కశ్మీర్ లోయలో కొనసాగుతున్న ఆంక్షలు
శ్రీనగర్: మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, లష్కరే తోయిబా టాప్ కమాండర్ అబు దుజానా మరణించడంతో ఎటువంటి అల్లర్లు జరగకుండా ఉండేందుకు ముందస్తుగా అధికారులు కశ్మీర్ లోయలో ఆంక్షలు విధించారు. వేర్పాటువాద నాయకులు బంద్‌కు పిలుపునిచ్చి నిరసన ప్రదర్శనలు దిగుతుండటంతో ఇవాళ (బుధవారం) విద్యాసంస్థలను మూసివేయడంతో, పాటు ఇంటర్నెట్ సేవల్ నిలిపివేశారు. పలు రైళ్లను తాత్కాలికంగా ఆపేశారు.
నిన్న పుల్వామా జిల్లాలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో లష్కర్-ఇ-తైబా డివిజినల్ కమాండర్ అబు దుజానా, అతని సహచరుడు ఆరిఫ్ లాలిహారి, ఓ పౌరుడు మృతిచెందిన విషయం తెలిసిందే. దీంతో శ్రీనగర్‌లోని ఖాన్యార్, రైనావారి, నౌహట్టా, సఫా కాడల్, ఎంఆర్ గంజ్ పోలీస్స్టేషన్ల పరిధిలో కూడా పోలీసులు ఆంక్షలు విధించారు. అలాగే కశ్మీర్ యూనివర్సిటీ, ఇస్లామిక్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలు బుధవారం జరిగే అన్ని పరీక్షలను వాయిదా వేశాయి.