Terrorist encounters
-
జైషే టాప్ కమాండర్ హతం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని సోపియాన్, బారాముల్లా జిల్లాల్లో జరిగిన రెండు ఎన్కౌంటర్లలో జైషే మొహమ్మద్ టాప్ కమాండర్‌తో సహా ముగ్గురు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదుల్ని భద్రతా దళాలు హతమార్చాయి. బుద్గాంలో ఉగ్రవాదులతో జరిగిన మరో ఎన్కౌంటర్లో ఆర్మీ జవాను మృతిచెందాడు. విశ్వసనీయ సమాచారం మేరకు బారాముల్లా జిల్లాలోని లాదోరా ప్రాంతంలో బలగాలు తనిఖీలు నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులు జరపగా జైషే మొహమ్మద్ ఉగ్రవాది ఖాలిద్ అలియాస్ షాహిద్ సౌకత్ మృతిచెందాడు. స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్, స్థానిక పోలీసులు, సీఆర్పీఎఫ్, ఆర్మీ ఈ తనిఖీల్లో పాల్గొన్నాయి. ఖాలిద్ కశ్మీర్లో జరిగిన పలు ఉగ్ర ఘటనల్లో సూత్రధారిగా వ్యవహరించాడు. పాకిస్తాన్‌కు చెందిన ఖాలిద్ అక్కడే ఉగ్రవాదిగా శిక్షణ పొందాడు. మూడేళ్లుగా జమ్మూకశ్మీర్‌లో ఉగ్ర కార్యకలాపాలు నిర్వహించడంతోపాటు పలువురిని జైషేలో నియమించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ‘ఏ ప్లస్ ప్లస్’ కేటగిరీ ఉగ్రవాద జాబితాలో ఉన్న అతనిపై రూ.7 లక్షల రివార్డు ఉంది. సోపియాన్ జిల్లా కెల్లెర్ ప్రాంతంలో జరిగిన మరో ఎన్కౌంటర్లో భద్రతా బలగాలు ముగ్గురు హిజ్బుల్ ఉగ్రవాదుల్ని మట్టుబెట్టాయి. మృతుల్లో హిజ్బు ల్ ముఖ్య నియామకుడు జహిద్తో పాటు ఇర్ఫాన్, అసిఫ్ ఉన్నారు. ఇక బుద్గాంలో ప్రాణాలు కోల్పోయిన జవానును సుబేదార్ రాజ్‌కుమార్‌గా గుర్తించారు. -
హై అలర్ట్
వరంగల్ క్రైం/ఏటూరునాగారం : వరంగల్‌కు ఆనుకుని ఉన్న నల్గొండలో ఉగ్రవాదుల ఎన్కౌంటర్ల నేపథ్యంలో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యూరు. జిల్లాలో హై అలర్ట్ ప్రకటించారు. తనిఖీలు, సోదాలు ముమ్మరం చేశారు. అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నారు. జానకీపురం ఘటనలో ఇద్దరు ముష్కరులు హతమయ్యూక మూడో తీవ్రవాది వరంగల్ జిల్లాలోకి ప్రవేశించాడనే సమాచారంతో పోలీసు శాఖ గట్టి నిఘా ఏర్పాటు చేసింది. తాజాగా మంగళవారం ఐదుగురు తీవ్రవాదులు ఎన్కౌంటర్ కావడంతో జిల్లా వ్యాప్తంగా బందోబస్తు పటిష్టం చేసింది. ఏజెన్సీ ప్రాంతాలైన ఏటూరునాగారం, తాడ్వాయి, మంగపేట పోలీసులు డేగకళ్లతో పహారా కాస్తున్నారు. ఐటీడీఏ ఎదుట ప్రధాన రహదారి, తుపాకులగూడెం, వరంగల్, కమలాపురం వైపు వెళ్లే ప్రధాన రహదారుల్లో పోలీసులు నాకా బంధీ నిర్వహించారు. ఈనెల 8న ఐటీడీఏ పాలకమండలి సమావేశానికి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వచ్చే అవకాశం ఉండడంతో తనిఖీలు ముమ్మరం చేశారు. కార్యాలయం చుట్టూ సీఆర్పీఎఫ్, సివిల్, స్పెషల్ పార్టీ పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.