మూడో స్పిన్నర్ ఎవరు?
పోటీలో ముగ్గురు బౌలర్లు
శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు భారత జట్టు ప్రకటన నేడు
న్యూఢిల్లీ: శ్రీలంకతో జరిగే మూడు టెస్టుల సిరీస్ కోసం భారత జట్టును గురువారం (నేడు) ఎంపిక చేయనున్నారు. సందీప్ పాటిల్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఇందుకోసం ఇక్కడ సమావేశమవుతోంది. బంగ్లాదేశ్‌తో ఫలితం తేలని ఏకైక టెస్టులో ఉన్న జట్టులో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. అయితే శ్రీలంకతో సిరీస్ కాబట్టి మూడో స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా ఎవరిని ఎంపిక చేస్తారనేదే కాస్త ఆసక్తికరంగా మారింది. ఈ స్థానం కోసం ప్రధానంగా ముగ్గురి మధ్య పోటీ నెలకొంది.
రేసులో కరణ్, మిశ్రా!
శ్రీలంకతో సిరీస్‌కు ప్రధాన స్పిన్నర్లుగా అశ్విన్, హర్భజన్ ఉండటం ఖాయమే. వైవిధ్యం కోసం లెగ్ స్పిన్నర్ లేదా లెఫ్టార్మ్ స్పిన్నర్‌ను అదనంగా తీసుకునే అవకాశం ఉంది. బంగ్లాతో సిరీస్‌లో జట్టులో ఉన్నా మ్యాచ్ ఆడని కరణ్ శర్మ గాయంనుంచి కోలుకున్నాడు కాబట్టి అతని ఎంపికకే అవకాశాలెక్కువ. అయితే వెటరన్ అమిత్ మిశ్రా పేరును కూడా సెలక్టర్లు పరిశీలిస్తున్నారు. లెఫ్టార్మ్ స్పిన్నర్ స్థానం కోసం అక్షర్ పటేల్ లేదా ప్రజ్ఞాన్ ఓజాలలో ఒకరికి అవకాశం దక్కవచ్చు. పటేల్ ఇటీవల వన్డేల్లో తన ప్రతిభను నిరూపించుకున్నాడు. జట్టులో స్థానం కోల్పోయిన అనంతరం యాక్షన్ మార్చుకున్న ఓజా పునరాగమనం చేసే స్థాయిలో అద్భుత ప్రదర్శన ఏమీ ఇవ్వలేదు.
శ్రీలంక వికెట్ల స్వభావం దృష్ట్యా తుది జట్టులో ముగ్గురు స్పిన్నర్లు అవసరమనే ఆలోచన చేస్తే... ఒక పేసర్‌ను తగ్గించి నలుగురు స్పిన్నర్లను లంకకు తీసుకెళ్లొచ్చు. అలాంటి పరిస్థితి వస్తే మిశ్రా, అక్షర్ ఇద్దరూ జట్టులోకి రావచ్చు. ఇక వన్డే జట్టులోనూ చోటు కోల్పోయిన జడేజాకు ఇప్పట్లో చాన్స్ దక్కకపోవచ్చు. బంగ్లాదేశ్ సిరీస్‌కు జట్టును ఎంపిక చేసిన అనంతరం గాయంతో తప్పుకున్న లోకేశ్ రాహుల్ ఇప్పుడు సిద్ధంగా ఉన్నాడు. మరో వైపు 15 మంది సభ్యుల జట్టును ఎంపిక చేస్తే ప్రధాన కీపర్‌గా సాహా ఉంటాడు. అదనంగా మరో ఆటగాడిని ఎంపిక చేయాలని సెలక్టర్లు భావిస్తే రిజర్వ్ కీపర్‌గా నమన్ ఓజాకు చాన్స్ దక్కవచ్చు. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఆగస్ట్ 12న గాలేలో తొలి టెస్టు ప్రారంభమవుతుంది.