న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. భారత్‌లో ఒకే వేదికపై అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా రికార్డు సాధించాడు. ఈ ఘనత సాధించిన తొలి కివీస్ క్రికెటర్ కూడా అతడే! అంతేకాదు.. మాతృదేశంలో.. విదేశీ జట్టుకు ఆడుతూ ఈ ఫీట్ నమోదు చేసిన అరుదైన రికార్డునూ అజాజ్ పటేల్ సొంతం చేసుకున్నాడు.
కాగా ముంబైలో జన్మించాడు అజాజ్ పటేల్. ఆ తర్వాత అతడి కుటుంబం న్యూజిలాండ్‌కు మకాం మార్చింది. అయితే, బాల్యం నుంచే క్రికెట్‌పై మక్కువ పెంచుకున్న అజాజ్ అంచెలంచెలుగా ఎదిగి కివీస్ ప్రధాన స్పిన్నర్లలో ఒకడిగా మారాడు. ఈ క్రమంలో 2021లో టీమిండియా- న్యూజిలాండ్ మధ్య జరిగిన టెస్టు సిరీస్‌తో ఒక్కసారిగా అతడు భారత్‌లో ఫేమస్ అయ్యాడు.
నాడు 10 వికెట్ల హాల్
ముంబైలోని వాంఖడే స్టేడియంలో నాడు టీమిండియాతో జరిగిన రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 10 వికెట్లు కూల్చాడు. జన్మనిచ్చిన గడ్డపై ఆకాశమే హద్దుగా చెలరేగి ఈ అరుదైన ఘనత సాధించాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ నాలుగు వికెట్లు అజాజ్ తన ఖాతాలో వేసుకున్నాడు. కానీ తన జట్టును గెలిపించలేకపోయాడు.
ఈసారి ఐదేసిన అజాజ్
ఇక తాజాగా టీమిండియాతో మ్యాచ్‌లో మరోసారి అజాజ్ పటేల్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ముంబై వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో ఐదు వికెట్లతో మెరిశాడు. ఓపెనర్ యశస్వి జైస్వాల్(30)తో పాటు శుబ్‌మన్ గిల్(90), మహ్మద్ సిరాజ్(0), సర్ఫరాజ్ ఖాన్(0), రవిచంద్రన్ అశ్విన్(6)ల వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
ఈ నేపథ్యంలో భారత్ ఒకే వేదికపై అత్యధిక వికెట్లు తీసిన పర్యాటక జట్టు బౌలర్ల జాబితాలో అజాజ్ పటేల్ చోటు సంపాదించాడు. వాంఖడే స్టేడియంలో ఇప్పటి వరకు అజాజ్ 19 వికెట్లు(10+4+5) పడగొట్టాడు.
భారత్‌లో ఒకే వేదికపై అత్యధిక వికెట్లు తీసిన పర్యాటక జట్టు బౌలర్లు
ఇయాన్ బోతమ్(ఇంగ్లండ్)- వాంఖడేలో 22 వికెట్లు
అజాజ్ పటేల్(న్యూజిలాండ్)- వాంఖడేలో 19 వికెట్లు
రిచీ బెనాడ్(ఆస్ట్రేలియా)- ఈడెన్ గార్డెన్స్‌లో 18 వికెట్లు
కర్ట్‌నీ వాల్ష్(వెస్టిండీస్)- వాంఖడేలో 17 వికెట్లు.
భారత్ 263 ఆలౌట్
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. టీమిండియా- న్యూజిలాండ్ మధ్య శుక్రవారం మొదలైన మూడో టెస్టులో ఇరుజట్ల బౌలర్లు రాణిస్తున్నారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్‌ను భారత్ 235 పరుగులకు తొలిరోజే ఆలౌట్ చేసింది. టీమిండియా స్పిన్నర్లు రవీంద్ర జడేజా ఐదు, వాషింగ్టన్ సుందర్ నాలుగు, పేసర్ ఆకాశ్ దీప్ ఒక వికెట్ దక్కించుకున్నారు. తర్వాత భారత్ బ్యాటింగ్ చేసింది.
ఈ క్రమంలో 86/4 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట మొదలుపెట్టిన టీమిండియా 263 పరుగులకు ఆలౌట్ అయింది. కివీస్ బౌలర్లలో అజాజ్ పటేల్ ఐదు వికెట్లు పడగొట్టగా.. గ్లెన్ ఫిలిప్స్, ఇష్ సోధి, మ్యాట్ హెన్రీ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
చదవండి: విధ్వంసకర ఇన్నింగ్స్.. భారత తొలి క్రికెటర్‌గా పంత్ రికార్డు
Comments
Please login to add a commentAdd a comment