Spinner
-
దివికేగిన దిగ్గజం
టి20 క్రికెట్ మాయలో పడి, సత్తా ఉన్నా... ఐదు రోజుల ఆటకు బైబై చెప్పేసి... జస్ట్ నాలుగు ఓవర్లేసే లీగ్‌లకు జైకొట్టే బౌలర్లున్న ఈ రోజుల్లో సంప్రదాయ టెస్టులకే సర్వం ధారపోసిన స్పిన్నర్ బిషన్‌సింగ్ బేడీ. ఆయన మునివేళ్లతో బంతిని సంధిస్తే వికెట్. ఆయన స్పిన్ ఉచ్చు బిగిస్తే ప్రత్యర్థి ఆలౌట్. అంతలా... భారత క్రికెట్లో తన స్పిన్‌తో వికెట్లను దున్నేసిన దిగ్గజం బేడీ. ఎరాపల్లి ప్రసన్న, భగవత్ చంద్రశేఖర్లతో కలిసి దుర్బేధ్యమైన స్పిన్ త్రయంగా ప్రత్యర్థి జట్లను విలవిలలాడించాడు. ఈ త్రయానికి తర్వాత శ్రీనివాస్ వెంకటరాఘవన్ జతయ్యాక బ్యాటర్లకు చిక్కులు, చుక్కలే కనిపించేవంటే అతిశయోక్తి కాదు. క్రికెట్ జగాన్ని స్పిన్ మాయాజాలంతో ఊపేసిన బిషన్ సింగ్ ఆఖరి శ్వాస విడిచి దివికేగాడు. భారత క్రికెట్‌ను కన్నీట ముంచాడు. న్యూఢిల్లీ: భారత క్రికెట్లో స్పిన్‌కే వన్నెలద్దిన బౌలింగ్ దిగ్గజం బిషన్ సింగ్ బేడీ సోమవారం ఢిల్లీలో తుదిశ్వాస విడిచారు. స్పిన్ శకాన్ని శోకసంద్రంలో ముంచి తిరిగిరాని లోకాలకు వెళ్లారు. ఆయన వయస్సు 77 ఏళ్లు. గత రెండేళ్లుగా తీవ్ర అనారోగ్యంతో సతమతమవుతున్నారు. పలు శస్త్రచికిత్సలు కూడా జరిగాయి. నెల క్రితం మోకాలు ఆపరేషన్ జరిగింది. అనారోగ్యంతో సుదీర్ఘకాలంగా పోరాడుతున్న ఆయన సోమవారం ఉదయం తన నివాసంలో కన్నుమూశారు. మోకాలు శస్త్రచికిత్స అనంతరం సోకిన ఇన్ఫెక్షన్ క్రమంగా పెరగడంతోనే మృతి చెందినట్లు ఆయన సన్నిహితుడొకరు వెల్లడించారు. ఈ పంజాబీ క్రికెట్ స్టార్ 1946లో సెపె్టంబర్ 25న అమృత్‌సర్‌లో జన్మించారు. తదనంతరం క్రికెట్లో చెరగని ముద్ర వేసి ఢిల్లీలో సెటిలయ్యారు. ఆయనకు భార్య అంజు, కుమారుడు అంగద్ బేడీ (సినీనటుడు) ఉన్నారు. అంగద్ భార్య నేహ ధూపియా బాలీవుడ్ హీరోయిన్. మొదటి భార్య గ్లెనిత్ మైల్స్ ద్వారా ఇద్దరు సంతానం కొడుకు గావసిందర్, కుమార్తె గిలిందర్ ఉన్నారు. స్పిన్నర్లు ఉపఖండానికే పరిమితమనే విమర్శల్ని తన స్పిన్ మంత్రతో విదేశీ గడ్డపై తిప్పిగొట్టిన ఘనత బిషన్ సింగ్‌ది. తన కెరీర్ అనంతరం కూడా క్రికెట్‌తో అనుబంధాన్ని కొనసాగించారు. ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ)కు విశేష సేవలందించారు. విరాట్ కోహ్లి సహా ఎంతో మంది కుర్రాళ్లకు ఫిట్నెస్ గురించి పూర్తిస్థాయి అవగాహన కల్పించారు. కోహ్లి తను ఫిట్నెస్ను కాపాడుకోవడానికి బేడీనే కారణమని పలు సందర్భాల్లో చెప్పాడు. ఇదీ చరిత్ర... సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లి లాంటి బ్యాటర్లు అసలైన క్రికెట్ టెస్టు ఫార్మాటేనని ఘంటాపథంగా చెప్పే సంప్రదాయ క్రికెట్లో స్పిన్నర్‌గా బేడీ ఓ వెలుగు వెలిగాడు. ఈ తరం క్రికెటర్లు మెరుపుల టి20లకు అలవాటు పడి టెస్టు క్రికెట్‌ను పక్కన బెడుతున్నారు. మరి బిషన్ సింగ్ ఐదు రోజుల టెస్టుల్లో, నాలుగు రోజుల ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో సుదీర్ఘకాలం దేశానికి, రాష్ట్రానికి సేవలందించాడు. 1967 నుంచి 1979 వరకు తన అంతర్జాతీయ కెరీర్లో 67 టెస్టులాడిన స్పిన్ లెజెండ్ 266 వికెట్లను పడగొట్టాడు. ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు 14 సార్లు తీశాడు. ఉత్తమ ప్రదర్శన 7/98. ఇక 370 ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 1,560 వికెట్లను చేజిక్కించుకున్నాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా బిషన్ సింగ్ పేరిటే ఇంకా రికార్డు ఉండటం విశేషం. ఫస్ట్‌క్లాస్ ఫార్మాట్లో బిషన్ ఇన్నింగ్స్‌లో 5 వికెట్లను ఏకంగా 106 సార్లు పడగొట్టారు. మ్యాచ్‌లో 10 వికెట్లను 20 సార్లు తీశాడు. ఉత్తమ ప్రదర్శన 7/5. వన్డే ఫార్మాట్లో తక్కువగా 10 మ్యాచ్‌లే ఆడాడు. 7 వికెట్లు తీశాడు. 1975 తొలి వన్డే వరల్డ్‌కప్‌లో, 1979 రెండో వన్డే వరల్డ్‌కప్‌లో బేడీ భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 1975 వరల్డ్‌కప్‌లో ఈస్ట్ ఆఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో బిషన్ 12 ఓవర్లు వేసి 8 మెయిడెన్లు తీసుకొని కేవలం 6 పరుగులిచ్చి 1 వికెట్ తీశాడు. అంతేకాదు...‘బేడీ సాబ్’ విజయవంతమైన సారథి కూడా! 22 టెస్టులకు నాయకత్వం వహించి 6 మ్యాచ్‌ల్లో భారత్‌ను గెలిపించాడు. ఇందులో మూడైతే విదేశీ గడ్డపై సాధించిన ఘనవిజయాలున్నాయి. బేడీ కెప్టెన్సీలోనే భారత జట్టు 1976లో పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టులో 403 పరుగుల రికార్డు లక్ష్యాన్ని ఛేదించింది. ఈ రికార్డు 27 ఏళ్ల పాటు (2003 వరకు) చరిత్ర పుటల్లో నిలిచింది. 1970లో కేంద్ర ప్రభుత్వంనుంచి ‘పద్మశ్రీ’ పురస్కారం అందుకున్న బిషన్ సింగ్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 2004లో ‘సీకే నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్మెంట్’ అవార్డుతో సత్కరించింది. ఇదీ ఘనత... ఈ భారత స్లో లెఫ్టార్మ్ స్పిన్నర్ అంటే అరివీర ఆజానుబాహులైన విండీస్ బ్యాటర్లకు వణుకే! ముఖ్యంగా 1970వ దశకంలో ప్రపంచ క్రికెట్‌ను తన స్పిన్ తో శాసించాడు. 1969–70 సీజన్లో భారత్, ఆ్రస్టేలియాల మధ్య జరిగిన ముఖాముఖి టెస్టు సిరీస్‌లో 20.57 సగటుతో 21 వికెట్లు పడగొట్టాడు. 1972– 73 సీజన్లో ఇంగ్లండ్‌తో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో 25.28 సగటుతో 25 వికెట్లు తీశాడు. ప్రత్యర్థి బౌలర్ల పాలిట సింహస్వప్నమయ్యే వెస్టిండీస్ బ్యాటర్లను వారి సొంతగడ్డపై గడగడలాడించిన బౌలర్ ఎవరైన ఉన్నారంటే అది బేడీనే! 1975–76 సీజన్లో 25.33 సగటుతో 18 వికెట్లు చేజిక్కించుకున్నాడు. ఆ మరుసటి సీజన్లో న్యూజిలాండ్‌ను తిప్పేసి 13.18 సగటుతో 22 వికెట్లు పడగొట్టాడు. ఈ 1976–77 సీజన్లోనే ఇంగ్లండ్ మెడకు స్పిన్ ఉచ్చు బిగించి 25 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. 1977–78 సీజన్లో ఈసారి ఆ్రస్టేలియా పనిపట్టాడు. 23.87 సగటులో 31 వికెట్లు తీశాడు. అరుణ్ జైట్లీ పేరుపెడితే నొచ్చుకున్నారు! ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలోని స్టాండ్‌కు బిషన్ సింగ్ బేడీ పేరు పెట్టారు. అయితే మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ అగ్రనేత అరుణ్ జైట్లీ మృతి అనంతరం ఆ స్టేడియానికి జైట్లీ పేరు పెట్టడాన్ని తీవ్రస్థాయిలో తప్పుబట్టారు. క్రికెటేతరుడి పేరు పెట్టడాన్ని సహించలేక స్టాండ్‌కు తన పేరు తొలగించాలని బహిరంగంగా డిమాండ్ చేశారు. భారత క్రికెట్‌పై చెరగని ముద్ర బిషన్ సింగ్ మరణ వార్తను తట్టుకోలేకపోయా. స్పిన్‌పై ఆయనకున్న పట్టు, ఆటపై కనబరిచే పట్టుదల అసాధారణం. భావి క్రికెటర్లకు, భవిష్యత్ తరాలకు అతని అంకితభావం స్ఫూర్తిదాయకం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలి. ఓం శాంతి. –ప్రధాని నరేంద్ర మోదీ బేడీ మృతిపట్ల విచారం వ్యక్తం చేస్తున్నా. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. –ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ అలర్డైస్ స్పిన్ బౌలింగ్‌తో క్రికెట్ పుటల్లోకెక్కారు. భారత క్రికెట్లో స్పిన్‌కు మూలస్తంభంలా ఉన్నారు. అలాంటి దిగ్గజం మనమధ్య లేకపోవడం బాధాకరం. –బీసీసీఐ కార్యదర్శి జై షా బేడీ మార్గదర్శనం వల్లే ఇంగ్లండ్‌లో నా తొలి శతకం సాకారమైంది. అలాంటి లెజెండ్ ఇప్పుడు లేకపోవడం బాధాకరం. –బ్యాటింగ్ దిగ్గజం సచిన్ స్పిన్నర్లందరికి ఆయనే స్ఫూర్తి. యువతరానికి దిక్సూచి. బిషన్‌సింగ్ ఆత్మకు శాంతి చేకూరాలి. ఆయన కుటుంబానికి నా సానుభూతి. –మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే బిషన్ సింగ్ లేరన్న వార్త జీర్జించుకోలేనిది. భారత క్రికెట్‌కోసం ఎంతో చేశారు. ఆయన కుటుంబానికి దేవుడు స్థయిర్యాన్ని ఇవ్వాలి. –మాజీ ఓపెనర్ గంభీర్ చాలా బాధగా ఉంది. ముమ్మాటికీ బిషన్‌సింగ్ గ్రేటెస్ట్ క్రికెటర్. యువ క్రికెటర్లు ఎదిగేందుకు ఎంతో పాటుపడ్డారు. –సీనియర్ స్పిన్నర్ అశ్విన్ బేడీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్న. ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నాను. –మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ అంత్యక్రియలకు హాజరైన కపిల్, సెహ్వాగ్ ‘సర్దార్ ఆఫ్ స్పిన్’ బిషన్ సింగ్ బేడీ పార్థివ దేహానికి 1983 ప్రపంచకప్ కెప్టెన్ , దిగ్గజ ఆల్‌రౌండర్ కపిల్ దేవ్, 2011 ప్రపంచకప్ విజేత సభ్యుడు సెహ్వాగ్ తదితర మేటి, మాజీ క్రికెటర్లు నివాళులర్పించారు. స్థానిక లోధి స్మశానవాటికలో మంగళవారం నిర్వహించిన అంత్యక్రియలకు కీర్తి ఆజాద్, మదన్‌లాల్, నెహ్రా, అజయ్ జడేజా, మురళీ కార్తీక్, జహీర్, అజహరుద్దీన్ తదితర క్రికెటర్లు హాజరయ్యారు. కడసారి వీడ్కోలు పలికేందుకు వచ్చిన అభిమానులు, జూనియర్ క్రికెటర్ల అశ్రునయనాల మధ్య పంజాబీ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరిగాయి. -
అక్టోబరులో 800
శ్రీలంకన్ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘800’. మురళీధరన్ పాత్రలో ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ఫేమ్ మధుర్ మిట్టల్ నటించగా, ఆయన భార్య మదిమలర్ పాత్రలో మహిమా నంబియార్ కనిపిస్తారు. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వంలో వివేక్ రంగాచారి ఈ బయోపిక్‌ను నిర్మించారు. ఈ సినిమా దేశవ్యాప్త థియేట్రికల్ రిలీజ్ హక్కులను నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ సొంతం చేసుకున్నారు.ఈ సినిమాను అక్టోబరు 6న విడుదల చేస్తున్నట్లుగా గురువారం చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సందర్భంగా శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ– ‘‘తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ‘800’ సినిమాను వచ్చే నెల 6న విడుదల చేస్తున్నాం. ముత్తయ్య మురళీధరన్ జీవితంలోని క్రికెట్ అంశాలను గురించి మాత్రమే కాదు.. ఆయన బాల్యంలో జరిగిన ఘటనలను కూడా ఈ చిత్రంలో చూపిస్తాం. కేవలం క్రికెట్ ప్రేమికులనే కాదు.. ప్రేక్షకులందరినీ ఆకట్టుకునే భావోద్వేగాలు ఈ సినిమాలో ఉన్నాయి’’ అన్నారు. ‘‘ఈ సినిమా పట్ల శ్రీపతి అంకితభావం, పట్టుదల చూసి ఈ సినిమాకు ఓకే చెప్పాను. ప్రజలంతా ఈ సినిమా చూస్తారని ఆశిస్తున్నాను’’ అన్నారు ముత్తయ్య మురళీధరన్. ఈ చిత్రానికి సంగీతం: జీబ్రాన్. -
క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన న్యూజిలాండ్ స్పిన్నర్
న్యూజిలాండ్ లెగ్ స్పిన్నర్ టాడ్ ఆస్టిల్ అన్ని రకాల క్రికెట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని సోషల్‌మీడియా వేదికగా ఆస్టిల్ వెల్లడించాడు. తన ఈ అద్భుత ప్రయాణంలో మద్దతుగా నిలిచిన న్యూజిలాండ్ క్రికెట్‌కు, అభిమానులకు అతడు ధన్యవాదాలు తెలిపాడు. అదే విధంగా కాంటర్బరీ క్రికెట్ క్లబ్ తనకు ఎన్నో జ్ణాపకాలను అందించిందని ఆస్టిల్ భావోద్వేగానికి లోనయ్యాడు. ఇక న్యూజిలాండ్ తరపున అన్నిఫార్మాట్ల్లో కలిపి 19 మ్యాచ్‌లు ఆడిన ఆస్టిల్ 24 వికెట్లు పడగొట్టాడు. అయితే ఆస్టిల్కు జాతీయ జట్టు తరపున కాకుండా దేశీవాశీ క్రికెట్లో ఘనమైన రికార్డు ఉంది.అతడు దేశీవాశీ క్రికెట్లో దాదాపు 300కి పైగా మ్యాచ్‌లు ఆడాడు. ఫస్ట్-క్లాస్ క్రికెట్లో కాంటర్బరీ తరపున అత్యధిక వికెట్లు సాధించిన రికార్డు కూడా అతడి పేరిటే ఉంది. అతడు తన ఫస్ట్ క్లాస్ కెరీర్లో 334 వికెట్లు పడగొట్టాడు. ఇక 36 ఏళ్ల ఆస్టిల్ తన క్రికెట్ కెరీర్లో చివరి మ్యాచ్ ఈ ఏడాది జరిగిన సూపర్ స్మాష్ ఫైనల్లో కాంటర్బరీ తరపున ఆడాడు. ఈ ఏడాది సూపర్ స్మాష్ సీజన్లో 11 మ్యాచ్‌లు ఆడిన అతడు 11 వికెట్లు పడగొట్టాడు. View this post on Instagram A post shared by Todd Astle (@todd.astle) చదవండి: Prithvi Shaw: పృథ్వీ షా 'సెల్ఫీ' వివాదంలో కొత్త ట్విస్ట్..! -
స్పిన్నర్‌గా మారిన పొలార్డ్.. ముంబై ఇండియన్స్‌కు ఇక.. వీడియో వైరల్
వెస్టిండీస్ కెప్టెన్ కిరాన్ పొలార్డ్ సరికొత్త అవతారం ఎత్తాడు. సాదారణంగా మీడియం పేస్ బౌలింగ్ చేసే పొలార్డ్.. తొలి సారి స్పిన్నర్‌గా మారాడు. ట్రినిడాడ్ టీ10 బ్లాస్ట్‌లో భాగంగా స్కార్లెట్ ఐబిస్ స్కార్చర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. సోకా కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పొలార్డ్ ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేస్తూ అందరనీ ఆశ్చర్య పరిచాడు. సోకా కింగ్స్ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ వేసిన పొలార్డ్ స్పిన్ బౌలింగ్ చేయడమే కాకుండా.. బ్యాటర్ లియోనార్డో జూలియన్‌ను క్లీన్ బౌల్డ్ కూడా చేశాడు.ఈ మ్యాచ్‌లో కేవలం ఒకే ఓవర్ బౌలింగ్ చేసిన పొలార్డ్ 10 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. కాగా పొలార్డ్ బౌలింగ్ సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. మంబైకు కొత్త స్పిన్నర్ దొరికేశాడంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. సోకా కింగ్స్ నిర్ణీత 10 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 150 పరుగులు సాధించింది. అయితే వర్షం కారణంగా టార్గెట్‌ను 8 ఓవర్లకు 122 పరుగులకు కుదించారు. ఇక 122 పరుగల లక్ష్యంతో బరిలోకి దిగిన స్కార్చర్స్ మూడు వికెట్లు కోల్పోయి 80 పరుగులకు మాత్రమే పరిమితమైంది. అయితే స్కార్చర్స్ కెప్టెన్ పొలార్డ్ మాత్రం కేవలం 8 పరుగుల మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. ఐపీఎల్-2022లో ముంబై ఇండియన్స్‌కు పొలార్డ్ ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. Kieron Pollard bowling off-spin in the Trinidad T10 Blast.pic.twitter.com/rN0mq04II8 — Johns. (@CricCrazyJohns) February 28, 2022 -
వహ్వా అజాజ్! ఏమా బౌలింగ్.. ధనాధన్‌గా ‘టెన్’ రికార్డు
ఒకటి, రెండు, మూడు, నాలుగు... భారత ఆటగాళ్లు పెవిలియన్ చేరుతున్నారు... న్యూజిలాండ్ లెఫ్టార్మ్ స్పిన్నర్ ఎజాజ్ పటేల్ వికెట్ల లెక్క కూడా మారుతోంది... తొలి రోజు ఆట ముగిసేసరికి పడిన నాలుగు వికెట్లూ అతని ఖాతాలోనే... ఎజాజ్ సంబరపడ్డాడు. తాను పుట్టిన ఊర్లో ఒక గుర్తుంచుకునే ప్రదర్శన వచ్చినందుకు అందరి ముందు సంతోషాన్ని ప్రదర్శించాడు. శనివారం ఉదయం సాహా అవుట్ కాగానే ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ఘనత... ఇదీ చెప్పుకోదగ్గ విశేషమే! తర్వాతి బంతికే ఆరో వికెట్. కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శన కూడా వచ్చేసింది. టెస్టుల్లో భారత జట్టు తొలి ఆరు వికెట్లు ఒక స్పిన్నర్‌కు కోల్పోవడం ఇదే తొలిసారి. అయినా సరే అద్భుతం జరగవచ్చని ఎవరూ ఊహించడం లేదు. ‘ఆ ఘనత’ సాధ్యమా అనే చర్చ కూడా వినిపించలేదు. దాదాపు 28 ఓవర్ల పాటు మరో వికెట్ పడకపోవడంతో ఎజాజ్ బౌలింగ్‌పై విశ్లేషణ కూడా దాదాపుగా ఆగిపోయింది. కానీ ఎజాజ్ మాత్రం యంత్రంలా అలుపెరుగకుండా బౌలింగ్ చేస్తూనే పోయాడు. మయాంక్ వికెట్‌తో ఒక్కసారిగా కదలిక... ఏదైనా సాధ్యమే అనిపించింది! కొద్ది సేపటి తర్వాత ఆ సమయం రానే వచ్చింది. 7 బంతుల వ్యవధిలో 3 వికెట్లు... అంతే! పదికి పది.. ఎజాజ్ యూనుస్ పటేల్ టెస్టు క్రికెట్లో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. 144 ఏళ్లు... 2,438 టెస్టుల చరిత్రలో జిమ్ లేకర్, అనిల్ కుంబ్లేల తర్వాత ఈ ఘనత సాధించిన మూడో బౌలర్‌గా నిలిచాడు. పాతికేళ్లు తిరిగే సరికి... శుక్రవారం తొలి రోజు 4 వికెట్లు తీసిన ఎజాజ్ పటేల్ ఆట ముగిసిన తర్వాత వాంఖెడే స్టేడియం నుంచి బయటకు వెళుతూ అక్కడి ‘ఆనర్స్ బోర్డ్’ వద్ద క్షణకాలం పాటు ఆగి బోర్డు వైపు చూస్తూ నిలబడ్డాడు. ఈ మైదానంలో సెంచరీలు సాధించిన, ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితా దానిపై ఉంది. రేపు మరో వికెట్ తీసి తన పేరు అక్కడ చేర్చాలని అతను అనుకున్నాడు. అయితే ఐదు వికెట్లే కాదు... మరికొన్ని గంటల్లో ఏకంగా 10 వికెట్లు తీసి చరిత్ర సృష్టిస్తానని అతను ఊహించి ఉండకపోవచ్చు! ► ముంబైలోనే పుట్టిన ఎజాజ్ ఎనిమిదేళ్ల వయసులో ఉపాధి కోసం అతని కుటుంబం న్యూజిలాండ్‌కు తరలి వెళ్లింది. పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకునేందుకో, ఇక్కడే ఉండిపోయిన బంధుమిత్రులను కలిసేందుకో గతంలోనూ ఎజాజ్ చాలా సార్లు వచ్చాడు. కానీ ఈసారి మాత్రం పుట్టిన గడ్డపై ఒక అద్భుతాన్ని సృష్టించేందుకే వచ్చినట్లున్నాడు. బాంబేను వీడిన సరిగ్గా 25 ఏళ్ల తర్వాత మరో జట్టు తరఫున ఆడేందుకు వచ్చి భారత్‌పైనే అతను అత్యంత అరుదైన ఘనతను నమోదు చేశాడు. ఈ పాతికేళ్ల ప్రస్థానం అతని కళ్ల ముందు కచ్చితంగా సినిమా రీళ్లలా కదలాడి ఉంటుంది! ► ముంబై టెస్టుకు ముందు మూడేళ్ల కెరీర్లో ఎజాజ్ పటేల్ ఆడినవి 10 మ్యాచ్‌లే! 32.48 పరుగుల సగటుతో 29 వికెట్లు తీసిన సాధారణ లెఫ్టార్మ్ స్పిన్ బౌలర్. టీమ్ మేనేజ్మెంట్ లెక్కల్లో అతను ఆ జట్టు నంబర్‌వన్ స్పిన్నర్ కూడా కాదు. సాన్‌ట్నర్, ఇష్ సోధిల తర్వాతే అతనికి ప్రాధాన్యం. వీరిలో ఎవరైనా తప్పుకుంటేనే మ్యాచ్ దక్కే అవకాశం. కెరీర్ తొలి టెస్టులోనే ఐదు వికెట్ల ప్రదర్శనతో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచినా అది అతని కెరీర్ జోరుగా సాగేందుకు ఏమాత్రం పనికి రాలేదు. సరిగ్గా చెప్పాలంటే తాజా ప్రదర్శనకు ముందు 33 ఏళ్ల ఎజాజ్‌కు పెద్దగా గుర్తింపూ లేదు. కానీ ఇకపై ఎవరూ మరచిపోలేని విధంగా తన పేరును అతను చరిత్రలో చెక్కుకున్నాడు! ► న్యూజిలాండ్ వెళ్లిన తర్వాతే క్రికెట్‌పై ఎజాజ్‌కు ఆసక్తి కలిగింది. అయితే ఆటను అతను లెఫ్టార్మ్ పేస్ బౌలర్‌గా మొదలు పెట్టాడు. స్వింగ్ బౌలర్‌గా రాణించిన అతను ఆక్లాండ్ తరఫున అండర్–19 స్థాయిలో సౌతీతో సమానంగా అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. అయినా సరే న్యూజిలాండ్ అండర్–19 టీమ్‌లో అతనికి చోటు దక్కలేదు. 5 అడుగుల 8 అంగుళాల తన ఎత్తు పదునైన పేస్ బౌలింగ్‌కు పనికి రాదని కూడా అతను గుర్తించాడు. భవిష్యత్తులో కివీస్ తరఫున ఆడాలంటే ఏదైనా ప్రత్యేకంగా చేయాలని అర్థమైంది. తన క్లబ్ తరఫున ఇంగ్లండ్‌లో మ్యాచ్‌లు ఆడేందుకు వెళ్లిన ఎజాజ్‌కు న్యూజిలాండ్ మాజీ స్పిన్నర్ దీపక్ పటేల్ మార్గదర్శిగా నిలువగా... స్పిన్నర్‌గా ఎదిగేందుకు మంచి అవకాశాలు ఉన్నాయని భావించి కఠోర సాధన చేశాడు. వరుసగా మూడేళ్ల పాటు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలవడంతో జాతీయ జట్టు పిలుపు లభించింది. 30 ఏళ్ల వయసులో న్యూజిలాండ్ తరఫున తొలి మ్యాచ్ ఆడే అవకాశం దక్కింది. ► ఈ పది వికెట్ల జాతరలో ఎజాజ్ ప్రయోగాలేమీ చేయలేదు. సాంప్రదాయ లెఫ్టార్మ్ స్పిన్నర్ వేసే బంతులతోనే సత్తా చాటాడు. ‘లెన్త్’ మాత్రం తప్పకుండా జాగ్రత్త పడ్డాడు. సహచర బౌలర్లు కనీస స్థాయి ప్రదర్శన ఇవ్వకపోవడం కూడా అతనికి మేలు చేసింది. చివరకు రచిన్ రవీంద్ర పట్టిన క్యాచ్‌తో చిరస్మరణీయ ఘట్టం ఆవిష్కృతమైంది. అయితే దురదృష్టవశాత్తూ గత రెండు సందర్భాలకు భిన్నంగా ఇంత గొప్ప ఆట తర్వాత కూడా ఎజాజ్ ఓటమి పక్షానే నిలవాల్సి వస్తుందేమో! నా క్రికెట్ కెరీర్లో ఇదే అత్యుత్తమ రోజు. ఇక ముందు కూడా ఇదే ఉంటుందేమో. అన్నీ కలిసి రావడంతోనే నేను ముంబైలో ఈ ఘనత సాధించగలిగాను. ఎంతో ఆశ్చర్యంగా అనిపిస్తోంది. నాకు, నా కుటుంబానికి ఇదో ప్రత్యేక క్షణం. ఇంకా నేను ఆనందం నుంచి తేరుకోలేకపోయాను. ఇలాంటి ఘనతకు అందించిన దేవుడికి కృతజ్ఞతలు. ‘10’ వికెట్ల క్లబ్లో చేరడం గర్వకారణం. కుంబ్లే ఘనత నాకు బాగా గుర్తుంది. ఎన్నోసార్లు ఆ వీడియో చూశా. ఇలాంటి క్షణాలు కెరీర్లో ఎప్పుడో గానీ రావు కాబట్టి చివరి వికెట్‌కు ముందు చాలా ఒత్తిడిలో ఉన్నా. ఆఖరి వికెట్ సమయంలో బంతి గాల్లోకి లేచినప్పుడు అందరం ఎంతో ఉత్కంఠ అనుభవించాం. పదో వికెట్ కోసం ఇతర బౌలర్లు వైడ్ బంతులు వేయాలనే చర్చే మాలో జరగలేదు. తొమ్మిది వికెట్లతో కూడా నేను సంతృప్తి చెందేవాడిని. –ఎజాజ్ పటేల్ 10 వికెట్ల క్లబ్‌లోకి ఎజాజ్‌కు స్వాగతం. పర్ఫెక్ట్10. చాలా బాగా బౌలింగ్ చేశావు. టెస్టు తొలి, రెండో రోజు ఇలాంటి ఘనత సాధించడం ఎంతో ప్రత్యేకం. –అనిల్ కుంబ్లే , భారత మాజీ కెప్టెన్ మొత్తం టీమ్‌ను మన జేబులో వేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. నిజంగా ఇదో అసాధారణ ప్రదర్శన. –రవిశాస్త్రి, భారత మాజీ హెడ్ కోచ్ టెస్టుల్లో ఒకే ఇన్నింగ్స్‌లో 10కి 10 వికెట్లు తీసిన మూడో బౌలర్ ఎజాజ్ పటేల్. గతంలో ఇంగ్లండ్ ఆఫ్ స్పిన్నర్ జిమ్ లేకర్ (1956 జూలైలో ఆస్ట్రేలియాపై మాంచెస్టర్‌లో 10/53)... భారత లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే (1999 ఫిబ్రవరిలో పాకిస్తాన్‌పై ఢిల్లీలో; 10/74) మాత్రమే ఈ ఘనత సాధించారు. న్యూజిలాండ్ తరఫున అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన కూడా ఇదే. రిచర్డ్ హ్యాడ్లీ (9/52) రికార్డును ఎజాజ్ బద్దలుకొట్టాడు. -
వికెట్ కీపర్‌గా మొదలెట్టాడు.. మిస్టరీ స్పిన్నర్లా రాణిస్తున్నాడు
న్యూఢిల్లీ: ఐపీఎల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున దుమ్మురేపిన 29 ఏళ్ల వరుణ్ చక్రవర్తి.. మిస్టరీ స్పిన్నర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. కాగా, అతని బౌలింగ్‌లో ఉన్న మిస్టరీ.. అతని జీవన ప్రయాణంలోనూ కొనసాగుతుంది. వికెట్ కీపర్‌గా క్రికెట్ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన వరుణ్.. ప్రస్తుతం వైవిధ్యమైన బౌలర్‌గా రాణిస్తున్నాడు. 13 ఏళ్ల వయసులో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా కెరీర్ ప్రారంభించిన అతను 17 ఏళ్ల వరకు అలానే కొనసాగాడు. అయితే వికెట్ కీపర్‌గా పెద్దగా రాణించకపోవడంతో క్రికెట్‌ను పక్కనపెట్టేసి చదువుపై దృష్టిసారించాడు. ఎస్ఆర్ఎమ్ యూనివర్సిటీలో అర్కిటెక్చర్ పూర్తి చేశాడు. ఆ తర్వాత ఫ్రిలాన్స్ ఆర్కిటెక్ట్‌గా పనిచేశాడు. కానీ ఆ పని కిక్ ఇవ్వకపోవడంతో మళ్లీ 23 ఏళ్ల వయసులో టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. అయితే ఈసారి వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా కాకుండా మీడియం పేసర్ అవతారమెత్తాడు. టెన్నిస్ బాల్ క్రికెట్లో అద్భుతంగా రాణించాడు. కానీ మొకాలి గాయం కావడంతో పేస్ బౌలింగ్‌ను వదిలేసి స్పిన్నర్‌గా అవతారమెత్తాడు. టెన్నిస్ బాల్ క్రికెట్లో స్పిన్నర్స్‌ను బాగా కొడతారని భావించిన ఈ తమిళనాడు కుర్రాడు.. తన స్పిన్‌కు పేస్‌ను జోడించి విభిన్నమైన వేరియేషన్స్‌లో బౌలింగ్ చేశాడు. లెగ్ స్పిన్, ఆఫ్ స్పిన్, గూగ్లీ, ఫ్లిప్పర్, టాప్ స్పిన్, క్యారమ్ బాల్స్, ఆర్మ్ బాల్స్ ఇలా మొత్తం ఏడు రకాల వేరియేషన్స్ తో బౌలింగ్ చేసేవాడు. ఒకే ఓవర్లో లెగ్ స్పిన్, ఆఫ్ స్పిన్, గూగ్లీ వంటి విభిన్నమై వేరియేషన్స్‌తో బంతులు వేయడం, దానికి పేస్ జోడించడంతో బ్యాట్స్‌మెన్ తెగ ఇబ్బంది పడేవారు. అనంతరం 2017లో సీఎస్కే నెట్ బౌలర్‌గా అవకాశం దక్కించుకున్న వరుణ్.. మాజీ కేకేఆర్ కెప్టెన్ దినేశ్ కార్తీక్ దృష్టిని ఆకర్శించాడు. డీకే పట్టుపట్టి మరీ వరుణ్‌ను కేకేఆర్ నెట్ బౌలర్‌గా ఎంపిక చేయించాడు. అక్కడ సునీల్ నరైన్ సాయంతో మెళకువలు నేర్చుకున్న వరుణ్.. మిస్టరీ స్పిన్నర్లా మారాడు. దీంతో 2019 ఐపీఎల్ వేలంలో కింగ్స్ పంజాబ్ జట్టు వరుణ్‌ను రూ.8.4 కోట్లకు కొనుగోలు చేసింది. అనంతరం 2020 సీజన్లో కేకేఆర్ మేనేజ్మెంట్ వరుణ్‌ను రూ.4 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ సీజన్లో 13 మ్యాచ్‌లు ఆడిన అతను 17 వికెట్లు తీశాడు. తాజా సీజన్లోనూ అద్భుతంగా రాణించిన వరుణ్.. 7 మ్యాచ్‌ల్లో 7 వికెట్లు తీశాడు. కాగా, ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న భారత జట్టులో సభ్యుడిగా ఉన్న వరుణ్.. గతేడాదే టీమిండియా పిలుపు అందుకున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేసిన టీ20 జట్టులో అతనికి చోటు దక్కింది. కానీ భుజ గాయం కారణంగా ఆ అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారింది. ఆ తర్వాత స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌లోనూ అవకాశం దక్కింది. అది కూడా యోయో ఫిట్నెస్ టెస్ట్ అధిగమించకపోవడంతో చేజారింది. -
‘అయ్యో.. ధోనిని ఏమనలేదు’
న్యూఢిల్లీ: మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి వ్యతిరేకంగా తాను మాట్లాడినట్టు మీడియాలో వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తెలిపాడు. తన మాటలను మీడియా వక్రీకరించిందని అన్నాడు. (చదవండి: ఔను! ధోనీ టిప్స్ చాలాసార్లు పనిచేయలేదు!) ‘ఎటువంటి కారణం లేకుండానే మీడియా నన్ను వివాదంలోకి లాగింది. ధోనికి వ్యతిరేకంగా నేను కామెంట్ చేసినట్టుగా వచ్చిన వార్తలు అవాస్తవం. నేను ఎవరి మీద అనవసర వ్యాఖ్యలు చేయలేదు. మహి భాయ్ అంటే నాకు గౌరవముంద’ని ఇన్‌స్టామ్‌లో కుల్దీప్ యాదవ్ వివరణయిచ్చాడు. ధోని ఇచ్చిన సలహాలు చాలా సార్లు పనిచేయలేదని కుల్దీప్ అన్నట్టుగా మీడియాలో వార్తలు వచ్చిన నేపథ్యంలో అతడు ఈ మేరకు స్పందించాడు. ‘ఆట మధ్యలో ధోని ఎక్కువగా మాట్లాడడు. అవసరం ఉందనుకుంటేనే ఓవర్స్ గ్యాప్‌లో మాట్లాడతాడ’ని కుల్దీప్ వెల్లడించాడు. ఎంఎస్ ధోని కెప్టెన్సీలో టీమిండియా 2007లో టీ20 వరల్డ్‌కప్, 2011లో వన్డే ప్రపంచకప్ గెలిచింది. 2014లో టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. వన్డే, టీ20 కెప్టెన్సీని 2017లో వదులుకున్నాడు. 37 ఏళ్ల ధోని ఇప్పుడు విరాట్ కోహ్లి కెప్టెన్సీలో తాజా వన్డే వరల్డ్‌కప్ ఆడనున్నాడు. తాజాగా ముగిసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు నాయకుడిగా ధోని వ్యవహరించాడు. -
కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్!
కొలంబో: శ్రీలంక, ఇంగ్లండ్ జట్ల మధ్య శనివారం జరిగిన ఏకైక టి20 మ్యాచ్‌లో క్రికెట్ ప్రపంచం ఆశ్చర్యంతో చూసిన ఒక ఘటన జరిగింది. ఇదే మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన శ్రీలంక స్పిన్నర్ పీహెచ్డీ కామిందు మెండిస్ రెండు చేతులతో బౌలింగ్ చేసి ఆకట్టుకున్నాడు. కుడిచేతి వాటం ఆటగాడికి లెఫ్టార్మ్ స్పిన్ వేసిన అతను, ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్‌కు ఆఫ్ స్పిన్ బంతులు విసిరాడు. అతను లెఫ్టార్మ్‌తో వేసిన తొలి బంతికి జేసన్ రాయ్ సింగిల్ తీశాడు. వెంటనే మెండిస్ తన బౌలింగ్‌ను మారుస్తున్నట్లు అంపైర్‌కు చెప్పాడు. ఈసారి అతని రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ బంతిని స్టోక్స్ ఎదుర్కొన్నాడు. మూడు ఓవర్లలో కామిందు వరుసగా 3, 15, 9 పరుగులు ఇచ్చాడు. అతని మూడో ఓవర్లో ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్లే ఉండటంతో మెండిస్‌కు బౌలింగ్ మార్చాల్సిన అవసరం లేకపోయింది. అంతర్జాతీయ సీనియర్ స్థాయి క్రికెట్లో ఒక బౌలర్ ఇలా రెండు చేతులతో బౌలింగ్ చేయడం ఇదే మొదటిసారి. దేశవాళీ క్రికెట్లో అక్షయ్ కర్నేవర్ (భారత్), జెమా బార్స్బై (ఆస్ట్రేలియా)లాంటి కొందరు ఉన్నా జాతీయ జట్టు తరఫున ఇలాంటి బౌలింగ్ శైలి (ఆంబిడెక్స్ట్రస్) ఎవరికీ లేదు. గతంలో హనీఫ్ మొహమ్మద్, గ్రాహం గూచ్, హసన్ తిలకరత్నే ఇలాంటి ఫీట్‌ను ప్రదర్శించినా అదంతా సరదాకు మాత్రమే! సీరియస్‌గా బౌలింగ్ చేసే ఒక రెగ్యులర్ బౌలర్‌కు ఇలా రెండు చేతులతో బంతులు వేయగల సత్తా ఉండటం మాత్రం కచ్చితంగా విశేషమే. బ్యాట్స్‌మెన్‌కు అనుగుణంగా ఒకే ఓవర్లో బౌలింగ్ మార్చుకోగలడం జట్టుకు అదనపు బలం కూడా కాగలదు. శ్రీలంక అండర్–19 జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించిన 20 ఏళ్ల కామిందు మెండిస్ బ్యాటింగ్‌లో మాత్రమే ఎడంచేతి వాటమే. Kamindu Mendis, Sri Lanka's captain during January's U19 @CricketWorldCup, has been called up to his country's T20I squad for the first time. Here's a clip of him in action - and no, that's not a mirror, he really does bowl both right-arm and left-arm spin! pic.twitter.com/rhjJP4wku1 — ICC (@ICC) 23 October 2018 -
రషీద్ ఖాన్ అన్నయ్య సైతం..
అఫ్గానిస్తాన్ యువ సంచలన రషీద్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల కాలంలో తనదైన శైలిలో చెలరేగిపోతూ ‘టాప్’ బ్యాట్స్‌మెన్‌కి కొరకరాని కొయ్యగా మారిన రషీద్ ఖాన్.. దిగ్గజాల ప్రశంసలు అందుకుంటున్నాడు. మరొకవైపు టీ 20 ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ ర్యాంకులో కొనసాగుతున్నాడు. ఇదిలా ఉంచితే, తన పెద్ద అన్నయ్య అమీర్ ఖాన్ కూడా స్పిన్నరనే విషయాన్ని రషీద్ ఖాన్ అభిమానులకు తెలియజేశాడు. ఈ మేరకు సోదరుడు అమీర్ స్పిన్ బౌలింగ్ వేస్తున్న వీడియోను రషీద్ తన ట్వీటర్ అకౌంట్లో షేర్ చేశాడు. ‘నేను సోదరులతో కలిసి క్రికెట్‌ను ఆరంభించా. ఇందులో నా పెద్ద అన్నయ్య అమీర్‌కు బంతిని టర్న్ చేసే నైపుణ్యం కూడా ఉంది’ అనే క్యాప్షన్ ఇచ్చిన రషీద్.. ఫ్యామిలీ లెగ్స్పిన్నర్స్ హ్యాష్ ట్యాగ్‌తో వీడియో పోస్ట్ చేశాడు. -
రషీద్ ఖాన్ అన్నయ్య సైతం స్పిన్నరే
-
‘స్పిన్’ ఖాన్...
నిత్యం బాంబు పేలుళ్ల మోత... నలుదిక్కుల నుంచి పొంచి ఉన్న ముప్పు... తెలతెలవారుతూనే తుపాకి కాల్పుల గర్జన... క్షణక్షణం భయం గుప్పిట జీవనం... ఆటల కంటే ఆధిపత్య కొట్లాటలే ఎక్కువ... మనిషి ప్రాణం సుడిగాల్లో దీపం... ఇలాంటిచోట క్రీడలనే మాటకు చోటుంటుందా...? ఆ ప్రతిభ అంతర్జాతీయ స్థాయికెదుగుతుందా? ఎందుకంత అనుమానం? ఇతడే దానికి సమాధానం... ఆ మొనగాడే అఫ్గానిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ రషీద్ ఖాన్. సాక్షి క్రీడా విభాగం: అఫ్గానిస్తాన్...! ప్రపంచ పటంలోనే కల్లోలిత దేశం. పర్వతాలు, కొండలతో కూడిన ఈ దేశాన్ని ఉగ్రవాదం నిలువునా దహించి వేసింది. అలాంటిచోట క్రికెట్ ఆడటమే గొప్పనుకుంటే... ఏకంగా జట్టే పుట్టుకొచ్చింది. గింగిరాల గూగ్లీలు, సర్రున దూసుకొచ్చే ఫ్లైటెడ్ డెలివరీలు, రెప్పపాటులో వికెట్‌ను గిరాటేసే టర్న్ బంతులు సంధించేవారు లేక ఒకనాటి కలగా మారుతున్న కళాత్మక లెగ్ స్పిన్‌కు ప్రాణం పోసే రషీద్ ఖాన్ వంటి స్పిన్ ఆణిముత్యాన్ని అందించింది. లీగ్ ఏదైనా, టోర్నీ ఎక్కడైనా, ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ ఎంత మొనగాడైనా తన మాయాజాలం ముందు దిగదుడుపే. దాదాపు మూడేళ్లుగా ఆడుతున్నా అతడింకా ‘మిస్టరీ’ స్పిన్నర్‌గానే ఉన్నాడంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి టి20 ఫార్మాట్ వచ్చాక ‘ఒంటి చేత్తో’ గెలిపించడం అనే పదం వాడకం తగ్గింది. రషీద్ విషయంలో మాత్రం దానిని వర్తింపజేయొచ్చు. ప్రస్తుత ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓడిన రెండు మ్యాచ్‌ల్లోనూ రషీద్ బౌలింగ్‌లో గేల్, రైనా భారీగా పరుగులు సాధిం చారు. చివరకు అవే ఫలితాన్ని మార్చాయి. దీన్నిబట్టే చెప్పొచ్చు తన బౌలింగ్ ప్రభావం ఎంతో! ఆరుగురు స్పిన్ అన్నదమ్ముల్లో... అఫ్గాన్‌లో ఇంత క్రికెట్ ప్రతిభ ఉందా? అని అందరూ ఆశ్చర్యపోయేలా చేస్తున్న రషీద్ నేపథ్యం కూడా అంతే ఆసక్తికరం. అతడి ఆరుగురు అన్నదమ్ములూ లెగ్ స్పిన్నర్లే. వారి నుంచి అబ్బిన ఆటకు వేగమనే సహజ నైపుణ్యం తోడవడం, కోచ్‌లెవరూ అతడి శైలిని మార్చడానికి ప్రయత్నించకుండా మరింత విశ్వాసం నింపడంతో ఇక తిరుగులేకపోయింది. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అఫ్గాన్ అండర్–19 కోచ్ దౌలత్ అహ్మద్జాయ్ గురించి. అతడు రషీద్‌ను వెన్నుతట్టి, మంచి భవిష్యత్ ఉంటుందని ప్రోత్సహించాడు. బంతిని ఎలా వదలాలి? ఎలా పట్టుకోవాలి? శైలి ఎలా ఉండాలి? వంటి ప్రాథమిక అంశాలను రషీద్ ఎవరి దగ్గరా నేర్చుకోకపోవడం విశేషం. అన్నీ స్వతహాగా వచ్చేశాయంతే! ఒకరిద్దరు తప్ప ప్రపంచ వ్యాప్తంగా బ్యాట్స్‌మెన్ ఇప్పటికీ అతడి స్పిన్ ‘మిస్టరీ’ని ఛేదించలేక సతమత మవుతుంటే తన దగ్గర మరిన్ని అస్త్రాలు ఉన్నాయంటున్నాడు రషీద్. చాలా విషయాలు సొంతంగానే నేర్చుకునే ఈ అఫ్గానీ... నెట్స్‌లో సాధన చేసిన చాలా రహస్య బంతులను ఇంకా మ్యాచ్‌ల్లో వేయలేదని చెబుతుండటం గమనార్హం. ఇతడి శైలిని చూసిన శ్రీలంక మాజీ స్పిన్ దిగ్గజం, సన్‌రైజర్స్ బౌలింగ్ కోచ్ ముత్తయ్య మురళీధరన్ అంతా పక్కాగా ఉందని కితాబివ్వడం రషీద్‌కు దక్కిన గౌరవం. ఇదే సందర్భంలో ‘బంతిని ఎక్కడ వేయాలనుకుంటున్నావో ఆ ప్రదేశాన్నే లక్ష్యం చేసుకో’ అంటూ మురళీ సూచించిన ‘స్పాట్ బౌలింగ్’ టెక్నిక్ అతనికి మరింత ఉపయుక్తంగా మారింది. తప్పుల నుంచి నేర్చుకుంటూ... బాడీ లాంగ్వేజ్ చూస్తే రషీద్ ఎవరి మాట వినడు తరహాలో కనిపిస్తాడు. కానీ అతడు తప్పుల నుంచి త్వరగా నేర్చుకునే స్వభావి. ‘కొన్నిసార్లు పిచ్‌లు సహా ఏదీ కలిసిరాదు. బ్యాట్స్‌మెన్ మంచి బంతులనూ బాదేస్తారు. అలాంటి అనుభవాన్నీ సానుకూలంగా తీసుకుంటా. ఆ తప్పులు మళ్లీ చేయకుండా చూసుకుంటా’ అనే తన మాటలే దీనికి నిదర్శనం. ప్రస్తుత లీగ్‌లో ఎడంచేతి వాటం బ్యాట్స్‌మెన్ గేల్, రైనా తన బౌలింగ్‌ను చదివేశారని అనుమానం రాగానే వెంటనే వీడియో విశ్లేషణ చేసుకున్నాడు. కోచ్‌లతో మాట్లాడాడు. ఫుల్ లెంగ్త్ బంతులను ఎక్కువగా వేయడం, బ్యాట్స్‌మెన్ వాటిని చక్కగా కనెక్ట్ చేసుకోవడం తప్ప ఏ పొరపాటూ లేదని తేలాక కాని తను ఊరట పొందలేదు. ఈ తప్పులను మరుసటి మ్యాచ్‌కే సరిదిద్దుకుని ఎప్పటిలానే రాణించడం రషీద్ ఎలాంటివాడో చెబుతోంది. ఏ స్థితిలోనైనా సిద్ధమే... అనిల్ కుంబ్లే, షాహిద్ ఆఫిద్రి శైలిలో బంతిని వేగంగా వేసే రషీద్... ఎక్కడ ఆడుతున్నామనేదానిపై కాకుండా లెంగ్త్‌పై మాత్రమే దృష్టి పెడతాడు. మ్యాచ్‌లో ఎన్ని మంచి బంతులేశాం? ఎన్ని చెడ్డ బంతులేశాం? అని లెక్కేసుకుంటాడు. కోచ్‌లతో పాటు బ్యాట్స్మెన్నూ ఈ విషయమై సంప్రదిస్తాడు. ఎవరికి ఎలాంటి బంతులేయాలనే సలహాల కోసం విలియమ్సన్, ధావన్, యూసుఫ్ పఠాన్, మనీశ్ పాండే వంటి సీనియర్లతో చర్చిస్తాడు. వాటిని పాటిస్తూ ఫలితాన్ని ఆస్వాదిస్తుంటాడు. ‘మ్యాచ్ ప్రారంభ ఓవర్లైనా సరే, చివరి ఓవర్లైనా సరే బౌలింగ్ చేసేందుకు సిద్ధమే. జట్టుకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు బంతినివ్వండి’ అనే రషీద్ ఆత్మవిశ్వాసం ఏ కెప్టెన్‌కైనా వరమే. ముందున్న సవాళ్లను దాటితే... టి20ల్లో కొరకరాని కొయ్యగా మారడం, వన్డేల్లో వేగంగా 100 వికెట్లు తీసిన బౌలర్ కావడం రషీద్‌ను ప్రత్యేకంగా చూపుతున్నా, రాబోయే కాలం అతడి ప్రతిభకు నిజమైన పరీక్షే. వచ్చే నెలలో అఫ్గాన్ జట్టు భారత్‌తో టెస్టు అరంగేట్రం చేయనుంది. ఇక నుంచి ఐదు రోజుల సమరంలో అతడెంతవరకు నిలుస్తాడో చూడాలి. ఇక 2019 ప్రపంచకప్ మరో పెద్ద సవాల్. ఈలోగా అఫ్గాన్ జట్టు కొన్ని వన్డేలైనా ఆడుతుంది. అంటే మిస్టరీ స్పిన్నర్‌కు అసలు సిసలు ఆట ఎదురుకాబోతోంది. చూద్దాం... మరి ఇంకెంత కాలం తన జోరు సాగుతుందో? ఏ బ్యాట్స్‌మన్ దానికి అడ్డుకట్ట వేస్తాడో? బ్యాట్స్‌మన్ ఏం చేస్తాడన్నది మర్చిపో. మానసికంగా దృఢంగా ఉండటం ఎప్పుడూ మేలు చేస్తుంది. సామర్థ్యాన్ని నమ్ముకో అని మురళీధరన్ పదేపదే చెబుతారు. మిగతా ఇద్దరు కోచ్‌లు మూడీ, లక్ష్మణ్ కూడా వైఫల్యాలకు బెదరొద్దంటారు. కొద్దిగా షార్ట్ బంతులు వేయమని వారిచ్చిన సలహా నా విజయానికి కారణం. కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్‌కు బౌలింగ్ చేయడం ఇష్టమైనా, మ్యాచ్‌లోకి వచ్చేసరికి కుడి, ఎడమా అనేది చూడను. నేను సరైన ప్రదేశంలో బంతిని వేశానంటే ఏ బ్యాట్స్‌మనూ పరుగులు చేయలేడు. మొదటి నుంచి వేగం అలవాటైంది. ఐపీఎల్ వల్లే నేనిక్కడున్నా. ఈ అనుభవం భవిష్యత్‌లో ఉపయోగపడుతుంది. సరైన ప్రదేశంలో బంతులేయడంపైనే దృష్టిపెడతా. మిగతా పని అదే చూసుకుంటుంది. –రషీద్ ఖాన్ -
నాసామిరంగా... పైన కూడానా!
‘దువ్వాడ జగన్నాథం’ సినిమా ఆడియో ఫంక్షన్లో ఆ సినిమా హీరో అల్లూ అర్జున్ చేతిలో ఫిడ్జెట్ను తిప్పుతూ కూర్చున్నారు. వెంటనే.. ‘బన్నీ చేతిలో ఉన్న ఆ వింత వస్తువు ఏంటీ?’ అని సోషల్ మీడియాలో ప్రశ్నలు మొదలయ్యాయి. ఇప్పుడది వింత వస్తువు కాదు. ప్రతి కుర్రాడి చేతిలో, ప్రతి పిల్లాడి చేతిలో కనిపిస్తూ ఉంది! దీనిని ‘ఫిడ్జెట్ స్పిన్నర్’ అంటారు. వేళ్ల మధ్య ఉంచుకుని తిప్పుతూ కూర్చుంటే స్ట్రెస్ తగ్గుతుందట. ఇప్పుడిది అంతరిక్ష కేంద్రంలోకి కూడా వెళ్లిపోయింది! అక్కడి నాసా సైటిసుల్టు కొందరు ఫిడ్జెట్ను తిప్పుతుంటే.. వారిలో ఒకరి ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది నాసా. అదిప్పుడు వైరల్ అవుతోంది. ఇప్పటివరకు 45 వేల మంది ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను చూశారు. ట్విట్టర్లో 20 వేల సార్లు రీట్వీట్ అయింది. పిల్లలు ఎక్కువగా చూస్తున్నారట. భూమి మీద అయితే ఇది భలే తిరుగుతుంది. మరి భూమ్యాకర్షణ లేని చోట! ఇంకా భలే తిరిగింది. మీరే చూడండి. -
టాప్ స్పిన్నర్‌కు పీడకలగా ఐపీఎల్!
రవిచంద్రన్ అశ్విన్ టీమిండియా టాప్ స్పిన్నర్. ఆస్ట్రేలియా పర్యటన మొదలుకొని.. స్వదేశంలో శ్రీలంకతో టీ-20 సిరీస్, బంగ్లాదేశ్‌లో ఆసియా కప్, ఐసీసీ టీ20 వరల్డ్ కప్.. ఇలా ప్రధాన సిరీస్‌లన్నింటిలోనూ బాగానే రాణించిన అశ్విన్‌కు ప్రస్తుత ఐపీఎల్ మాత్రం పీడకలగా మారింది. 2009 నుంచి 2015 వరకు చెన్నై సూపర్ కింగ్స్‌కు నమ్మకమైన స్పిన్నర్‌గా ఉన్న అశ్విన్ తాజాగా కొత్త జట్టు రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ తరఫున బరిలోకి దిగాడు. కొత్త జట్టుతో ఆడుతున్న అశ్విన్‌కు ఏమాత్రం కలిసిరాకపోగా.. ప్రస్తుత ఐపీఎల్లో తొలిసారి ఈ టాప్ స్పిన్నర్ చెత్త ప్రదర్శన నమోదు చేశాడు. 11 మ్యాచ్‌లు ఆడి కేవలం నాలుగంటే నాలుగు వికెట్లే పడగొట్టాడు. దీంతో అశ్విన్‌పై నమ్మకం పెట్టుకొని.. అతనికి బంతిని ఇస్తున్న పుణె కెప్టెన్ ఎంఎస్ ధోనీ తీరుపైనా విమర్శలు చెలరేగుతున్నాయి. మరోవైపు అశ్విన్ ఈ ఐపీఎల్ అదృష్టం కూడా కలిసిరావడం లేదనే టాక్ వినిపిస్తోంది. ఈ ఏడాది ఆరంభం నుంచి వరుస టోర్నమెంట్లు ఆడుస్తూ వస్తుండటం క్రికెటర్లపై భారం మోపుతున్నదని, ఆ ప్రభావం అశ్విన్ పై ఉండొచ్చునని పరిశీలకులు అంటున్నారు. దీనికితోడు భారత్ లోని మైదానాలు చిన్నవి కావడం.. వాటిలో సగం షాట్ కొట్టినా బంతి బౌండరికి వెళుతుండటంతో ఈ ఐపీఎల్ స్పిన్నర్లకు చేదు అనుభవాన్ని మిగిలిస్తున్నదని వారు విశ్లేషిస్తున్నారు. చెన్నైకి సింహం.. పుణెకి ఉడత! ఐపీఎల్లో అశ్విన్ గత ప్రదర్శన చూస్తే ఇదే అనిపిస్తుంది. ఐపీఎల్లో ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్ తరఫున 97 మ్యాచ్‌లు ఆడిన అశ్విన్ 90 వికెట్లు పడగొట్టాడు. చెన్నై జట్టు రద్దయి.. కొత్తగా వచ్చిన పుణె జట్టుతో చేరిన అశ్విన్ పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. టాప్ స్పిన్నర్ నుంచి ఒక ఆర్డినరీ బౌలర్‌గా కూడా అతన్ని పరిగణనలోకి తీసుకొని పరిస్థితి తలెత్తింది. దీనికితోడు ఇటీవల హైదరాబాద్ సన్‌రైజర్స్ తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ అశ్విన్ కోటా నాలుగు ఓవర్లు పూర్తిగా వేసేందుకు అనుమతించలేదు. ఇప్పటివరకు నాలుగు వికెట్లు మాత్రమే తీసిన సీనియర్ స్పిన్నర్ అశ్విన్‌కు ఇది అవమానం లాంటిందే. అశ్విన్ ఏమంటున్నాడు! 'ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇతర దేశాల మైదానాలతో పోలిస్తే భారత్‌లోని మైదానాలు క్వార్టర్ (25శాతం) మాత్రమే ఉంటాయి. దీంతో మాములు షాట్ కొట్టినా బంతి బౌండరీ ఫెన్సింగ్ ను ఈజీగా దాటిపోతుందని బ్యాట్స్‌మెన్ భావిస్తారు. దీంతో ఐపీఎల్లో బౌలింగ్ చేయడం స్పిన్నర్లకు చాలా రిస్కీగా మారిపోయింది' అని అశ్విన్ ఈఎస్‌పీఎన్‌క్రిక్ ఇన్ఫోతో అభిప్రాయపడ్డాడు. మిగతా స్పిన్నర్ల పరిస్థితి ఏంటి? అశ్విన్ ఒకవైపు చిక్కులు ఎదుర్కొంటుండగా.. అతని సమకాలీకుడైన అమిత్ మిశ్రా పర్వాలేదనిపిస్తున్నాడు. ప్రస్తుత ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు తీసుకున్న టాప్-10 బౌలర్ల జాబితాలో మిశ్రా చోటు సాధించాడు. హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టు తరఫున రెండో మ్యాచ్ ఆడిన యాడం జంపా 19 పరుగులకే రెండు వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు. ఈ ఇద్దరు మినహాయిస్తే మిగతా స్పిన్నర్ల పరిస్థితి అశ్విన్ లాగా కనిపిస్తోంది. -
కౌశల్ బౌలింగ్ సందేహాస్పదం!
కొలంబో: భారత్‌తో జరిగిన మూడో టెస్టులో శ్రీలంక ఆఫ్ స్పిన్నర్ తరిందు కౌశల్ బౌలింగ్ శైలి సందేహాస్పదంగా ఉందని మ్యాచ్ అధికారులు గుర్తించారు. ఈ మేరకు దీనికి సంబంధించిన నివేదికను లంక మేనేజ్మెంట్కు అందజేశారని ఐసీసీ ఓ ప్రకటనలో పేర్కొంది. ‘కౌశల్ బౌలింగ్ శైలిని పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఐసీసీ నిబంధనలకు లోబడి అతను బౌలింగ్ చేయడం లేదు. కాబట్టి 14 రోజుల్లో అతని శైలిని సరి చేసుకోవాలి. అయితే పరీక్ష ఫలితాలు వచ్చే వరకు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో బౌలింగ్ చేయొచ్చు’ అని ఐసీసీ పేర్కొంది. బౌలింగ్ శైలిని సరిదిద్దుకోవడానికి కౌశల్ త్వరలోనే చెన్నైకి రానున్నాడు. -
మూడో స్పిన్నర్ ఎవరు?
పోటీలో ముగ్గురు బౌలర్లు శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు భారత జట్టు ప్రకటన నేడు న్యూఢిల్లీ: శ్రీలంకతో జరిగే మూడు టెస్టుల సిరీస్ కోసం భారత జట్టును గురువారం (నేడు) ఎంపిక చేయనున్నారు. సందీప్ పాటిల్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఇందుకోసం ఇక్కడ సమావేశమవుతోంది. బంగ్లాదేశ్‌తో ఫలితం తేలని ఏకైక టెస్టులో ఉన్న జట్టులో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. అయితే శ్రీలంకతో సిరీస్ కాబట్టి మూడో స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా ఎవరిని ఎంపిక చేస్తారనేదే కాస్త ఆసక్తికరంగా మారింది. ఈ స్థానం కోసం ప్రధానంగా ముగ్గురి మధ్య పోటీ నెలకొంది. రేసులో కరణ్, మిశ్రా! శ్రీలంకతో సిరీస్‌కు ప్రధాన స్పిన్నర్లుగా అశ్విన్, హర్భజన్ ఉండటం ఖాయమే. వైవిధ్యం కోసం లెగ్ స్పిన్నర్ లేదా లెఫ్టార్మ్ స్పిన్నర్‌ను అదనంగా తీసుకునే అవకాశం ఉంది. బంగ్లాతో సిరీస్‌లో జట్టులో ఉన్నా మ్యాచ్ ఆడని కరణ్ శర్మ గాయంనుంచి కోలుకున్నాడు కాబట్టి అతని ఎంపికకే అవకాశాలెక్కువ. అయితే వెటరన్ అమిత్ మిశ్రా పేరును కూడా సెలక్టర్లు పరిశీలిస్తున్నారు. లెఫ్టార్మ్ స్పిన్నర్ స్థానం కోసం అక్షర్ పటేల్ లేదా ప్రజ్ఞాన్ ఓజాలలో ఒకరికి అవకాశం దక్కవచ్చు. పటేల్ ఇటీవల వన్డేల్లో తన ప్రతిభను నిరూపించుకున్నాడు. జట్టులో స్థానం కోల్పోయిన అనంతరం యాక్షన్ మార్చుకున్న ఓజా పునరాగమనం చేసే స్థాయిలో అద్భుత ప్రదర్శన ఏమీ ఇవ్వలేదు. శ్రీలంక వికెట్ల స్వభావం దృష్ట్యా తుది జట్టులో ముగ్గురు స్పిన్నర్లు అవసరమనే ఆలోచన చేస్తే... ఒక పేసర్‌ను తగ్గించి నలుగురు స్పిన్నర్లను లంకకు తీసుకెళ్లొచ్చు. అలాంటి పరిస్థితి వస్తే మిశ్రా, అక్షర్ ఇద్దరూ జట్టులోకి రావచ్చు. ఇక వన్డే జట్టులోనూ చోటు కోల్పోయిన జడేజాకు ఇప్పట్లో చాన్స్ దక్కకపోవచ్చు. బంగ్లాదేశ్ సిరీస్‌కు జట్టును ఎంపిక చేసిన అనంతరం గాయంతో తప్పుకున్న లోకేశ్ రాహుల్ ఇప్పుడు సిద్ధంగా ఉన్నాడు. మరో వైపు 15 మంది సభ్యుల జట్టును ఎంపిక చేస్తే ప్రధాన కీపర్‌గా సాహా ఉంటాడు. అదనంగా మరో ఆటగాడిని ఎంపిక చేయాలని సెలక్టర్లు భావిస్తే రిజర్వ్ కీపర్‌గా నమన్ ఓజాకు చాన్స్ దక్కవచ్చు. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఆగస్ట్ 12న గాలేలో తొలి టెస్టు ప్రారంభమవుతుంది.