Test of the series
-
పాకిస్తాన్‌దే సిరీస్ నాలుగో వన్డేలో శ్రీలంక చిత్తు
కొలంబో: శ్రీలంకతో టెస్టు సిరీస్ గెలుచుకున్న పాకిస్తాన్ వన్డేల్లోనూ సత్తా చాటింది. తొమ్మిదేళ్ల తర్వాత లంక గడ్డపై వన్డే సిరీస్‌ను సొంతం చేసుకుంది. బుధవారం ఇక్కడ జరిగిన నాలుగో వన్డేలో పాక్ 7 వికెట్ల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన లంక 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. తిరిమెన్నె (126 బంతుల్లో 90; 5 ఫోర్లు) సెంచరీ చేజార్చుకోగా, దిల్షాన్ (59 బంతుల్లో 50; 3 ఫోర్లు) రాణించాడు. పాక్ బౌలర్లలో ఇర్ఫాన్‌కు 3, అన్వర్ అలీకి 2 వికెట్లు దక్కాయి. అనంతరం పాక్ 40.5 ఓవర్లలో 3 వికెట్లకు 257 పరుగులు చేసింది. అహ్మద్ షహజాద్ (90 బంతుల్లో 95; 12 ఫోర్లు, 1 సిక్స్), మొహమ్మద్ హఫీజ్ (88 బంతుల్లో 70; 8 ఫోర్లు, 1 సిక్స్) రెండో వికెట్‌కు 115 పరుగులు జోడించి పాక్ గెలుపులో కీలక పాత్ర పోషించారు. కెప్టెన్ అజహర్ అలీ (28 బంతుల్లో 33; 4 ఫోర్లు)తో పాటు చివర్లో షోయబ్ మాలిక్ (16 బంతుల్లో 29 నాటౌట్; 4 సిక్సర్లు) ధాటిగా ఆడారు. ఈ విజయంతో ఐదు వన్డేల సిరీస్‌ను పాక్ 3-1తో గెలుచుకుంది. చివరిదైన ఐదో వన్డే ఆదివారం హంబన్‌టోటలో జరుగుతుంది. -
మూడో స్పిన్నర్ ఎవరు?
పోటీలో ముగ్గురు బౌలర్లు శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు భారత జట్టు ప్రకటన నేడు న్యూఢిల్లీ: శ్రీలంకతో జరిగే మూడు టెస్టుల సిరీస్ కోసం భారత జట్టును గురువారం (నేడు) ఎంపిక చేయనున్నారు. సందీప్ పాటిల్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఇందుకోసం ఇక్కడ సమావేశమవుతోంది. బంగ్లాదేశ్‌తో ఫలితం తేలని ఏకైక టెస్టులో ఉన్న జట్టులో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. అయితే శ్రీలంకతో సిరీస్ కాబట్టి మూడో స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా ఎవరిని ఎంపిక చేస్తారనేదే కాస్త ఆసక్తికరంగా మారింది. ఈ స్థానం కోసం ప్రధానంగా ముగ్గురి మధ్య పోటీ నెలకొంది. రేసులో కరణ్, మిశ్రా! శ్రీలంకతో సిరీస్‌కు ప్రధాన స్పిన్నర్లుగా అశ్విన్, హర్భజన్ ఉండటం ఖాయమే. వైవిధ్యం కోసం లెగ్ స్పిన్నర్ లేదా లెఫ్టార్మ్ స్పిన్నర్‌ను అదనంగా తీసుకునే అవకాశం ఉంది. బంగ్లాతో సిరీస్‌లో జట్టులో ఉన్నా మ్యాచ్ ఆడని కరణ్ శర్మ గాయంనుంచి కోలుకున్నాడు కాబట్టి అతని ఎంపికకే అవకాశాలెక్కువ. అయితే వెటరన్ అమిత్ మిశ్రా పేరును కూడా సెలక్టర్లు పరిశీలిస్తున్నారు. లెఫ్టార్మ్ స్పిన్నర్ స్థానం కోసం అక్షర్ పటేల్ లేదా ప్రజ్ఞాన్ ఓజాలలో ఒకరికి అవకాశం దక్కవచ్చు. పటేల్ ఇటీవల వన్డేల్లో తన ప్రతిభను నిరూపించుకున్నాడు. జట్టులో స్థానం కోల్పోయిన అనంతరం యాక్షన్ మార్చుకున్న ఓజా పునరాగమనం చేసే స్థాయిలో అద్భుత ప్రదర్శన