామన్నారు. గత సంవత్సరం కూడా సరిగ్గా ఇలాంటి కార్యక్రమం సమయంలోనే ఉగ్ర దాడులకు కుట్ర పన్నిన నేరంలో 14 ఏళ్ల యువకుడు సహా ఐదుగురు టీనేజర్లను మెల్బోర్న్లో అరెస్టు చేశారు. ఆస్ట్రేలియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా టీనేజర్లు ఇలా ఉగ్రవాద ప్రభావానికి లోనవుతున్నారని, ప్రధానంగా ఉగ్రవాద సంస్థలు ఆన్లైన్ ద్వారా సోషల్ మీడియాలో మహిళలను ఎరగా వేసి వీళ్లను ఆకర్షిస్తున్నాయని ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీస్ స్టేట్ కమాండర్ క్రిస్ షీహన్ చెప్పారు.