హై అలర్ట్
వరంగల్ క్రైం/ఏటూరునాగారం : వరంగల్‌కు ఆనుకుని ఉన్న నల్గొండలో ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యూరు. జిల్లాలో హై అలర్ట్ ప్రకటించారు. తనిఖీలు, సోదాలు ముమ్మరం చేశారు. అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నారు. జానకీపురం ఘటనలో ఇద్దరు ముష్కరులు హతమయ్యూక మూడో తీవ్రవాది వరంగల్ జిల్లాలోకి ప్రవేశించాడనే సమాచారంతో పోలీసు శాఖ గట్టి నిఘా ఏర్పాటు చేసింది. తాజాగా మంగళవారం ఐదుగురు తీవ్రవాదులు ఎన్‌కౌంటర్ కావడంతో జిల్లా వ్యాప్తంగా బందోబస్తు పటిష్టం చేసింది. ఏజెన్సీ ప్రాంతాలైన ఏటూరునాగారం, తాడ్వాయి, మంగపేట పోలీసులు డేగకళ్లతో పహారా కాస్తున్నారు. ఐటీడీఏ ఎదుట ప్రధాన రహదారి, తుపాకులగూడెం, వరంగల్, కమలాపురం వైపు వెళ్లే ప్రధాన రహదారుల్లో పోలీసులు నాకా బంధీ నిర్వహించారు. ఈనెల 8న ఐటీడీఏ పాలకమండలి సమావేశానికి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వచ్చే అవకాశం ఉండడంతో తనిఖీలు ముమ్మరం చేశారు. కార్యాలయం చుట్టూ సీఆర్పీఎఫ్, సివిల్, స్పెషల్ పార్టీ పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.