ఆ నలుగురూ దొరికేశారు!
♦ రూర్కెలాలో పట్టుబడిన మోస్ట్‌వాంటెడ్ సిమి ఉగ్రవాదులు
♦ ఓ ఉగ్రవాది తల్లిని సైతం అదుపులోకి తీసుకున్న పోలీసులు
♦ తెలంగాణ-ఒడిశా పోలీసుల సంయుక్త ఆపరేషన్
♦ చొప్పదండి బ్యాంక్‌లో చోరీ ఈ ముష్కరుల పనే
♦ జానకీపురంలో హతమైంది వీరి ప్రధాన అనుచరులే
సాక్షి, హైదరాబాద్: మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జైలు నుంచి తప్పించుకుని.. దేశవ్యాప్తంగా నేరాలకు పాల్పడిన నిషిద్ధ స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా(సిమి) ఉగ్రవాదులు ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. ఒడిశా రాష్ట్రంలోని రూర్కెలా నగరంలో బుధవారం తెల్లవారుజామున తెలంగాణ-ఒడిశా పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో నలుగురు ఉగ్రవాదులు జకీర్ హుస్సేన్, మహ్మద్ సాలఖ్, షేక్ మహబూబ్, అంజాద్‌లను అరెస్టు చేశారు. వారితో పాటు ఓ ఉగ్రవాది తల్లి సైతం పట్టుబడింది. అక్కడి ప్లాంట్ పోలీసుస్టేషన్ పరిధిలో ఉన్న మాలారోడ్ ప్రాం తంలో మంగళవారం అర్ధరాత్రి ప్రారంభమైన సెర్చ్ ఆపరేషన్ మూడు గంటల శ్రమ తర్వాత సఫలీకృతమైంది. ఈ ముష్కరులపై మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో 40 కేసుల వరకు ఉన్నాయి.
అబు ఫైజల్ నేతృత్వంలో గ్రేట్ ఎస్కేప్
ఉత్తరప్రదేశ్‌కు చెందిన అబు ఫైజల్ ముంబై కేంద్రంగా కార్యకలాపాలు సాగించాడు. సిమి మధ్యప్రదేశ్ శాఖకు చీఫ్‌గా పనిచేసిన ఇతడు డాక్టర్‌గా చెలామణి అవుతూనే దోపిడీలతో పాటు ఉగ్రవాద కార్యకలాపాల్లోనూ పాల్గొన్నాడు. ఓ హత్యాయత్నం కేసులో ఇతడిని అరెస్టు చేసిన పోలీసులు మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జైల్లో ఉంచారు. దోపిడీ, బందిపోటు దొంగతనం కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖాండ్వాలోని వివిధ ప్రాంతాలకు చెందిన సిమి ఉగ్రవాదులు జకీర్ హుస్సేన్ అలియాస్ సాధిఖ్, మహ్మద్ అస్లం అలియాస్ బిలాల్, షేక్ మహబూబ్ అలియాస్ గుడ్డు అలియాస్ మాలిక్, అంజాద్ అలియాస్ దౌడ్, మహ్మద్ ఎజాజుద్దీన్, అబిద్మీర్జా సైతం ఖాండ్వా జైల్లోనే ఉన్నారు. పేద, దిగువ మధ్య తరగతి కుంటుంబాలకు చెందిన వీరిని అబు ఫైజల్ ఆకర్షించాడు. ఈ ఏడుగురూ 2013 అక్టోబర్ 1న ఖాండ్వా జైలు నుంచి తప్పించుకున్నారు. అడ్డువచ్చిన ఇద్దరు కానిస్టేబుళ్లను విచక్షణారహితంగా పొడిచి పారిపోయారు. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే అబిద్ పోలీసులకు చిక్కాడు. 2013 డిసెంబర్లో మధ్యప్రదేశ్‌లోని బర్వానీ జిల్లాలో అబు ఫైజల్‌ను అరెస్టుచేశారు. ఇతడి విచారణలో జైలు నుంచి పారిపోవడానికి ఇండియన్ ముజాహిదీన్ ఆపరేషన్స్ చీఫ్ యాసీన్ భత్కల్ స్కెచ్ వేసినట్లు బయటపడింది.
చొప్పదండిలో భారీ చోరీ..
ఈ ఉగ్రవాదులు ‘మాల్-ఏ-ఘనీమఠ్’ పేరుతో ఉగ్రవాద కార్యకలాపాల నిధుల సమీకరణ కోసం జమాత్ అల్ ముజాహిదీన్ అనే కొత్త మాడ్యుల్ ఏర్పాటు చేశారు. వీరికి పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబా, బంగ్లాదేశ్‌కు చెందిన హుజీ-బి, ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులు సహకరించారు. నిధుల సమీరణ కోసం అనేక ప్రాంతాల్లో దోపిడీలు చేసిన ఈ ముఠా కరీంనగర్ జిల్లా చొప్పదండిలోనూ అడుగుపెట్టింది. అక్కడి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌ను టార్గెట్ చేసుకున్న వీరు.. 2014 ఫిబ్రవరి 1న బ్యాంకుపై దాడి చేసి రూ.46 లక్షల నగదు ఎత్తుకెళ్లారు.
జానకీపురంలో ఇద్దరు హతం..
గత ఏడాది మరోసారి తెలంగాణలో సిమి ఉగ్రవాదులు అడుగుపెట్టారు. మెదక్ జిల్లా సంగారెడ్డికి చేరుకున్న బిలాల్, ఎజాజుద్దీన్ అక్కడ ఓ షెల్టర్ ఏర్పాటు చేసుకున్నారు. ఏప్రిల్ 1న హైదరాబాద్ నుంచి విజయవాడ బయలుదేరారు. సూర్యాపేట బస్టాండ్‌లో తనిఖీలు చేస్తున్న సూర్యాపేట ఇన్స్పెక్టర్ మొగిలయ్యతో పాటు కానిస్టేబుల్ లింగయ్య, హోంగార్డ్ మహేష్‌పై కాల్పులు జరిపి పరారయ్యారు. ఈ ఉదంతంలో లింగయ్య, మహేష్ చనిపోయారు. అదే నెల 4న జానకీపురంలో జరిగిన ఎన్కౌంటర్లో వీరిద్దరూ హతమవగా.. ఆత్మకూరు(ఎం) ఎస్సై సిద్ధయ్య వీరమరణం పొందారు.
వీరితో జత కట్టిన మరో వ్యక్తి..
ఖాండ్వా ప్రాంతానికే చెందిన మరో ఉగ్రవాది మహ్మద్ సాలఖ్ వీరితో జతకట్టాడు. జకీర్ హుస్సేన్, షేక్ మహబూబ్, అంజాద్‌తో కలసి అనేక నేరాలు చేశాడు. 2014 సెప్టెంబర్ 12న ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నూర్ జిల్లాలో వీరు ఆశ్రయం పొందుతున్న ఇంట్లో పేలుడు సంభవించడంతో షేక్ మహబూబ్ గాయపడ్డాడు. మహబూబ్ తల్లి నజ్మాబీ అప్పటి నుంచి వీరితో కలిసే తిరుగుతోంది. ఈ ఉగ్రవాదులను పీటీ వారెంట్‌పై తీసుకురావడానికి కరీంనగర్, మహబూబ్‌నగర్ పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు.