అయ్యో...చాన్స్ మిస్..!
ముందుగా అధికారులు వివిధ మార్గాల్లో అప్రమత్తం చేసినా వారు ఆలస్యాన్ని అధిగమించలేకపోయారు. ఫలితంగా ఎంతో కష్టపడి..ఆశలు పెంచుకొని వచ్చినా ఆదివారం జరిగిన వీఆర్వో, వీఆర్ఏ పరీక్షను రాయలేకపోయారు. జిల్లా వ్యాప్తంగా 60 మంది అవకాశాన్ని కేవలం ఒక్క నిమిషం ఆలస్యమై చేజార్చుకున్నారు. ఉస్సూరంటూ ఇళ్లకు వెళ్లిపోయారు.
పాలమూరు, న్యూస్‌లైన్ : పరీక్ష నిర్ణీత సమయం కంటే ఒక్క నిముషం లేటయినా.. పరీక్ష రాసేందుకు అవకాశం ఉండదని ముందస్తుగా అధికారులు సూచించినప్పటికీ కొందరు అభ్యర్థులు రెండు నిముషాలు ఆలస్యంగా రావటంతో పరీక్ష రాసే అవకాశాన్ని కోల్పోవాల్సి వచ్చింది. కొన్ని చోట్ల పరీక్ష కేంద్రాల నిర్వాహకులు ఒక్క నిముషం ఆలస్యమైనా మానవతా దృక్పథంతో అనుమతించినప్పటికీ మరికొన్ని చోట్ల అభ్యర్థులకు అవకాశం కల్పించని కారణంగా జిల్లా వ్యాప్తంగా దాదాపు 60 మంది వీఆర్వో రాత పరీక్షకు హాజరు కాలేకపోయారు. ఆదివారం జిల్లా వ్యాప్తంగా 243 పరీక్షా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన వీఆర్వో రాతపరీక్ష సజావుగా కొనసాగింది.
వీఆర్వో పరీక్షకు 80674 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 71,302 మంది (88.38 శాతం) హాజరయ్యారు. 9372 మంది గైర్హాజరయ్యారు. వీఆర్ఏ రాతపరీక్షకు 1986 మంది దరఖాస్తు చేసుకోగా.. 1758 మంది (88.52 శాతం) పరీక్షకు హాజరయ్యారు. 228 మంది గైర్హాజరయ్యారు. ఉదయం 10 నుంచి 12 గంటలకు వీఆర్ఓ అభ్యర్థులకు, మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు వీఆర్ఏ అభ్యర్థులకు రాత పరీక్షను నిర్వహించారు. వీఆర్ఏ పరీక్ష జిల్లా కేంద్రంలో చేపట్టగా .. వీఆర్వో అభ్యర్థులకు మహబూబ్‌నగర్ పట్టణంతోపాటు జిల్లాలోని నారాయణపేట, నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల, జడ్చర్ల, షాద్‌నగర్, దేవరకద్ర, కల్వకుర్తి, అచ్చంపేట, మక్తల్, కొత్తకోట, పెబ్బేరు, ఆత్మకూర్, ఇటిక్యాలలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంతోపాటు పలు ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలు మారుమూల ప్రాంతాల్లో ఉండటంతో అడ్రస్ దొరక్క ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఆయా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటుచేసి పరీక్ష జావుగా జరిగేలా అధికారులు అన్ని చర్యలు చేపట్టారు. జిల్లాలో 103 వీఆర్వో, 94 వీఆర్ఏ పోస్టుల భర్తీకోసం ఈ రాత పరీక్షను చేపట్టారు.