వహ్వా అజాజ్‌! ఏమా బౌలింగ్‌.. ధనాధన్‌గా ‘టెన్‌’ రికార్డు | New Zealand spinner Ajaz Patel takes all 10 wickets in Test against India | Sakshi
Sakshi News home page

IND Vs NZ: వహ్వా అజాజ్‌! ఏమా బౌలింగ్‌.. ధనాధన్‌గా ‘టెన్‌’ రికార్డు

Published Sun, Dec 5 2021 5:10 AM | Last Updated on Sun, Dec 5 2021 7:25 AM

New Zealand spinner Ajaz Patel takes all 10 wickets in Test against India - Sakshi

ఒకటి, రెండు, మూడు, నాలుగు... భారత ఆటగాళ్లు పెవిలియన్‌ చేరుతున్నారు... న్యూజిలాండ్‌ లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ ఎజాజ్‌ పటేల్‌ వికెట్ల లెక్క కూడా మారుతోంది... తొలి రోజు ఆట ముగిసేసరికి పడిన నాలుగు వికెట్లూ అతని ఖాతాలోనే... ఎజాజ్‌ సంబరపడ్డాడు. తాను పుట్టిన ఊర్లో ఒక గుర్తుంచుకునే ప్రదర్శన వచ్చినందుకు అందరి ముందు సంతోషాన్ని ప్రదర్శించాడు. శనివారం ఉదయం సాహా అవుట్‌ కాగానే ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ఘనత... ఇదీ చెప్పుకోదగ్గ విశేషమే! తర్వాతి బంతికే ఆరో వికెట్‌. కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శన కూడా వచ్చేసింది. టెస్టుల్లో భారత జట్టు తొలి ఆరు వికెట్లు ఒక స్పిన్నర్‌కు కోల్పోవడం ఇదే తొలిసారి.

అయినా సరే అద్భుతం జరగవచ్చని ఎవరూ ఊహించడం లేదు. ‘ఆ ఘనత’ సాధ్యమా అనే చర్చ కూడా వినిపించలేదు. దాదాపు 28 ఓవర్ల పాటు మరో వికెట్‌ పడకపోవడంతో ఎజాజ్‌ బౌలింగ్‌పై విశ్లేషణ కూడా దాదాపుగా ఆగిపోయింది. కానీ ఎజాజ్‌ మాత్రం యంత్రంలా అలుపెరుగకుండా బౌలింగ్‌ చేస్తూనే పోయాడు. మయాంక్‌ వికెట్‌తో ఒక్కసారిగా కదలిక... ఏదైనా సాధ్యమే అనిపించింది! కొద్ది సేపటి తర్వాత ఆ సమయం రానే వచ్చింది. 7 బంతుల వ్యవధిలో 3 వికెట్లు... అంతే! పదికి పది.. ఎజాజ్‌ యూనుస్‌ పటేల్‌ టెస్టు క్రికెట్‌లో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. 144 ఏళ్లు... 2,438 టెస్టుల చరిత్రలో జిమ్‌ లేకర్, అనిల్‌ కుంబ్లేల తర్వాత ఈ ఘనత సాధించిన మూడో బౌలర్‌గా నిలిచాడు.

పాతికేళ్లు తిరిగే సరికి...
శుక్రవారం తొలి రోజు 4 వికెట్లు తీసిన ఎజాజ్‌ పటేల్‌ ఆట ముగిసిన తర్వాత వాంఖెడే స్టేడియం నుంచి బయటకు వెళుతూ అక్కడి ‘ఆనర్స్‌ బోర్డ్‌’ వద్ద క్షణకాలం పాటు ఆగి బోర్డు వైపు చూస్తూ నిలబడ్డాడు. ఈ మైదానంలో సెంచరీలు సాధించిన, ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితా దానిపై ఉంది. రేపు మరో వికెట్‌ తీసి తన పేరు అక్కడ చేర్చాలని అతను అనుకున్నాడు. అయితే ఐదు వికెట్లే కాదు... మరికొన్ని గంటల్లో ఏకంగా 10 వికెట్లు తీసి చరిత్ర సృష్టిస్తానని అతను ఊహించి ఉండకపోవచ్చు!  

► ముంబైలోనే పుట్టిన ఎజాజ్‌ ఎనిమిదేళ్ల వయసులో ఉపాధి కోసం అతని కుటుంబం న్యూజిలాండ్‌కు తరలి వెళ్లింది. పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకునేందుకో, ఇక్కడే ఉండిపోయిన బంధుమిత్రులను కలిసేందుకో గతంలోనూ ఎజాజ్‌ చాలా సార్లు వచ్చాడు. కానీ ఈసారి మాత్రం పుట్టిన గడ్డపై ఒక అద్భుతాన్ని సృష్టించేందుకే వచ్చినట్లున్నాడు. బాంబేను వీడిన సరిగ్గా 25 ఏళ్ల తర్వాత మరో జట్టు తరఫున ఆడేందుకు వచ్చి భారత్‌పైనే అతను అత్యంత అరుదైన ఘనతను నమోదు చేశాడు. ఈ పాతికేళ్ల ప్రస్థానం అతని కళ్ల ముందు కచ్చితంగా సినిమా రీళ్లలా కదలాడి ఉంటుంది!

► ముంబై టెస్టుకు ముందు మూడేళ్ల కెరీర్‌లో ఎజాజ్‌ పటేల్‌ ఆడినవి 10 మ్యాచ్‌లే! 32.48 పరుగుల సగటుతో 29 వికెట్లు తీసిన సాధారణ లెఫ్టార్మ్‌ స్పిన్‌ బౌలర్‌. టీమ్‌ మేనేజ్‌మెంట్‌ లెక్కల్లో అతను ఆ జట్టు నంబర్‌వన్‌ స్పిన్నర్‌ కూడా కాదు. సాన్‌ట్నర్, ఇష్‌ సోధిల తర్వాతే అతనికి ప్రాధాన్యం. వీరిలో ఎవరైనా తప్పుకుంటేనే మ్యాచ్‌ దక్కే అవకాశం. కెరీర్‌ తొలి టెస్టులోనే ఐదు వికెట్ల ప్రదర్శనతో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచినా అది అతని కెరీర్‌ జోరుగా సాగేందుకు ఏమాత్రం పనికి రాలేదు. సరిగ్గా చెప్పాలంటే తాజా ప్రదర్శనకు ముందు 33 ఏళ్ల ఎజాజ్‌కు పెద్దగా గుర్తింపూ లేదు. కానీ ఇకపై ఎవరూ మరచిపోలేని విధంగా తన పేరును అతను చరిత్రలో చెక్కుకున్నాడు!

► న్యూజిలాండ్‌ వెళ్లిన తర్వాతే క్రికెట్‌పై ఎజాజ్‌కు ఆసక్తి కలిగింది. అయితే ఆటను అతను లెఫ్టార్మ్‌ పేస్‌ బౌలర్‌గా మొదలు పెట్టాడు. స్వింగ్‌ బౌలర్‌గా రాణించిన అతను ఆక్లాండ్‌ తరఫున అండర్‌–19 స్థాయిలో సౌతీతో సమానంగా అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. అయినా సరే న్యూజిలాండ్‌ అండర్‌–19 టీమ్‌లో అతనికి చోటు దక్కలేదు. 5 అడుగుల 8 అంగుళాల తన ఎత్తు పదునైన పేస్‌ బౌలింగ్‌కు పనికి రాదని కూడా అతను గుర్తించాడు. భవిష్యత్తులో కివీస్‌ తరఫున ఆడాలంటే ఏదైనా ప్రత్యేకంగా చేయాలని అర్థమైంది. తన క్లబ్‌ తరఫున ఇంగ్లండ్‌లో మ్యాచ్‌లు ఆడేందుకు వెళ్లిన ఎజాజ్‌కు న్యూజిలాండ్‌ మాజీ స్పిన్నర్‌ దీపక్‌ పటేల్‌ మార్గదర్శిగా నిలువగా... స్పిన్నర్‌గా ఎదిగేందుకు మంచి అవకాశాలు ఉన్నాయని భావించి కఠోర సాధన చేశాడు. వరుసగా మూడేళ్ల పాటు ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలవడంతో జాతీయ జట్టు పిలుపు లభించింది. 30 ఏళ్ల వయసులో న్యూజిలాండ్‌ తరఫున తొలి మ్యాచ్‌ ఆడే అవకాశం దక్కింది.  