ఏమీ ఇవ్వలేదు. శ్రీలంక వికెట్ల స్వభావం దృష్ట్యా తుది జట్టులో ముగ్గురు స్పిన్నర్లు అవసరమనే ఆలోచన చేస్తే... ఒక పేసర్‌ను తగ్గించి నలుగురు స్పిన్నర్లను లంకకు తీసుకెళ్లొచ్చు. అలాంటి పరిస్థితి వస్తే మిశ్రా, అక్షర్ ఇద్దరూ జట్టులోకి రావచ్చు. ఇక వన్డే జట్టులోనూ చోటు కోల్పోయిన జడేజాకు ఇప్పట్లో చాన్స్ దక్కకపోవచ్చు. బంగ్లాదేశ్ సిరీస్‌కు జట్టును ఎంపిక చేసిన అనంతరం గాయంతో తప్పుకున్న లోకేశ్ రాహుల్ ఇప్పుడు సిద్ధంగా ఉన్నాడు. మరో వైపు 15 మంది సభ్యుల జట్టును ఎంపిక చేస్తే ప్రధాన కీపర్‌గా సాహా ఉంటాడు. అదనంగా మరో ఆటగాడిని ఎంపిక చేయాలని సెలక్టర్లు భావిస్తే రిజర్వ్ కీపర్‌గా నమన్ ఓజాకు చాన్స్ దక్కవచ్చు. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఆగస్ట్ 12న గాలేలో తొలి టెస్టు ప్రారంభమవుతుంది. -
యూనిస్ ‘హ్యాట్రిక్’ శతకం
పాకిస్థాన్ 304/2 అబుదాబి: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో పాకిస్థాన్ బ్యాట్స్‌మన్ యూనిస్ ఖాన్ అద్భుత ఫామ్ కొనసాగుతోంది. గురువారం ఆసీస్‌తో ఇక్కడ ప్రారంభమైన రెండో టెస్టు మ్యాచ్‌లో కూడా యూనిస్ (155 బంతుల్లో 111 బ్యాటింగ్; 10 ఫోర్లు, 1 సిక్స్) శతకంతో చెలరేగాడు. వరుసగా మూడు ఇన్నింగ్స్‌లలో అతనికి ఇది మూడో సెంచరీ కావడం విశేషం. ఆస్ట్రేలియా జట్టుపై ఒక బ్యాట్స్‌మన్ ఈ ఘనత సాధించడం 89 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. యూనిస్‌తో పాటు అజహర్ అలీ (223 బంతుల్లో 101 బ్యాటింగ్; 6 ఫోర్లు) కూడా సెంచరీ సాధించడంతో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి పాక్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. వీరిద్దరు మూడో వికెట్‌కు అభేద్యంగా 208 పరుగులు జోడించడం విశేషం. అంతకు ముందు టాస్ గెలిచిన పాక్ బ్యాటింగ్ ఎంచుకుంది. హఫీజ్ (45), షెహజాద్ (35) తొలి వికెట్‌కు 57 పరుగులు జోడించి జట్టుకు శుభారంభం అందించారు. ఆసీస్ బౌలర్లలో జాన్సన్, లియోన్ చెరో వికెట్ పడగొట్టారు. -
సరైన నిర్ణయం: గవాస్కర్
న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో భారత జట్టుకు డెరైక్టర్‌గా రవిశాస్త్రి నియామకాన్ని భారత బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్వాగతించారు. టెస్టుల్లో ధోని సేన వైఫల్యంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయం సరైందేనని అన్నారు. టీమ్ డెరైక్టర్ పదవికి శాస్త్రి అర్హుడేనని ఓ జాతీయ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. మరోవైపు టెస్టు సిరీస్ ఓటమిపై తీవ్ర విమర్శలెదుర్కొంటున్న కెప్టెన్ ధోనికి గవాస్కర్ అండగా నిలిచారు. భారత జట్టు కెప్టెన్‌కు మరో ప్రత్యామ్నాయం లేదని తేల్చేశారు. -
మూడో టెస్టులో ఓటమి దిశగా భారత్
-
ఇక అద్భుతం జరిగితేనే..!
- మూడో టెస్టులో ఓటమి దిశగా భారత్ - లక్ష్యం 445.. ప్రస్తుతం 112/4 లార్డ్స్‌లో విజయం తాలూకు ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించకముందే... ఇంగ్లండ్‌లో టెస్టు సిరీస్ గెలవాలనే ఆశకు పూర్తిగా రెక్కలు తొడగకముందే... భారత యువ జట్టు చేతులెత్తేసింది. మూడో టెస్టులో రక్షణాత్మక ధోరణిలో ఆడి మూల్యం చెల్లించుకున్నారు. ఇక చివరి రోజు ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఇంగ్లండ్ విజయాన్ని ఆపటం కష్టమే. చేతిలో ఉన్న ఆరు వికెట్లతో ధోనిసేన ఎంతసేపు పోరాడుతుందనేదే ఆసక్తికరం. సౌతాంప్టన్: అద్భుతమేదైనా జరిగితే తప్ప మూడో టెస్టులో భారత్ ఓటమి దాదాపు ఖాయమైనట్టే. నాలుగోరోజు భారత్ తొలి ఇన్నింగ్స్‌కు నాలుగు ఓవర్లలోనే ముగింపు పలికిన ఇంగ్లండ్.. ఆపై రెండో ఇన్నింగ్స్‌లో చకచకా పరుగులు చేసి ధోనిసేన ముందు 445 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. అనంతరం టాప్ ఆర్డర్ మరోసారి తడబడగా... బుధవారం ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసింది. రహానే (18 బ్యాటింగ్), రోహిత్ (6 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 330 పరుగులకు ఆలౌట్ కాగా... ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌ను 4 వికెట్ల నష్టానికి 205 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. నాలుగు ఓవర్లలోనే...: ఓవర్‌నైట్ స్కోరు 323/8తో ప్రారంభమైన భారత్ తొలిఇన్నింగ్స్ 4 ఓవర్లలోనే ముగిసింది. వ్యక్తిగత స్కోరుకు ఒక్క పరుగు కూడా జోడించకుండానే కెప్టెన్ ధోని (113 బంతుల్లో 50; 5 ఫోర్లు, 1 సిక్స్) అవుటయ్యాడు. ఆ వెంటనే షమీ (5)ని కూడా ఔట్ చేసిన అండర్సన్ 5 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లండ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 239 పరుగుల ఆధిక్యం లభించినా... భారత్‌ను ఫాలోఆన్ ఆడించకుండా రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగింది. ఇంగ్లండ్ దూకుడు: వీలైనంత వేగంగా పరుగులు చేసే ప్రయత్నంలో రాబ్సన్ (16), బ్యాలెన్స్ (38) అవుటయ్యారు. లంచ్ సమయానికి ఇంగ్లండ్ 2 వికెట్లకు 80 పరుగులు చేసింది. బెల్ (23), రూట్ (56) కూడా వేగంగా ఆడారు. కుక్ (114 బంతుల్లో 70 నాటౌట్; 7 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. టీ విరామానికి ముందు రూట్ అవుటయ్యాడు. 40.4 ఓవర్లలో 4 వికెట్లకు 205 పరుగులు చేసిన ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. మళ్లీ అదే తీరు..: మ్యాచ్‌ను కాపాడుకోవాలంటే నాలుగు సెషన్లపాటు ఆడాల్సివుండగా విజయ్ (12) రనౌట్ రూపంలో భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. పుజార (2) విఫలమయ్యాడు. ఈ దశలో ధావన్ (85 బంతుల్లో 37; 6 ఫోర్లు), కోహ్లి (56 బంతుల్లో 28; 3 ఫోర్లు) పోరాటపటిమ కనబరిచారు. కానీ, వీరిద్దరు వెంటవెంటనే అవుట్ కావడంతో రహానే, రోహిత్‌లపై భారం పడింది. స్కోరు వివరాలు: ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 569/7 డిక్లేర్డ్ భారత్ తొలి ఇన్నింగ్స్: 330 ఆలౌట్ ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: రాబ్సన్ (సి) ధావన్ (బి) భువనేశ్వర్ 13; కుక్ నాటౌట్ 70; బ్యాలెన్స్ (సి) పుజారా (బి) జడేజా 38; బెల్ (బి) జడేజా 23; రూట్ (బి) జడేజా 56; ఎక్స్‌ట్రాలు 5, మొత్తం (40.4 ఓవర్లలో 4 వికెట్లకు): 205 డిక్లేర్డ్. వికెట్ల పతనం: 1-22, 2-80, 3-106, 4-205. బౌలింగ్: భువనేశ్వర్ 10-0-59-1; పంకజ్ 10-4-33-0; షమీ 4-0-24-0; రోహిత్ 5-0-32-0; జడేజా 10.4-1-52-3; విజయ్ 1-0-1-0. భారత్ రెండో ఇన్నింగ్స్: విజయ్ రనౌట్ 12; ధావన్ (సి) జోర్డాన్ (బి) రూట్ 37; పుజారా (సి) జోర్డాన్ (బి) అలీ 2; కోహ్లి (సి) బట్లర్ (బి) అలీ 28; రహానే బ్యాటింగ్ 18; రోహిత్ బ్యాటింగ్ 6; ఎక్స్‌ట్రాలు 9, మొత్తం(42 ఓవర్లలో 4 వికెట్లకు): 112. వికెట్ల పతనం: 1-26, 2-29, 3-80, 4-89. బౌలింగ్: అండర్సన్ 8-3-13-0; బ్రాడ్ 9-4-18-0; వోక్స్ 5-2-7-0; అలీ 12-2-33-2; జోర్డాన్ 5-0-22-0; రూట్ 2-0-5-1; బ్యాలెన్స్ 1-0-5-0. మరో వివాదంలో అండర్సన్ ఇంగ్లండ్ పేసర్ అండర్సన్ మరోమారు వివాదాస్పద చర్యకు పాల్పడ్డాడు. బుధవారం ఆట ముగిశాక మైదానం నుంచి బయటకు వెళ్తున్న భారత బ్యాట్స్‌మన్ రహానేకు వేలు చూపిస్తూ డ్రెస్సింగ్ రూమ్ వైపు దారి చూపించాడు. ఈలోగా అంపైర్ టక్కర్ కలగజేసుకుని సర్దిచెప్పారు.