పఠాన్ కోట్‌ను మరిపించేలా మరో దాడి!
చండీగఢ్: భారత వైమానిక దళ స్థావరం పఠాన్‌కోట్‌పై దాడికి దిగిన జైషే ఈ మహ్మద్ ఉగ్రవాద సంస్థ ఆ దాడిని మరిపించేలా మరో దాడిని చేసేందుకు కుట్రలు పన్నింది. ఈసారి దాడిని భారీ స్థాయిలో చేయాలని, దానికి పఠాన్ కోట్-2 అని పేరును కూడా పెట్టుకుంది. దీనికి సంబంధించి ఇప్పటికే భారత్ లో ఉన్న స్లీపర్ సెల్స్‌తో అన్ని ముఖ్యనగరాల్లో రెక్కీ నిర్వహిస్తోందని తెలిసింది. ఈ దాడిలో పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐతోపాటు ఇండియన్ ముజాహిదీన్ సంస్థ సహకారాన్ని కూడా తీసుకుంటున్నట్లు తెలిసింది.
ఈ మేరకు పంజాబ్ ప్రభుత్వానికి మిలిటరీ ఇంటెలిజెన్స్ ఓ నివేదికను సమర్పించింది. ఈ నివేదిక ప్రకారం జైషే ఈ మహ్మద్ సంస్థకు చెందిన కమాండర్ అవాయిస్ మహ్మద్ త్వరలోనే మలేషియాకు పంపిస్తున్నారట. అక్కడే అతడికి మలేషియా నుంచి భారత్‌లోకి అడుగుపెట్టేందుకు ఫేక్ పాస్ పోర్టులు ఇస్తారని తెలిసింది. ఇతడు పాకిస్థాన్‌కు చెందిన ఓకారా ప్రాంతవాసి అని తెలిపింది. ఇతడే ఇండియాలో రెండోసారి జరపబోయే దాడులకు నేతృత్వం వహిస్తాడని పేర్కొంది. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని నిఘా సంస్థ హెచ్చరించింది.