► ఈ పది వికెట్ల జాతరలో ఎజాజ్‌ ప్రయోగాలేమీ చేయలేదు. సాంప్రదాయ లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ వేసే బంతులతోనే సత్తా చాటాడు. ‘లెన్త్‌’ మాత్రం తప్పకుండా జాగ్రత్త పడ్డాడు. సహచర బౌలర్లు కనీస స్థాయి ప్రదర్శన ఇవ్వకపోవడం కూడా అతనికి మేలు చేసింది. చివరకు రచిన్‌ రవీంద్ర పట్టిన క్యాచ్‌తో చిరస్మరణీయ ఘట్టం ఆవిష్కృతమైంది. అయితే దురదృష్టవశాత్తూ గత రెండు సందర్భాలకు భిన్నంగా ఇంత గొప్ప ఆట తర్వాత కూడా ఎజాజ్‌ ఓటమి పక్షానే నిలవాల్సి వస్తుందేమో!

నా క్రికెట్‌ కెరీర్‌లో ఇదే అత్యుత్తమ రోజు. ఇక ముందు కూడా ఇదే ఉంటుందేమో. అన్నీ కలిసి రావడంతోనే నేను ముంబైలో ఈ ఘనత సాధించగలిగాను. ఎంతో ఆశ్చర్యంగా అనిపిస్తోంది. నాకు, నా కుటుంబానికి ఇదో ప్రత్యేక క్షణం. ఇంకా నేను ఆనందం నుంచి తేరుకోలేకపోయాను. ఇలాంటి ఘనతకు అందించిన దేవుడికి కృతజ్ఞతలు. ‘10’ వికెట్ల క్లబ్‌లో చేరడం గర్వకారణం. కుంబ్లే ఘనత నాకు బాగా గుర్తుంది. ఎన్నోసార్లు ఆ వీడియో చూశా. ఇలాంటి క్షణాలు కెరీర్‌లో ఎప్పుడో గానీ రావు కాబట్టి చివరి వికెట్‌కు ముందు చాలా ఒత్తిడిలో ఉన్నా. ఆఖరి వికెట్‌ సమయంలో బంతి గాల్లోకి లేచినప్పుడు అందరం ఎంతో ఉత్కంఠ అనుభవించాం. పదో వికెట్‌ కోసం ఇతర బౌలర్లు వైడ్‌ బంతులు వేయాలనే చర్చే మాలో జరగలేదు. తొమ్మిది వికెట్లతో  కూడా నేను సంతృప్తి చెందేవాడిని.        
–ఎజాజ్‌ పటేల్‌

10 వికెట్ల క్లబ్‌లోకి ఎజాజ్‌కు స్వాగతం. పర్‌ఫెక్ట్‌10. చాలా బాగా బౌలింగ్‌ చేశావు. టెస్టు తొలి, రెండో రోజు ఇలాంటి ఘనత సాధించడం ఎంతో ప్రత్యేకం.
    –అనిల్‌ కుంబ్లే  , భారత మాజీ కెప్టెన్‌

మొత్తం టీమ్‌ను మన జేబులో వేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. నిజంగా ఇదో అసాధారణ ప్రదర్శన.     
–రవిశాస్త్రి, భారత మాజీ హెడ్‌ కోచ్‌

టెస్టుల్లో ఒకే ఇన్నింగ్స్‌లో 10కి 10 వికెట్లు తీసిన మూడో బౌలర్‌ ఎజాజ్‌ పటేల్‌. గతంలో ఇంగ్లండ్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ జిమ్‌ లేకర్‌ (1956 జూలైలో ఆస్ట్రేలియాపై మాంచెస్టర్‌లో 10/53)... భారత లెగ్‌ స్పిన్నర్‌ అనిల్‌ కుంబ్లే (1999 ఫిబ్రవరిలో పాకిస్తాన్‌పై ఢిల్లీలో; 10/74) మాత్రమే ఈ ఘనత సాధించారు.   న్యూజిలాండ్‌ తరఫున అత్యుత్తమ బౌలింగ్‌ ప్రదర్శన కూడా ఇదే. రిచర్డ్‌ హ్యాడ్లీ (9/52) రికార్డును ఎజాజ్‌ బద్దలుకొట్టాడు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement